Rainfall: ఖరీఫ్.. బేఫికర్!
ABN , Publish Date - Aug 14 , 2025 | 04:28 AM
వానాకాలం పంటల సాగుపై రైతుల బెంగ తీరిపోయింది. సీజన్ ప్రారంభమైన తర్వాత జూన్, జూలైలో అరకొరగా కురిసిన వర్షాలు.. ఆగస్టు వచ్చేసరికి గాడిన పడ్డాయి. గడిచిన రెండు నెలల్లో 20 శాతం నుంచి 30 శాతం లోటు వర్షపాతం నమోదుకాగా..
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు
సాధారణ వర్షపాతం కంటే 4% ఎక్కువ
చెరువులు, జలాశయాల్లోకి సమృద్ధిగా నీటి నిల్వలు
హైదరాబాద్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): వానాకాలం పంటల సాగుపై రైతుల బెంగ తీరిపోయింది. సీజన్ ప్రారంభమైన తర్వాత జూన్, జూలైలో అరకొరగా కురిసిన వర్షాలు.. ఆగస్టు వచ్చేసరికి గాడిన పడ్డాయి. గడిచిన రెండు నెలల్లో 20 శాతం నుంచి 30 శాతం లోటు వర్షపాతం నమోదుకాగా.. ఈ నెలలో ఆ లోటు భర్తీ కావడంతోపాటు సాధారణ వర్షపాతానికి మించి 4 శాతం ఎక్కువగా నమోదైంది. నైరుతి రుతుపవనాలు బలంగా విస్తరించటంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం (ఈ నెల 13) నాటికి రాష్ట్రంలో 452.5 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 471.7 మి.మీ వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే ఇది 4 శాతం ఎక్కువ కావటం గమనార్హం. జూన్‌లో 20 శాతం లోటు వర్షపాతం నమోదుకాగా, జూలైలో 5 శాతం నమోదైంది. ఈ నెలలో 13 రోజుల వ్యవధిలోనే 37 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మొత్తమ్మీద జూన్‌లో 104.2 శాతం, జూలైలో 237.9 శాతం, ఆగస్టులో ఇప్పటివరకు 129.6 మి.మీ వర్షపాతం నమోదుకావటం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా 621 మండలాలు ఉంటే.. 48 మండలాల్లో అత్యధిక వర్షపాతం, 180 మండలాల్లో అధిక వర్షపాతం, 289 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 104 మండలాల్లో మాత్రం కాస్త లోటు వర్షపాతం ఉన్నట్లు ప్రభుత్వం నివేదికలో వెల్లడించింది.
పంటల సాగుకు బేఫికర్
ఈ సీజన్‌లో కోటి 33 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ ప్రణాళికలో పేర్కొనగా.. జూన్, జూలై నెలల్లో వర్షాలు సరిగా పడకపోవటంతో రైతులకు ఆ భరోసా కలగలేదు. ఆగస్టు వచ్చేసరికి వర్షాలు సమృద్ధిగా కురవటంతో... ఖరీఫ్ సాగుకు ఒక ఢోకా ఉండదని రైతులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భారీ, మధ్యతరహా జలాశయాలతోపాటు చెరువులు, కుంటల్లోకి వర్షపు నీరు భారీగా వచ్చి చేరింది. నీటి వనరులన్నీ వరద నీటితో కళకళలాడుతున్నాయి. ఇప్పటికే పంటల సాగు విస్తీర్ణం కోటి ఎకరాలు దాటిపోయింది. పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కంది పంటలు దాదాపుగా పూర్తి విస్తీర్ణంలో సాగుచేశారు. ఇంకా వరి నాట్లు పూర్తి స్థాయిలో పడలేదు. ఈ నెలాఖరు వరకు పూర్తయ్యే అవకాశాలున్నాయి.