Panchayat Elections: ఎన్నికలకు వేళాయె
ABN , Publish Date - Nov 25 , 2025 | 05:02 AM
గ్రామాల్లో ఎన్నికల హడావుడికి వేళయింది! అధికారికంగా పార్టీలు లేకపోయినా.. పల్లెల్లో రంగురంగుల జెండాలు.. ఫ్లెక్సీలతో ప్రచారానికి రంగం సిద్ధమైంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ముందస్తు ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది....
జిల్లాలవారీగా గెజిట్లు ప్రచురించిన కలెక్టర్లు
ప్రతులను ఎస్‌ఈసీకి సమర్పించిన సర్కారు
వాటి ఆధారంగా షెడ్యూల్‌ను సిద్ధం చేయనున్న ఎస్‌ఈసీ
26న పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు చాన్స్
డిసెంబరు 11, 15, 19 తేదీల్లో పోలింగ్ జరిగే అవకాశం
కోడ్ అమల్లోకి రానున్న నేపథ్యంలో చీరల పంపిణీ, వడ్డీ మాఫీ పథకాల అమలును వేగవంతం చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ఎన్నికల హడావుడికి వేళయింది! అధికారికంగా పార్టీలు లేకపోయినా.. పల్లెల్లో రంగురంగుల జెండాలు.. ఫ్లెక్సీలతో ప్రచారానికి రంగం సిద్ధమైంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ముందస్తు ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. జిల్లాలవారీగా కలెక్టర్లు (హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలు మినహా) సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లకు సంబంధించిన గెజిట్ ప్రచురించారు. పూర్తి సమాచారంతో సదరు గెజిట్ కాపీలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్‌ఈసీ) పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సోమవారం సమర్పించింది. వాటి ఆధారంగా రిజర్వేషన్లను సూచిస్తూ ఎస్‌ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ను సిద్ధం చేయనుంది. ఈ మేరకు ఆయా విభాగాలు ఇప్పటికే కసరత్తు ప్రారంభించాయి. ఈ ప్రక్రియను పూర్తి చేసి.. ఈనెల 26న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ విడుదల చేయనున్నట్లు తెలిసింది. అదే జరిగితే.. బుధవారం నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, జిల్లా పంచాయతీ, పోలీసు శాఖ ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లు ఇటీవల సమావేశమై సమీక్షించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా.. సర్పంచు, వార్డు సభ్యు ల స్థానాలకు సంబంధించి మూడు దశల్లో ఎన్నికలు జరపాలని ఎస్‌ఈసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా, జిల్లాలవారీగా ఆయా మండలాల పరిధిలో సర్పంచు, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి ఏ దశలో ఎక్కడ ఎన్నికలు నిర్వహించాలన్న కార్యాచరణను కూడా ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం సర్పంచు, వార్డు సభ్యుల తొలిదశ పోలింగ్ డిసెంబరు 11న, రెండో దశ 15న, మూడో దశ 19న చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఒక్కో దశ ఎన్నికలకు ఆయా తేదీలను బట్టి ఎక్కడికక్కడ రిటర్నింగ్ అధికారులు ఆయా స్థానాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తారు.
చీరల పంపిణీ, వడ్డీ మాఫీల్లో జోరు
గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ 26న ప్రకటిస్తే.. అదే రోజు నుంచి కోడ్ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే, సంక్షేమ పథకాల అమలును సర్కారు వేగవంతం చేసింది. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలందరికీ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రంలోపు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ఎస్‌హెచ్‌జీ సంఘాలకు వడ్డీ లేని రుణ పథకం కింద మహిళలు గతంలో చెల్లించిన వడ్డీ మొత్తాన్ని తిరిగి చెల్లించే ప్రక్రియను సైతం పూర్తి చేయాలని సర్కారు నిర్దేశించింది. వడ్డీ మాఫీ మొత్తాన్ని మంగళవారం సాయంత్రంలోపు ఎస్‌హెచ్‌జీ మహిళల ఖాతాల్లో జమ చేసేందుకు క్షేత్రస్థాయి అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.