Share News

Yasinagi Raithubharosa Payout for Sankranti: సంక్రాంతికి రైతుభరోసా!

ABN , Publish Date - Dec 26 , 2025 | 05:59 AM

యాసంగి రైతు భరోసా సాయం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గత వానాకాలం సీజన్‌లో 9 రోజుల్లోనే సుమారు రూ.9 వేల కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం..

Yasinagi Raithubharosa Payout for Sankranti: సంక్రాంతికి  రైతుభరోసా!

  • యాసంగి పెట్టుబడి సాయానికి రూ.9 వేల కోట్లు

  • జనవరిలో సాగు ముమ్మరం అప్పుడే నగదు బదిలీ

  • సరైన సమయంలో సాగు ఖర్చులకు పనికొచ్చేలా పంపిణీ

  • రైతులు, పంటల డేటా సిద్ధం చేస్తున్న వ్యవసాయశాఖ

  • ఉపగ్రహ చిత్రాల ద్వారా సాగు భూముల పరిశీలన

  • సాగుకు యోగ్యం కాని భూములను పథకం నుంచి మినహాయించే అవకాశం

  • అసెంబ్లీ సమావేశాల సమయంలో రైతు భరోసాపై మరింత స్పష్టత!

హైదరాబాద్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): యాసంగి రైతు భరోసా సాయం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గత వానాకాలం సీజన్‌లో 9 రోజుల్లోనే సుమారు రూ.9 వేల కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడూ అదే తరహాలో పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. డిసెంబరు నెలలో కొన్ని జిల్లాల్లో యాసంగి సాగు ప్రారంభమైనా జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా సాగు ముమ్మరం కానుంది. ఈ క్రమంలో సరైన సమయంలో సాగు ఖర్చులకు పనికొచ్చేందుకు వీలుగా.. సంక్రాంతి కానుకగా పెట్టుబడి సాయం అందించాలని భావిస్తోంది. రైతుభరోసా పథకం కోసం ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.18 వేల కోట్లు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా కోటిన్నర ఎకరాల మేర వ్యవసాయ భూములుండగా.. రెండు పంటలకు కలిపి ఎకరానికి రూ.12 వేల చొప్పున అందజేయనుంది. వానాకాలం సీజన్‌లో 69.40 లక్షల మంది రైతులకు రూ.8,744 కోట్లు పంపిణీ చేసింది. ఇప్పుడు యాసంగిలోనూ కాస్త అటూఇటూగా ఇదే స్థాయిలో నిధులు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడి, ఆర్థిక శాఖకు ఆదేశాలు రాగానే చెల్లింపులు ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నారు. జనవరి రెండో వారం నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి సంక్రాంతి పండుగ సమయంలో రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేసేలా చర్యలు చేపడుతున్నారు. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో.. సమావేశాలు ముగిసేలోపు రైతుభరోసా ఇచ్చే తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.


రైతులు, పంటల సాగు డేటా సేకరణ

వ్యవసాయశాఖ ఎప్పటికప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సాగు లెక్కలు నమోదు చేస్తోంది. వ్యవసాయ విస్తరణాధికారులు క్రాప్‌ బుకింగ్‌ పోర్టల్‌లో వివరాలు అప్‌లోడ్‌ చేస్తున్నారు. గత యాసంగి, వానాకాలం సాగు లెక్కలు, రైతుభరోసా చెల్లింపుల వివరాలను పరిశీలించడంతోపాటు.. ప్రస్తుత యాసంగి సీజన్‌లో ఎంత మంది రైతులకు, ఎన్ని ఎకరాలకు రైతుభరోసా చెల్లించాల్సి వస్తుంది? ఎకరానికి రూ.6 వేల చొప్పున మొత్తం అవసరమైన నిధులెన్ని అన్న వివరాలపై కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వివరాలన్నీ ఆర్థిక శాఖకు సమర్పించేందుకు సిద్ధం చేస్తున్నారు.

ఉపగ్రహ చిత్రాల ద్వారా పంటల సర్వే..

రాష్ట్రంలో కోటిన్నర ఎకరాలకుపైగా వ్యవసాయ భూముల జాబితాలో ఉన్నాయి. అందులో కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలతో కూడిన బీడు భూములు, స్థిరాస్తి వెంచర్లు కూడా ఉన్నాయి. పంటల సాగుకు వీలుకాని ఈ భూములను రైతు భరోసా నుంచి మినహాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి గతంలోనే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుచేసి... రైతులు, రైతుసంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, వ్యవసాయరంగ నిపుణుల నుంచి అభిప్రాయాలు కూడా సేకరించింది. అయినా గత వానాకాలం సీజన్‌లో దాదాపు మొత్తం విస్తీర్ణానికి రైతుభరోసా చెల్లించింది. అందులో సాగు యోగ్యంకాని సుమారు 5 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందినట్టు అంచనా. ఈ క్రమంలో సాగు భూములను, సాగు యోగ్యంకాని భూములను పక్కాగా ధ్రువీకరించడానికి ఉపగ్రహ చిత్రాల(శాటిలైట్‌ ఇమేజ్‌ మ్యాపింగ్‌) ద్వారా సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీకి ఈ బాధ్యత అప్పగించింది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రైతుభరోసా నిధులను జమ చేయనున్నట్టు తెలిసింది.

Updated Date - Dec 26 , 2025 | 06:37 AM