Share News

Bhoobharati Act: ప్రజల వద్దకే రెవెన్యూ అధికారులు

ABN , Publish Date - Jun 03 , 2025 | 05:44 AM

తెలంగాణ ప్రభుత్వం గతంలో జరిగిన భూ సంబంధిత అన్యాయాలను సరిచేయడానికి రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తోంది. భూభారతి చట్టం అమలులోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 55,000కు పైగా దరఖాస్తులు అందగా, వాటిలో 60% సమస్యలు పరిష్కరించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మూడవ దశలో జూన్ 4 నుంచి 20 వరకు అన్ని మండలాల్లో సదస్సులు జరగనున్నాయి.

Bhoobharati Act: ప్రజల వద్దకే రెవెన్యూ అధికారులు

ప్రజల వద్దకే రెవెన్యూ అధికారులు

నేటి నుంచి అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు

మానవీయ కోణంలో భూ సమస్యలు పరిష్కరించాలి

రెవెన్యూ అధికారులతో సమీక్షలో మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌/పాలకుర్తి, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): గతంలో జరిగిన తప్పులను సరిచేసేందుకు రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసి, భూ పరిపాలనను ప్రజల వద్దకే తీసుకెళుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్‌ 14న భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిన తర్వాత మొదటి దశలో ఏప్రిల్‌ 17 నుంచి 4 మండలాల్లో, రెండో దశలో మే 5 నుంచి 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామని గుర్తుచేశారు. మూడో విడతలో మంగళవారం నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించబోతున్నామన్నారు. అన్ని రెవెన్యూ గ్రామాలకు తహసీల్దార్‌ నేతృత్వంలోని బృందం వెళుతుందని, ‘ప్రజల వద్దకే రెవెన్యూ’ నినాదంతో భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తామని చెప్పారు. తొలి విడతలో 13వేలు, రెండో విడతలో 42వేల దరఖాస్తులు అందగా.. 60 శాతం సమస్యలను పరిష్కరించామన్నారు. వీటిలో సాదాబైనామా దరఖాస్తులూ ఉన్నాయని, ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున... త్వరలో పరిష్కారం చూపుతామన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా రెవెన్యూ శాఖ ఉంటుందని, అధికారులు సమర్థవంతంగా పనిచేసినప్పుడే ప్రభుత్వం ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. గత ప్రభుత్వంలో కొందరికే పరిమితమైన రెవెన్యూ సేవలను.. గ్రామ స్థాయిలో అందించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతోందన్నారు. జిల్లా కలెక్టర్లు మానవీయ కోణంలో భూ సమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజల వద్దకు వెళ్లే రెవెన్యూ బృందం కూడా మానవతా దృక్పథంతో వ్యవహరించి ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు.


భూభారతి దేశానికి రోల్‌ మోడల్‌

భూభారతి చట్టం దేశానికి రోల్‌ మోడల్‌గా నిలవనుందని మంత్రి పొంగులేటి అన్నారు. జనగామ జిల్లాలోని పాలకుర్తిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ తెచ్చిన ధరణికి కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని అన్నారు. మంగళవారం నుంచి రెవెన్యూ యంత్రాంగమే ప్రజల ఇంటి ముందుకొచ్చి భూ సమస్యలు తెలసుకుంటుందని వెల్లడించారు. ఆగస్టు 15 నాటికి సాధ్యమైనన్ని భూ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. రాష్ట్రంలో 6వేల మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను విధుల్లోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులుగా 2.10లక్షల మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ పథకం కింద నాలుగేళ్లలో 20లక్షల మందికి సాయం అందిస్తామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక అనేది నిరంతర ప్రక్రియ అని వెల్లడించారు.


ఇవీ చదవండి:

కేంద్రం హెచ్చరిక.. వెనక్కు తగ్గిన రైడ్ హెయిలింగ్ యాప్స్

పాక్‌కు గూఢచర్యం.. భారత యుద్ధ నౌకల వివరాలను చేరవేసిన ఇంజినీర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 03 , 2025 | 05:44 AM