Share News

స్థానిక రిజర్వేషన్లు ఎలా!

ABN , Publish Date - Jun 29 , 2025 | 04:59 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది.

స్థానిక రిజర్వేషన్లు ఎలా!

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీ ఓవైపు.. అన్ని సామాజిక వర్గాలకు కలిపి 50 శాతం రిజర్వేషన్లు మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పు మరోవైపు.. రిజర్వేషన్లను 30 రోజుల్లో ఖరారు చేసి స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశం ఇంకోవైపు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల అంశాన్ని త్వరగా తేల్చే దిశగా సర్కారు కసరత్తు ప్రారంభించింది.

  • బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జీవో ఇవ్వొచ్చా?

  • చట్టం లేకుండా ఉత్తర్వులు సాధ్యమేనా?

  • అడ్వొకేట్‌ జనరల్‌తో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు

  • రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న

  • సుప్రీంకోర్టు తీర్పు పైనా సమాలోచనలు

  • రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే చాన్స్‌

  • తొలుత ఏ ఎన్నికలనే దానిపైనా స్పష్టత

  • ముందు పంచాయతీలేనన్న అభిప్రాయాలు

హైదరాబాద్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. 42 శాతానికి పెంచుతూ జీవో ఇవ్వాలంటే చట్టపరంగా సాధ్యమేనా? లేక ప్రస్తుతమున్న రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలా? అనే దానిపై సలహా ఇవ్వాలని అడ్వొకేట్‌ జనరల్‌ను కోరింది. జీవో ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నా.. దానికి చట్టపరమైన ప్రాతిపదిక లేదన్న అంశం తాజాగా తెరపైకి వచ్చింది. ఇప్పుడున్న చట్టం ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు సుమారు 23 శాతమే రిజర్వేషన్లు ఉన్నాయి. వాటిని 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో బిల్లులను ఆమోదించి కేంద్రానికి పంపారు. కానీ, అవి చట్టరూపం దాల్చలేదు. దీంతో చట్టం కాకుండానే రిజర్వేషన్లను పెంచుతూ కార్యనిర్వాహక ఉత్తర్వులు ఇవ్వొచ్చా.. అనే అంశం తెరపైకి వచ్చింది. దీనిపైనా ప్రభుత్వం అడ్వకేట్‌ జనరల్‌ అభిప్రాయం కోరింది. రెండు, మూడు రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. ఆ వెంటనే రిజర్వేషన్లను ఖరారు చేసి ఎన్నికలకు వెళ్లనుంది. రిజర్వేషన్ల వ్యవహారం కొలిక్కి వచ్చాక.. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలా? సర్పంచ్‌ ఎన్నికలా? అనే అంశంపైనా సర్కారు నిర్ణయం తీసుకోనుంది.


నిర్ణయం తేలితే.. వారంలో రిజర్వేషన్ల ఖరారు

సుప్రీంకోర్టు తీర్పు, ప్రత్యేక జీవో విడుదల అంశాలపై ప్రభుత్వం న్యాయ నిపుణులతోనూ చర్చిస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రత్యేక జీవో ఇచ్చినా.. అది చెల్లుబాటయ్యేది అనుమానమేనని అంటున్నారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పును అధిగమించి ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రత్యేక జీవో ఇవ్వాలంటే రాష్ట్రపతి ఆదేశమైనా ఉండాలి, లేదా రిజర్వేషన్ల పెంపునకు రాష్ట్రాలకు అవకాశమైనా ఉండాలని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండూ లేనందున ప్రత్యేక జీవో ఇవ్వడానికి కూడా ఆస్కారం లేదని చెబుతున్నారు. ప్రభుత్వం భావిస్తున్న 42 శాతం ప్రకారం ముందుకెళ్లాలా? డెడికేటెడ్‌ కమిషన్‌ రిపోర్టు ప్రకారం వెళ్లాలా? లేదంటే ప్రస్తుతం అమల్లో ఉన్న రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరపాలా? అని అధికారులు ఆలోచిస్తున్నారు. అయితే డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదికపై ఇటీవల జరిగిన క్యాబినెట్‌ భేటీలో చర్చ జరిగినప్పటికీ.. ఇంకా ఆ నివేదిక పంచాయతీరాజ్‌ శాఖకు చేరలేదు. నివేదిక అందాక ప్రభుత్వం సూచించిన మేరకు రిజర్వేషన్లను వారం పది రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉంటుందని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.


తొలుత ఏ ఎన్నికలు?

రిజర్వేషన్లను తేల్చాక తొలుత ఏ ఎన్నికలు నిర్వహిస్తారన్న చర్చ జరుగుతుండడంతో.. ప్రభుత్వం కూడా దీనిపై ఆలోచన చేస్తోంది. వాస్తవానికి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన తరువాత సర్పంచ్‌ ఎన్నికలు జరిపేవారు. అది కాంగ్రెస్‌ ఆనవాయితీ. ఇటీవల ఓ మంత్రి కూడా తన నియోజకవర్గ నేతలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని సమాయత్తం కావాలని సూచించారు. దీంతో రాష్ట్రంలో తొలుత ఈ ఎన్నికలే జరుగుతాయన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు ముందుగా సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించి, కేంద్రానికి వివరాలు సమర్పిస్తే పెండింగ్‌లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులను కొంతమేరైనా రాబట్టుకునే అవకాశం ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది.


రిజర్వేషన్ల పెంపునకు అడ్డంకి ఇదే!

అన్ని సామాజిక వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు గతంలో పలు కేసుల్లో ఇచ్చిన తీర్పే బీసీలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపునకు ఆటంకంగా మారింది. ఒకవేళ రిజర్వేషన్లను పెంచాలంటే రాజ్యాంగంలో సవరణలు చేయాలి. తర్వాత వాటిని షెడ్యూల్‌ 9లో చేర్చాలి. అప్పుడే బీసీలకు 42 శాతంతోపాటు రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల అమలుకు అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయితే, పార్లమెంటు ఆమోదం పొందాలంటే రిజర్వేషన్లపై గతంలో సుప్రీంకోర్టు తీర్పులు వెలువరించిన సమయంలో సూచించిన పలు నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. వాటి ప్రకారం.. బీసీలకు కచ్చితంగా ఎక్కువ రిజర్వేషన్‌ అమలు చేయాలనే వివరాలను పార్లమెంటుకు నివేదించాలి. అందుకోసమే ప్రభుత్వం కులసర్వే నిర్వహించింది. దాంతోపాటు బీసీ రిజర్వేషన్ల గుర్తింపునకు డెడికేటె డ్‌ కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్‌ రిపోర్టు ప్రకారమే బీసీలకు రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో బిల్లు పెట్టి తీర్మానించింది. బిల్లులు కేంద్రానికి వెళ్లి నెలలు గడుస్తున్నా స్పందన లేదు.

Updated Date - Jun 29 , 2025 | 10:11 AM