Share News

JEE Advanced 2025 results: గురుకుల విద్యార్థుల ప్రతిభ

ABN , Publish Date - Jun 03 , 2025 | 06:14 AM

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో తెలంగాణ గురుకుల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. సాంఘిక సంక్షేమ గురుకులాల నుంచి 97 మంది డైరెక్ట్‌ ర్యాంకులు, 132 ప్రిపరేటరీ ర్యాంకులు పొందారు. గిరిజన గురుకులాల విద్యార్థుల్లో 8 మంది ఓపెన్‌ క్యాటగిరీలో ర్యాంకులు సాధించగా, 82 మందికి ఐఐటీల్లో సీట్లు వచ్చే అవకాశం ఉంది.

JEE Advanced 2025 results: గురుకుల విద్యార్థుల ప్రతిభ

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో తెలంగాణ గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలకు చెందిన 492 మంది పరీక్షకు హాజరవగా.. 97 మంది డైరెక్ట్‌ ర్యాంకులు, 132 మంది ప్రిపరేటరీ ర్యాంకులు సాధించారని గురుకుల కార్యదర్శి అలగు వర్షిణి తెలిపారు. తెలంగాణ గిరిజన గురుకులాల సంస్థ, ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌కు చెందిన 146 మంది విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారని ఆ సంస్థ కార్యదర్శి సీతాలక్ష్మి తెలిపారు. మొత్తం 285 మంది శిక్షణ పొందగా.. 8 మంది ఓపెన్‌ క్యాటగిరీలో ర్యాంకులు సాధించారని, 20 మందికి వెయ్యిలోపు ర్యాంకులు వచ్చాయని, 82 మందికి ఐఐటీల్లో సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

సత్తా చాటిన గిరిజన విద్యార్థులు

ఖమ్మం జిల్లా నుంచి ఎస్టీ విభాగంలో ఇద్దరు విద్యార్థులు సత్తా చాటారు. అజ్మీరా రోషిక్‌ మణిదీప్‌ జాతీయ స్థాయిలో 5వ ర్యాంక్‌, హసావత్‌ జశ్వంత్‌రామ్‌ 9వ ర్యాంక్‌ సాధించారు. ఇంజనీర్‌గా స్థిరపడాలనే లక్ష్యంతోనే చదువుతున్నట్లు రోషిక్‌ చెప్పాడు. భవిష్యత్తులో సివిల్‌ సర్వీసె్‌సలో స్థిరపడాలన్నది తన లక్ష్యమని జశ్వంత్‌రామ్‌ తెలిపాడు. మహబూబాబాద్‌ జిల్లా తూర్పుతండాకు చెందిన గుగులోతు హిమాన్షు ఎస్టీ విభాగంలో ఆలిండియా 12వ ర్యాంకు సాధించాడు.

మంచి గైడెన్స్‌తోనే..: అర్ణవ్‌ నిఘమ్‌

ఉపాధ్యాయులిచ్చిన మంచి గైడెన్స్‌తో చదవడం వల్లే ఆలిండియా ఓపెన్‌ క్యాటగిరీలో 11వ ర్యాంకు సాధించా. మాక్‌ టెస్టులు క్రమం తప్పకుండా రాయడంతో ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసుకుంటూ తర్వాత రాసే పరీక్షలో ఆ తప్పులు జరగకుండా జాగ్రత్త పడేవాణ్ణి. సబ్జెక్టులపై అవగాహన వచ్చే వరకు చదవడంతో పాటు పరీక్షల సమయంలో భయం లేకుండా రాశా. ఐఐటీ ముంబైలో చేరతా.


కంప్యూటర్‌ సైన్స్‌లో చేరతా: అజయ్‌రెడ్డి

పదో తరగతి నుంచి ఒక లక్ష్యంతో చదువుతుండడంతో ఆలిండియా ఓపెన్‌ క్యాటగిరీలో 19వ ర్యాంకు సాధించగలిగా. ఉదయం నుంచి రాత్రి వరకు ఎలాంటి ఒత్తిడి లేకుండా రోజూ మాక్‌ టెస్టులు రాశా. ఐఐటీ ముంబైలో కంప్యూటర్‌ సైన్స్‌లో చేరతా.

18 గంటలు ఇష్టంతో చదివా: జ్ఞాన రుత్విక్‌సాయి

రోజూ 18 గంటలు ఇష్టపడి చదవడం వల్లే ఓబీసీ విభాగంలో మొదటి ర్యాంకు సాధించా. చిన్నప్పటి నుంచి ఉన్నతస్థాయికి చేరాలనే లక్ష్యంతోనే చదువుతున్నా. ఐఐటీ ముంబైలో కంప్యూటర్‌ సైన్స్‌లో చేరతా.

మరికొన్ని ఉత్తమ ర్యాంకులు సాధించిన తెలుగు విద్యార్థులు..

ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా గుణానుపురం గ్రామానికి చెందిన పల్ల భరత్‌చంద్ర ఆలిండియా ఓపెన్‌ క్యాటగిరీలో 21వ ర్యాంకు, ఓబీసీలో 2వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. విజయనగరం జిల్లాకు చెందిన పీతల ఆనంద చక్రవర్తి 118వ ర్యాంకు సాధించాడు. తెలంగాణలోని పరిగి విద్యార్థి కె.ప్రణవ్‌తేజ 136వ ర్యాంకు సాధించారు. ఏపీకి చెందిన ఎం.జయచంద్ర 169వ ర్యాంకు, పి.ఆదిత్య అభిషేక్‌ 257, జి.శ్రీరామశశాంక్‌ 281, జాగాన యోగేశ్వర్‌ 284, వై.శుభశ్రీవల్లీ ఆత్రేయి 296, పొట్నూరు కార్తీక్‌ 419వ ర్యాంకు సాధించారు.


ఇవీ చదవండి:

కేంద్రం హెచ్చరిక.. వెనక్కు తగ్గిన రైడ్ హెయిలింగ్ యాప్స్

పాక్‌కు గూఢచర్యం.. భారత యుద్ధ నౌకల వివరాలను చేరవేసిన ఇంజినీర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 03 , 2025 | 06:14 AM