Share News

Seethakka: భారీ వర్షాలతో దెబ్బతిన్న గ్రామీణ రహదారులు

ABN , Publish Date - Aug 17 , 2025 | 05:04 AM

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంచాయతీ రాజ్‌శాఖ పరిధిలోని గ్రామీణ రహదారులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

Seethakka: భారీ వర్షాలతో దెబ్బతిన్న గ్రామీణ రహదారులు

  • రూ.147.70 కోట్ల మేర నష్టం

  • మంత్రి సీతక్కకు అధికారుల నివేదిక

హైదరాబాద్‌, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంచాయతీ రాజ్‌శాఖ పరిధిలోని గ్రామీణ రహదారులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మొత్తం 84.97 కి.మీ మేర రోడ్లు దెబ్బతిన్నాయని, నష్టం విలువ రూ.147.70 కోట్లుగా ఉందని అధికారులు మంత్రి సీతక్కకు నివేదిక సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 48 ప్రాంతాల్లో ఉపరితల రోడ్లు దెబ్బతిన్నాయని, వీటి తాత్కాలిక మరమ్మతులకు రూ.3.32 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ.42.63 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. ఇక 77 ప్రాంతాల్లో కల్వర్టులు, లోకాజ్‌వేలు, క్లాస్‌ డ్రెయిన్ల నిర్మాణాలకు నష్టం వాటిల్లిందని, వీటి పునరుద్ధరణకు తాత్కాలికంగా రూ.1.55కోట్లు, శాశ్వత పనుల కోసం రూ.67.60 కోట్లు ఖర్చవుతుందని ఇంజనీర్లు అంచనా వేశారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా 30 ప్రాంతాల్లో రోడ్లకు గండ్లు పడ్డాయని, వాటి తాత్కాలిక పునరుద్ధరణకు రూ.1.06 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ.5.45 కోట్లు ఖర్చవుతాయని నివేదికలో పేర్కొన్నారు.


ఇలా రాష్ట్రవ్యాప్తంగా 124 ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయని అధికారులు మంత్రికి తెలిపారు. తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.6.02 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ.141.68 కోట్లు అవసరం అవుతాయని లెక్కించారు. కాగా, భారీ వర్షాల దృష్ట్యా ప్రజల అవసరాలను గమనించి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎమర్జెన్సీ పరిస్థితులపై తక్షణ స్పందన అవసరమని, ఏ సమస్య ఎదురైనా వెంటనే పునరుద్ధరణ పనులు ప్రారంభించాలని సూచించారు. ఇందుకోసం కలెక్టర్ల వద్ద ప్రత్యేక నిధులు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు మంత్రి సీతక్క తెలిపారు.

Updated Date - Aug 17 , 2025 | 05:04 AM