Telangana High Court: మునిసిపల్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు
ABN , Publish Date - Sep 02 , 2025 | 04:28 AM
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది..
రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం నుంచి వివరాలు తెలుసుకుని తమ ఎదుట ఉంచాలని అదనపు అడ్వకేట్ జనరల్‌కు స్పష్టం చేసింది. ఈ ఏడాది మార్చి 25న నిర్మల్ మున్సిపాలిటీ పదవీకాలం ముగిసినా.. ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాల్ చేస్తూ రాజేందర్ అనే రైతు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది నరేశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. మున్సిపాలిటీల్లో ఎన్నికైన సభ్యులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గడువు ముగిసిన స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణ ప్రక్రియ చేపట్టాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎ్‌సఈసీ).. ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని వాదించారు. ఎస్‌ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది జి. విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ.. వార్డుల పునర్విభజన వంటి ముందస్తు ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసి, రిజర్వేషన్లను తెలియజేస్తే ఎన్నికల నిర్వహణకు కమిషన్ సిద్ధంగా ఉందన్నారు. శాంతిభద్రతలు, ఎన్నికల విధులు, ఇతర సిబ్బంది.. వంటి అంశాల్లో ప్రభుత్వం సిద్ధంగా ఉంటేనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుందని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వం వివరణ సమర్పించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్, హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై కొన్ని ఘడియల్లో విచారణ
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు
For More TG News And Telugu News