Share News

High Court: తప్పులు కొనసాగితే హైడ్రాను రద్దు చేస్తాం

ABN , Publish Date - Feb 21 , 2025 | 04:45 AM

‘ఎందుకంత తొందర.. ఏం చేసినా చట్ట ప్రకారం చేయాలే తప్ప ఇష్టం వచ్చినట్లు కాద’ంటూ గురువారం హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా ఏకపక్ష చర్యలను తప్పుబట్టింది. వీటన్నింటినీ నమోదు చేయడానికి రిజిస్టర్‌ పెట్టాల్సి వస్తుందేమోనని వ్యాఖ్యానించింది.

High Court: తప్పులు కొనసాగితే హైడ్రాను రద్దు చేస్తాం

  • వాటి నమోదుకు రిజిస్టర్‌ పెట్టాలేమో!

  • దోపిడీ దొంగల్లా వ్యవహరించొద్దు

  • హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం

  • భూముల రక్షణకు వ్యతిరేకం కాదు.. చట్ట ప్రకారమే జరగాలని స్పష్టీకరణ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ‘ఎందుకంత తొందర.. ఏం చేసినా చట్ట ప్రకారం చేయాలే తప్ప ఇష్టం వచ్చినట్లు కాద’ంటూ గురువారం హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా ఏకపక్ష చర్యలను తప్పుబట్టింది. వీటన్నింటినీ నమోదు చేయడానికి రిజిస్టర్‌ పెట్టాల్సి వస్తుందేమోనని వ్యాఖ్యానించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే హైడ్రాను రద్దు చేస్తామని ఒక దశలో హెచ్చరించింది. ‘సరైన విచారణ నిర్వహించకుండా వారాంతాల్లో కూల్చివేతలకు పాల్పడుతున్నారు. దోపిడీ దొంగలు మాత్రమే అలా వ్యవహరిస్తారు. ఆక్రమణలు, అనుమతి లేని భవనాల కూల్చివేతకు మేం ఏ మాత్రం వ్యతిరేకం కాదు. కానీ ప్రతి దానికి చట్టం అంటూ ఉంటుంది. చట్టాలను అమలు చేసి తీరాల్సిందే’ అని తేల్చిచెప్పింది.


సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగిలో మూడు గుంటల భూమిలోని షెడ్‌ను ఎలాంటి సమాచారం లేకుండా ఆదివారం కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ ప్రవీణ్‌ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు హైడ్రా ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ హైకోర్టు ఎదుట హాజరయ్యారు. హైడ్రా న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సెలవు రోజుల్లో కూల్చివేతలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘మీరు ప్రతిసారీ ఇలాగే చెబుతున్నారు. మళ్లీ అదే తప్పు చేస్తున్నారు. హైకోర్టు ఫుల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలను లెక్కచేయకుండా వ్యవహరిస్తే హైడ్రాను రద్దు చేస్తాం’అని వ్యాఖ్యానించింది. గతంలో ఇచ్చిన యథాతథ స్థితి ఆదేశాలను పొడిగించింది. తదుపరి విచారణ మార్చి 5కు వాయిదా వేసింది. కాగా, హైడ్రా స్టాండింగ్‌ కౌన్సెల్‌గా కౌటూరి పవన్‌కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. మూడేళ్ల వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు

Updated Date - Feb 21 , 2025 | 04:45 AM