Share News

BC Reservation: ఐక్యంగా పోరాడి.. రిజర్వేషన్లు సాధిస్తాం!

ABN , Publish Date - Aug 07 , 2025 | 03:44 AM

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఐక్యంగా పోరాడి సాధించుకుందామని తెలంగాణ రాష్ట్ర మంత్రులు పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు.

BC Reservation: ఐక్యంగా పోరాడి.. రిజర్వేషన్లు సాధిస్తాం!

  • రాష్ట్రపతి సమయం ఇస్తారని ఆశిస్తున్నాం

  • కేంద్రం ఇకనైనా కళ్లు తెరవాలి

  • జంతర్‌మంతర్‌ ధర్నాలో రాష్ట్ర మంత్రులు

న్యూఢిల్లీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఐక్యంగా పోరాడి సాధించుకుందామని తెలంగాణ రాష్ట్ర మంత్రులు పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. మహాధర్నాలో వారు మాట్లాడారు. బీజేపీ, బీఆర్‌ఎ్‌సలు బీసీల రిజర్వేషన్లకు అడ్డుతగులుతున్నాయని ఆరోపించారు. ‘‘రాష్ట్రపతిని సమయం అడిగి చాలారోజులవుతోంది. ఆమె సమయం ఇస్తారని ఆశిస్తున్నాం. బీసీలకు రిజర్వేషన్లు దక్కాలంటే రాజ్యంగ సవరణ కావాలి. బీసీలపై బీజేపీకి ఎందుకింత అక్కసో అర్థం కావడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్‌ బీసీల కోసం మొసలి కన్నీరు కార్చింది. ఇప్పుడు రిజర్వేషన్ల కోసం చట్టాన్ని చేస్తే మాతో కలిసి రావట్లేదు’’ అని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ‘‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. కానీ, నాలుగు నెలలుగా ఈ ఫైల్‌ రాష్ట్రపతి వద్దే ఉంది. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచైనా రిజర్వేషన్లు సాధిస్తాం’’ అని మంత్రి ఉత్తమ్‌ చెప్పారు.


ఐక్య పోరాటాలు చేద్దాం: పొన్నం

‘‘బీసీ రిజర్వేషన్లు తెలంగాణకే పరిమితం కాదు. ఇది దేశవ్యాప్తంగా ఎన్నో కోట్లమంది కల. బీసీలకు రిజర్వేషన్లు ఎవరికీ వ్యతిరేకం కాదు. 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఐక్యంగా పోరాటాలు చేద్దాం’’ అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. ‘‘బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ నడిబొడ్డున ఇంత పెద్ద ధర్నా జరుగుతుంటే.. కేంద్రం మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఇది ముమ్మాటికీ బీసీలపై చిన్నచూపే. రాజకీయాలకు అతీతంగా అసెంబ్లీలో మద్దతు లభించింది. బీసీల ఆవేదనను అర్థం చేసుకొని, కేంద్రం కళ్లు తెరవాలి’’ అని మంత్రి దామోదర అన్నారు.


మోదీ డీఎన్‌ఏలోనే బీసీ వ్యతిరేకత: సీతక్క

‘‘తాను బీసీనని చెప్పుకొంటున్న మోదీ.. బీసీలకు బద్ధశత్రువులా వ్యవరిస్తున్నారు. మోదీ డీఎన్‌ఏలోనే బీసీ వ్యతిరేకత ఉంది. తెలంగాణ బీజేపీ నేతలకు దమ్ముంటే ఢిల్లీలో ధర్నా చేయాలి. బీసీలను వ్యతిరేకించే బీజేపీని ఊర్లలోకి రాకుండా తరిమి కొట్టాలి’’ అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ‘‘బీఆర్‌ఎస్‌ పదేళ్లలో బీసీ మహిళలకు మంత్రి పదవి ఇవ్వలేదు. అప్పుడు కవిత ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడేమో బీసీ గొంతుక తానే అన్నట్లు డ్రామాలు చేస్తోంది. బీసీ బిల్లుకు అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. బిల్లు ఢిల్లీకి వచ్చాక బీజేపీ బీసీ నేతల గొంతు మూగబోయింది. ఎంపీ పదవి రాగానే కృష్ణయ్య గొంతు బీసీలకు వ్యతిరేకంగా మారిపోయింది’’ అని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.


నిబద్ధతతో పనిచేసిన రాష్ట్ర ప్రభుత్వం: కోమటిరెడ్డి

‘‘బీసీల కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమంతా నిబద్ధతతో పనిచేసింది. అసెంబ్లీ అంతా ఏకమై బిల్లుకు ఆమోదం తెలిపింది. బీజేపీ ద్వంద్వ నీతిని తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ‘‘బీసీలపై కక్షసాధింపు ధోరణిని కేంద్రం విడనాడాలి. బీసీలకు మద్దతుగా ఢిల్లీలో ధర్నా జరుగుతుంటే తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు పాల్గొనడం లేదు?’’ అని అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ప్రశ్నించారు. ‘‘బీసీ రిజర్వేషన్లు వందేళ్ల కల. ఆ కలను కాంగ్రెస్‌ ప్రభుత్వం సాకారం చేస్తోంది. దీనికి బీజేపీ నేతలు అడ్డుపడడం సరికాదు. బీసీలు మంచి చేస్తే జీవితకాలం గుర్తుంచుకుంటారు. కీడు చేస్తే.. ఎప్పటికీ క్షమించరు’’ అని మంత్రి వాకిటి శ్రీహరి హెచ్చరించారు.

బీసీ రిజర్వేషన్లు ఇచ్చేదాకా వదలం: విజయశాంతి

బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించం. కేంద్రం దిగివచ్చేదాకా వదలం. బీజేపీ అధికారంలో కూర్చున్న కుర్చీ బీసీలు తయారు చేసిందేనని గుర్తు చేసుకోవాలి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు

ఈడీ విచారణ అనంతరం విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు

Updated Date - Aug 07 , 2025 | 03:44 AM