Telangana High Court: బీసీ రిజర్వేషన్ల అమలుకుజీవో ఎలా ఇచ్చారు
ABN , Publish Date - Oct 09 , 2025 | 05:33 AM
తెలంగాణలో 42శాతం స్థానిక రిజర్వేషన్ల జీవోను ఏ ప్రాతిపదికన జారీ చేశారని హైకోర్టు ప్రశ్నించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు....
తమిళనాడు తరహాలో రిజర్వేషన్ల సవరణ చట్టాన్ని ఏమైనా నోటిఫై చేశారా?
బిల్లులు గవర్నర్ ఆమోదించకున్నా ఆమోదించిననట్లు భావించి గెజిట్ ఇచ్చారా?
అంతకుముందు ఇచ్చిన ఆర్డినెన్స్‌లు గెజిట్ అయ్యాయా?
50ు పరిమితిని ఎలా అధిగమిస్తారు?
రాష్ట్రం యూనిట్‌గా బీసీలకు 42శాతం ఎలా ఇస్తారు?
డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చే ముందు అభ్యంతరాలు ఏమైనా స్వీకరించిందా?
సదరు నివేదికను పబ్లిష్ చేశారా?.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ప్రశ్నలు
తెలుసుకుని చెప్తామన్న ఏజీ సుదర్శన్‌రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి
తదుపరి విచారణ నేటి మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా
విచారణకు హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు.. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున జోక్యం చేసుకోవద్దని హైకోర్టుకు ప్రభుత్వ విజ్ఞప్తి
బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా కేసులో ఇంప్లీడ్ అవ్వండి
బీజేపీ, బీఆర్‌ఎస్, మజ్లి్‌సలకు మంత్రి పొన్నం వినతి
హైదరాబాద్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో 42శాతం స్థానిక రిజర్వేషన్ల జీవోను ఏ ప్రాతిపదికన జారీ చేశారని హైకోర్టు ప్రశ్నించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు 50ు దాటకూడదన్న సూత్రాన్ని ఎలా అధిగమిస్తారని నిలదీసింది. ఈ మేరకు పలు కీలక ప్రశ్నలను సంధించింది. ఆ వివరాలను తెలుసుకుని చెబుతామని అడ్వకేట్ జనరల్ కోరడంతో.. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకుండా, విచారణను గురువారం మధ్నాహ్నానికి వాయిదా వేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42ు రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో బుధవారం వాదనలు కొనసాగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్విలకు చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం కీలక ప్రశ్నలు సంధించింది. ‘‘తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్లు గరిష్ఠంగా 50ు దాటరాదన్న నిబంధనను సవరించే బిల్లును అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్‌కు పంపారు. గవర్నర్ ఆమోదం తెలపకున్నా స్థానిక సంస్థల్లో బీసీలకు 42ు రిజర్వేషన్ల జీవో ఇచ్చారు. బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకున్నా తెలిపినట్లు భావించి (డీమ్డ్ కన్సెంట్) తమిళనాడు తరహాలో సవరణ చట్టాన్ని ఏమైనా నోటిఫై చేశారా? లేక బిల్లుల కంటే ముందు జారీచేసిన ఆర్డినెన్స్‌ను గెజిట్ చేశారా? ‘వికాస్ కిషన్‌రావు గవాలీ వర్సెస్ మహారాష్ట్ర’ కేసులోఎట్టిపరిస్థితుల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటరాదన్న సుప్రీంకోర్టు సూత్రాన్ని ఎలా అధిగమిస్తారు? ఎంపరికల్ డేటా తీశామంటున్నారు.
సదరు డేటా అందుబాటులో ఉన్నప్పుడు స్థానిక సంస్థలు యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్లు ప్రకటించాల్సి ఉండగా.. రాష్ట్రం యూనిట్‌గా 42శాతం రిజర్వేషన్లను ఎలా అమలు చేస్తారు? ట్రిపుల్ టెస్ట్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్‌ను నియమించింది అంటున్నారు.. మరి సదరు కమిషన్ నివేదిక ఇచ్చే ముందు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించిందా? ఆ నివేదికను పబ్లిష్ చేశారా? పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంచారా?’’ అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే గవర్నర్ బిల్లులను ఆమోదించకపోయినా, ఆమోదించినట్లు భావించి సవరణ చట్టాలను నోటిఫై చేశారా? ఆర్డినెన్స్‌ను గెజిట్ చేశారా? అన్న ప్రశ్నలకు తమ వద్ద సమాచారం లేదని.. ప్రభుత్వం నుంచి సూచనలు తీసుకుని చెబుతామని అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి, ీన్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టుకు చెప్పారు.
ఆ జీవో చెల్లదు: పిటిషనర్లు
తొలుత బీసీలకు 42శాతం రిజర్వేషన్ల జీవోను వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేసిన మాధవరెడ్డి తదితర తరఫున సీనియర్ న్యాయవాదులు వివేక్‌రెడ్డి, మయూర్‌రెడ్డి, జే.ప్రభాకర్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం జారీచేసిన జీవో 9 ఏ కోణంలో చూసినా నిలబడే పరిస్థితి లేదని కోర్టుకు వివరించారు. సొంత చట్టాలను ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీచేయడం చెల్లదని స్పష్టం చేశారు. అంతేగాకుండా సవరణ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండగానే జీవో ఇచ్చారని కోర్టుకు విన్నవించారు. ‘‘మహారాష్ట్రలో రిజర్వేషన్ బిల్లులు చట్టాలుగా మారి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కూడా సుప్రీంకోర్టు రిజర్వేషన్లను కొట్టేసింది. తెలంగాణలో సవరణ బిల్లు ఇంకా చట్టంగా మారలేదు. ఒకవేళ చట్టంగా మారినా రిజర్వేషన్లు 50శాతం మించితే వాటిని కొట్టేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పైగా బీసీల విషయంలో 2024 కుల సర్వే, ఎస్సీ, ఎస్టీల విషయంలో 2011 నాటి జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తామంటే కుదరదు’’ అని వివరించారు. ఇక ఎంబీసీ వర్గాల పిటిషనర్ల తరఫున న్యాయవాది మలుగారి సుదర్శన్ వాదిస్తూ.. మొత్తం బీసీలకు కలిపి 42శాతం రిజర్వేషన్ అమలు చేస్తే, బీసీల్లో అభివృద్ధి చెందిన కులాలే బాగుపడతాయని.. అత్యంత వెనుకబడిన కులాలకు న్యాయం జరగాలంటే ఏ, బీ, సీ, డీ కేటగిరీల వారీగా రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు.
తగిన డేటా తీశాకే జీవో ఇచ్చాం: రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ.. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిర్దేశించిన అన్ని సూత్రాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించిందని వివరించారు. సాంకేతిక, విశ్లేషణాత్మక, గణాంకాల డేటా తీశాకే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రభుత్వం తన విధాన నిర్ణయాల్లో భాగంగా డెడికేటెడ్ కమిషన్‌ను నియమించిందని, ఆ కమిషన్ నివేదికను ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకుంటుందే తప్ప బయటపెట్టాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. శాస్త్రీయమైన డేటా ఉన్న తర్వాత 50శాతం గరిష్ఠ పరిమితి ఎలా వర్తిస్తుందని.. సుప్రీం ధర్మాసనం ఇచ్చిన ‘వికాస్ కిషన్‌రావు గవాలీ’ తీర్పులో లోపం ఉందని వ్యాఖ్యానించారు. అయితే సుప్రీం తీర్పును విశ్లేషించే అధికార పరిధి తమకు లేదని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఇక ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైన దశలో కోర్టులు జోక్యం చేసుకోవడానికి, మధ్యంతర స్టే ఇవ్వడానికి ఆస్కారం లేదని అభిషేక్ మనుసింఘ్వి ఽపేర్కొన్నారు. మరోవైపు బీసీ రిజర్వేషన్లను సమర్థిస్తూ ఇంప్లీడ్ పిటిషన్లు వేసిన జాజుల శ్రీనివా్‌సగౌడ్, వీహెచ్, ఇందిరా శోభన్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఇతర బీసీ సంఘాలు, కులసంఘాల వాదనలు కూడా వినాలని వారి తరఫు సీనియర్ న్యాయవాదులు బీఎస్ ప్రసాద్, చిక్కుడు ప్రభాకర్, వి. రఘునాథ్ తదితరులు ధర్మాసనాన్ని కోరారు. ప్రభుత్వం తరఫున వాదనలు ఇంకా ఉన్నాయని ఏజీ సుదర్శన్‌రెడ్డి చెప్పారు. అయితే అప్పటికే కోర్టు సమయం ముగియడంతో ధర్మాసనం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండానే విచారణను గురువారం మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది. మధ్యంతర ఉత్తర్వుల దశలో ఇంప్లీడ్ పిటిషనర్ల వాదనలు వినబోమని, తుది విచారణ సందర్భంగా వింటామని పేర్కొంది. మొత్తంగా బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4.40 గంటల వరకు కొనసాగింది. కాగా, బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బుధవారం హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. 42శాతం బీసీ రిజర్వేషన్లతో వారికి ఆర్థికంగా, రాజకీయంగా సముచిత స్థానం దక్కుతుందన్నారు. కాగా, హైకోర్టులో బుధవారం జరిగిన విచారణ తీరును బట్టి బీసీలకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం కలిగిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్ పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా 60 బీసీ సంఘాల నేతలు ఇంప్లీడ్ అయినట్టు తెలిపారు. రాజకీయ అవసరాల కోసం కాకుండా బీసీల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్న వారంతా రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.