Indiramma Houses: నివాసం ఉండకుంటే ఇళ్ల కేటాయింపు రద్దు?
ABN , Publish Date - Jul 29 , 2025 | 04:38 AM
లబ్ధిదారులు నివాసం ఉండకుండాఖాళీగా ఉంటోన్న రెండు పడకల ఇళ్ల కేటాయింపును రద్దు చేయాలని ప్రభుత్వ విభాగాలు భావిస్తున్నాయి. కేటాయించి రెండేళ్లు కావస్తోన్నా ఇప్పటికీ దాదాపు 37 ఇళ్లలో లబ్ధిదారులు ఉండడం లేదు.
లబ్ధిదారులకు ఇప్పటికే నోటీసులు
37% మేర 2 పడకల ఇళ్లు ఖాళీ
శివార్లలోని ఇళ్లకు వెళ్లేందుకు లబ్ధిదారుల అనాసక్తి
హైదరాబాద్ సిటీ, జూలై 28(ఆంధ్రజ్యోతి): లబ్ధిదారులు నివాసం ఉండకుండాఖాళీగా ఉంటోన్న రెండు పడకల ఇళ్ల కేటాయింపును రద్దు చేయాలని ప్రభుత్వ విభాగాలు భావిస్తున్నాయి. కేటాయించి రెండేళ్లు కావస్తోన్నా ఇప్పటికీ దాదాపు 37 ఇళ్లలో లబ్ధిదారులు ఉండడం లేదు. శివారు ప్రాంతాల్లో ఇళ్లు ఉండడం.. అక్కడకు వెళితే ఉపాధి లభిస్తుందో లేదోనని కొందరు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. సొంత ఇళ్లు ఉన్న వారికీ రెండు పడకల ఇళ్లు రావడమూ ఖాళీగా ఉండేదుకు మరో కారణంగా అధికారులు గుర్తించారు. గ్రేటర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ఇటీవల మంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చినట్టు తెలిసింది. లబ్ధిదారులను ఎంపిక చేసినా ఖాళీగా ఉన్న ఇళ్లను గుర్తించి కేటాయింపు రద్దు చేయాలని మంత్రి సూచించినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి చర్యలు ప్రారంభించాలని హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటికే కొందరికి మొదటి విడత నోటిసులు జారీ చేసినట్టు రెవెన్యూ విభాగం వర్గాలు చెబుతున్నాయి. నిర్ణీత గడువులోగా ఇళ్లలోకి వెళ్లకపోతే కేటాయింపు రద్దు చేస్తామని నోటీసుల్లో పేర్కొంటున్నారు.
నిబంధనల ప్రకారం మరో రెండు పర్యాయాలు నోటీసులు ఇచ్చి రద్దు చేస్తామని ఓ తహసీల్దార్ చెప్పారు. మంత్రితోనూ కలెక్టర్లు ఇదే విషయం చెప్పినట్టు సమాచారం. హైదరాబాద్ శివార్లలోని కొల్లూరు, రాంపల్లి, పిర్జాదిగూడ, దుండిగల్, డీ పోచంపల్లి తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున రెండు పడకల ఇళ్ల సముదాయాలు నిర్మించారు. కొల్లూరులో 15600 ఇళ్లు ఉండగా.. మెజార్టీ ఇళ్లు కేటాయించగా ప్రస్తుతం 11 వేల కుటుంబాలు ఉంటున్నాయని ఓ అధికారి తెలిపారు. ఇతర ప్రాంతాల్లోనూ ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. కొన్ని చోట్ల పూర్తిస్థాయిలో వసతులు లేకపోవడంతో ఇళ్లలో ఉండేందుకు కొందరు ఆసక్తి చూపడం లేదు. ఎంపికైన లబ్ధిదారుల్లో చాలా మంది కూలీ పని, ఇళ్లలో పని చేసుకునే వారే. నగరం విడిచి వెళితే ఉపాధి దొరకదనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. నగరంలోపల నిర్మించిన ఇళ్లలో మాత్రం లబ్ధిదారులు నివాసముంటున్నారు. ఇళ్లను అద్దెకివ్వడం, అమ్మడమూ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని, అలాంటి కేటాయింపులనూ రద్దు చేసే విషయాన్ని పరిశీలించనున్నట్టు తెలిసింది.
ఇవి కూడా చదవండి..
కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు, మోదీకి ఫోన్ కాల్ రాలేదు
22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్
For More National News and Telugu News..