Share News

ఎస్సీ వర్గీకరణ నివేదిక ఓ కొలిక్కి

ABN , Publish Date - Jan 25 , 2025 | 04:03 AM

రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక రూపకల్పన ఒక కొలిక్కి వస్తోంది. వర్గీకరణ కోసం సేకరించిన వివరాలపై అధ్యయనం దాదాపు పూర్తవ్వడంతో తాజాగా నివేదికలో పొందుపర్చాల్సిన అంశాలపై ఏకసభ్య కమిషన్‌ కసరత్తు చేస్తోంది.

ఎస్సీ వర్గీకరణ నివేదిక ఓ కొలిక్కి

  • ఫిబ్రవరి మొదటి వారంలో ప్రభుత్వానికి!

  • వివరాలపై అధ్యయనం దాదాపు పూర్తి

  • పొందుపరిచే అంశాలపై కమిషన్‌ కసరత్తు

  • విచారణలో 7-8 వేల దరఖాస్తులు

  • 1981 నుంచి ఎస్సీల వివరాల సేకరణ

  • అక్షరాస్యత నుంచి ఉద్యోగాల దాకా జాబితా

  • ప్రభుత్వంలో 94వేల మంది ఎస్సీ ఉద్యోగులు

హైదరాబాద్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక రూపకల్పన ఒక కొలిక్కి వస్తోంది. వర్గీకరణ కోసం సేకరించిన వివరాలపై అధ్యయనం దాదాపు పూర్తవ్వడంతో తాజాగా నివేదికలో పొందుపర్చాల్సిన అంశాలపై ఏకసభ్య కమిషన్‌ కసరత్తు చేస్తోంది. త్వరితగతిన ఈ ప్రక్రియను పూర్తిచేసి ఫిబ్రవరి మొదటి వారంలో ప్రభుత్వానికి నివేదికను సమర్పించనున్నది. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలంటూ ఎన్నో ఏళ్లుగా డిమాండ్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై సుప్రీంకోర్టులోనూ కేసు నడిచింది. ఎస్సీలను వర్గీకరించే హక్కు రాష్ట్రాలకు ఉందంటూ గత ఏడాది చివర్లో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఎస్సీల వర్గీకరణ కోసం 2024 నవంబరు 11న రిటైర్డ్‌ జస్టిస్‌ డాక్టర్‌ షమీమ్‌ అక్తర్‌ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటుచేసింది. నివేదిక సమర్పణకు 2025 జనవరి 10 దాకా గడువు ఇవ్వగా.. ఆశించిన సమాయానికి నివేదిక రూపకల్పన పూర్తికాలేదు. దీంతో తాజాగా కమిషన్‌ గడువును ఫిబ్రవరి 10వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలవారీగా పర్యటనలు, బహిరంగ విచారణలను నిర్వహించిన కమిషన్‌కు.. జిల్లాల్లో దాదాపు 7-8 వేల దాకా దరఖాస్తులు వచ్చాయి.


వర్గీకరణ కావాలంటూ 60-70 శాతం మంది విజ్ఞప్తి చేయగా.. మరో 30 శాతం మంది తమను మాదిగ, మాలలకు సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఉంచాలని కోరారు. కొంతమంది మాత్రం వర్గీకరణ.. రాజ్యాంగంలోని 341 అధికరణకు విరుద్ధమని తెలిపినట్టు సమాచారం. మాదిగ, మాల అనే భేదం చూడకుండా తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ చాలామంది విజ్ఞప్తి చేయగా.. మాలలకు అన్యాయం జరిగిందని కొన్ని ప్రాంతాల్లో, మాదిగలకు అన్యాయం జరిగిందంటూ మరికొన్ని ప్రాంతాల్లో కమిషన్‌కు వినతులు వచ్చినట్టు తెలిసింది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను కేటాయించి, తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ హైదరాబాద్‌లోని కమిషన్‌ కార్యాలయంలో కలిసి కొంతమంది విజ్ఞప్తి చేశారు. మొత్తమ్మీద.. ఏర్పాటైన కొద్దికాలంలోనే కమిషన్‌ ప్రజాభిప్రాయ సేకరణను పూర్తిచేసింది. ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం ఎస్సీ కులాలు ఎన్ని, ఏ కులం వారు ఎంతమంది ఉన్నారు, ఆయా కులాల్లోని ఉప కులాలు సహా వాటిలో ఎంత జనాభా ఉందనే అంశాలను తేల్చేపనిలో కమిషన్‌ నిమగ్నమైంది. ఇందుకోసం 1981 నుంచి ఉన్న ఎస్సీ జనాభా వివరాలను కమిషన్‌ సేకరించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 52.5 లక్షల మంది ఎస్సీలు ఉండగా.. వీరిలో మాదిగలు 33.5 లక్షలు, మాలలు 19 లక్షల మంది ఉన్నారు. దీని ప్రకారమే ఇప్పుడు వర్గీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.


ఇవి కూడా..

ఎస్సీల్లో అక్షరాస్యత శాతం ఎంత? విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్ధులు ఎంతమంది?, ఎస్సీ ఉపకార వేతనాలను ఎంతమంది అందుకున్నారు?, ఎస్సీ కార్పోరేషన్‌ ద్వారా స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయాన్ని ఎంతమంది పొందారనే వివరాలను కూడా కూడా కమిషన్‌ సేకరించింది.

  • ఎస్సీల్లో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారనే వివరాలను కూడా సేకరించింది. దాని ప్రకారం ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలో కలిపి దాదాపు 94 వేల మందికిపైగానే ఉన్నట్టు ఆయా శాఖలు ఇచ్చిన వివరాల ఆధారంగా వెల్లడైంది.

  • గతంలోగానీ ఇప్పుడుగానీ.. గ్రామ, మునిసిపాలిటీల్లో వార్డు సభ్యుని నుంచి ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ దాకా రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించిన వివరాలను కూడా కమిషన్‌ సేకరించింది.


అప్పుడు.. మళ్లీ ఇప్పుడు!

ఎస్సీలు, వర్గీకరణ, వారికి అమలుచేసే రిజర్వేషన్ల అంశంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హయాం నుంచే పలు వాదనలు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్‌ అమలవుతోంది. అయితే జనాభా ప్రకారం అధికంగా ఉన్న మాదిగలకు తక్కువ రిజర్వేషన్‌ వర్తిస్తుందనే వాదన ప్రధానంగా ఉంది. దీనికి 1965నాటి లోకూర్‌ కమిషన్‌ నివేదికలే నిదర్శమని మాదిగలు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీలను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా విభజించాలనే డిమాండ్‌ 1994లోనే తెరపైకి వచ్చింది. అనంతరం కొంతకాలానికి.. అంటే 1997లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం జస్టిస్‌ రామచంద్రరాజు కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఆ కమిషన్‌ సూచనల మేరకు 15ు రిజర్వేషన్‌ను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా విభజిస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. దాని ప్రకారం గ్రూపు-ఏలో రెల్లి సహా దాని అనుబంధంగా ఉన్న 12 కులాలకు కలిపి ఒక శాతం రిజర్వేషన్‌ కేటాయించి, వాటిని అట్టడుగు కులాలుగా గుర్తించారు. ఇక బీ గ్రూపులో మాదిగ దాని అనుబంధంగా ఉన్న మొత్తం 18 కులాలను చేర్చి వీరికి 7ు కోటా ఇచ్చారు. సీ గ్రూపులో మాల సహా 25 కులాలను చేర్చి, వీరికి 6 శాతం రిజర్వేషన్‌ కేటాయించారు. గ్రూపు-డీలో ఆది, ఆంధ్రులతోపాటు మరో నాలుగు కులాలను చేర్చి వారికి కూడా ఒక శాతం రిజర్వేషన్‌ను కేటాయించారు. కానీ, ఈ రిజర్వేషన్‌ల కేటాయింపుపై పలువురు కోర్టుకెళ్లడంతో హైకోర్టు ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. ఆ తరువాత ఉమ్మడి ఏపీ సర్కారు మరోసారి 2000 సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ కోసం రేషనలైజేషన్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అనే చట్టాన్ని ఆమోదించింది. కానీ ఆ చట్టాన్ని కూడా 2004లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇలా ఉమ్మడి ఏపీలో ఒకసారి ఎస్సీల వర్గీకరణ అంశంపై సుదీర్ఘ వ్యవహారం నడవగా.. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో మరోసారి ఎస్సీ వర్గీకరణ అంశం తెరపైకి వచ్చింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన వర్గీకరణపైనా మాదిగ, మాలల మధ్య వాదప్రతివాదాలు మొదలయ్యాయి. వర్గీకరణ వద్దని మాలలు, కావాలని మాదిగలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నివేదిక అందిన తరువాత ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకోనుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Virender Sehwag: విడాకులు తీసుకోనున్న వీరేంద్ర సెహ్వాగ్..

Kaleshwaram Commission: నేటి కాళేశ్వరం విచారణ.. అత్యంత కీలకం

Updated Date - Jan 25 , 2025 | 04:03 AM