Justice Sujoy Paul: అన్ని రంగాల్లో మహిళలకు గౌరవం దక్కాలి
ABN , Publish Date - Jul 04 , 2025 | 04:35 AM
అన్ని రంగాల్లో మహిళలకు సరైన ప్రాతినిధ్యం, గౌరవం దక్కాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ అన్నారు.
జస్టిస్ సుజోయ్‌పాల్
హైదరాబాద్, జూలై 3 (ఆంధ్రజ్యోతి): అన్ని రంగాల్లో మహిళలకు సరైన ప్రాతినిధ్యం, గౌరవం దక్కాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ అన్నారు. మధ్యప్రదేశ్‌లో మహిళా న్యాయమూర్తుల సంఖ్య 50 శాతం దాటిందని, భవిష్యత్తులో పురుషులే రిజర్వేషన్ కోరాల్సిన అవసరం రావచ్చని పేర్కొన్నారు. హైకోర్టు జెండర్ సెన్సిటైజేషన్ అండ్ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానం కార్యక్రమాన్ని గురువారం హైకోర్టు బార్ అసోసియేషన్‌లో నిర్వహించారు.
ఈ సందర్భంగా జస్టిస్ పాల్ మాట్లాడుతూ తెలంగాణలో సైతం మహిళా న్యాయమూర్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, రిజర్వేషన్ లేకుండానే హైకోర్టులో 30 శాతం కంటే ఎక్కువ మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారని పేర్కొన్నారు. కమిటీ చైర్‌పర్సన్ జస్టిస్ మాధవీదేవి మాట్లాడుతూ.. హైకోర్టులో లింగ వివక్ష లేకుండా చూడటంతోపాటు ఫిర్యాదులపై విచారణ చేపట్టేందుకు ఈ కమిటీ ఏర్పాటైందని తెలిపారు. దీనికి కేవలం రెండు ఫిర్యాదుల మాత్రమే వచ్చాయని, వాటిని సైతం పరిష్కరించామని పేర్కొన్నారు. కమిటీ సభ్యురాలు జస్టిస్ శ్రీదేవి మాట్లాడుతూ మహిళలకు గౌరవప్రదమైన పని వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ ఛైర్మన్ నర్సింహారెడ్డి, టీహెచ్‌సీఏఏ అధ్యక్షుడు ఏ జగన్ పాల్గొన్నారు.