Hyderabad: ఫ్యూచర్ సిటీ ఇక భారత్ ఫ్యూచర్ సిటీ
ABN , Publish Date - Jun 22 , 2025 | 03:43 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ పేరును భారత్ ఫ్యూచర్ సిటీగా మార్చింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మానస పుత్రికగా భావించి దూరదృష్టితో హైదరాబాద్ మహా నగరానికి అదనపు ఆకర్షణగా నాలుగో నగరాన్ని (ఫ్యూచర్‌సిటీ) నిర్మించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
పేరు మార్చిన ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వానికి మెట్రో రెండో దశ పార్ట్-2బి డీపీఆర్ సమర్పణ
3 కారిడార్లతో 81.6 కి.మీ మేర నిర్మాణం
నిర్మాణ వ్యయం రూ.19,579 కోట్లు
ఆర్‌జీఐఏ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కి.మీ
మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్ సిటీ, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ పేరును భారత్ ఫ్యూచర్ సిటీగా మార్చింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మానస పుత్రికగా భావించి దూరదృష్టితో హైదరాబాద్ మహా నగరానికి అదనపు ఆకర్షణగా నాలుగో నగరాన్ని (ఫ్యూచర్‌సిటీ) నిర్మించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి రూపకల్పన జరుగుతోంది. ఇకపై ప్యూచర్ సిటీ (ఫోర్త్‌సిటీ)ని భారత్ ఫ్యూచర్‌సిటీ పేరుతో ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తాజాగా మెట్రో రైలు మార్గాన్ని సైతం భారత్ ప్యూచర్ సిటీ లోపలి వరకు నిర్మించేందుకు హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ సర్వే చేపట్టి సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించింది. ఈమేరకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఔటర్ రింగురోడ్డు మీదుగా కొంగరకలాన్ ఎగ్జిట్ నుంచి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ మీదుగా మీర్‌ఖాన్‌పేట వరకు సుమారు 39.6 కి.మీ మేర మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు డీపీఆర్‌ను హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి శనివారం వెల్లడించారు.
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశలోని పార్ట్-2బీ డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వానికి అందజేసినట్టు తెలిపారు. రెండోదశలోని పార్ట్-2బీని మూడు మార్గాల్లో నిర్మించేందుకు ప్రతిపాదనలతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందించామన్నారు. ఇందులో ఆర్‌జీఐఏ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కి.మీ (రూ.7,168 కోట్లు), జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కి.మీ (రూ.6,946 కోట్లు), జేబీఎస్ నుంచి శామీర్‌పేట వరకు 22 కి.మీ (రూ.5,465 కోట్లు) కారిడార్లు ఉన్నాయి. ఈ మూడు కారిడార్లు కలిపి మొత్తం 86.1 కి.మీ దూరం ఉండగా, వాటి మొత్తం నిర్మాణ వ్యయం రూ.19,579 కోట్లు అవుతుందని తెలిపారు. ఇంతకు ముందు రెండో దశ పార్ట్-ఏ కింద 5 కారిడార్లకు సంబంధించిన డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వానికి అందజేశామని, వాటి మొత్తం దూరం 76.4 కిలోమీటర్లని ఆయన పేర్కొన్నారు. మెట్రో రెండో దశ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంయుక్తంగా నిర్మాణం చేపడతాయని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 30శాతం(రూ.5,874 కోట్లు), కేంద్ర ప్రభుత్వ వాటా 18 శాతం(రూ.3,524 కోట్లు) ఉంటుందని, మిగిలిన మొత్తాన్ని అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి అప్పులుగా 48 శాతం (రూ.9,398 కోట్లు) తీసుకొని నిర్మాణం చేపడతామని వివరించారు. ఇందులో పీపీపీ విధానంలో 4శాతం నిధులు సుమారు రూ.783 కోట్లు ఇతర ప్రైవేటు సంస్థలు పెట్టుబడి పెడతాయన్నారు.