Share News

Telangana: నెలాఖరుకు 70వేల కోట్లకు అప్పు

ABN , Publish Date - Mar 05 , 2025 | 03:03 AM

బడ్జెట్‌లో అంచనా వేసిన అప్పుకంటే ఎక్కువగా తీసుకుంటుండడం గమనార్హం. అయితే... కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ఈ రుణం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర జీఎ్‌సడీపీ ఈసారి ఆశాజనకంగా ఉంటుందని, పైగా...

Telangana: నెలాఖరుకు 70వేల కోట్లకు అప్పు

ఈ నెలాఖరు నాటికి చేరే అవకాశం.. బడ్జెట్‌లో వేసిన అంచనాలకు మించి సేకరణ!

ఇప్పటికే రూ.63,586 కోట్లకు చేరిక

మంగళవారం రూ.2వేల కోట్ల సేకరణ

హైదరాబాద్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పు నానాటికీ పెరిగిపోతోంది. ఈ నెలాఖరుకు ఆ మొత్తం రూ. 70 వేల కోట్లకు చేరనుందని అంచనా. బడ్జెట్‌లో అంచనా వేసిన అప్పుకంటే ఎక్కువగా తీసుకుంటుండడం గమనార్హం. అయితే... కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ఈ రుణం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర జీఎ్‌సడీపీ ఈసారి ఆశాజనకంగా ఉంటుందని, పైగా... పాత రుణాల కిస్తీలు, వడ్డీలను చెల్లించాల్సి వస్తోందని కేంద్రానికి వివరించినట్లు సమాచారం. నిజానికి ఈసారి బడ్జెట్‌లో మొత్తం రూ.57,112 కోట్ల రుణాలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ... కేంద్ర ప్రభుత్వం రూ.49,255 కోట్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అయినా... ఈ చివరి త్రైమాసికం(జనవరి, ఫిబ్రవరి, మార్చి)లో మొత్తం రూ.30 వేల కోట్ల రుణాన్ని తీసుకుంటామని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ప్రతిపాదించింది. కానీ... కేంద్ర ప్రభుత్వం అంత మొత్తం అప్పునకు అనుమతి ఇవ్వలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో రూ.10 వేల కోట్లకుగాను రూ.4,800 కోట్లు, ఫిబ్రవరిలో రూ.10 వేల కోట్లకుగాను రూ.3000 కోట్ల రుణాలను మాత్రమే సేకరించగలిగింది. ఇలా జనవరి నాటికి రాష్ట్రం అప్పు రూ.58,586.64 కోట్లకు చేరింది.


ఫిబ్రవరి 4న తీసుకున్న రూ.3000 కోట్లతో కలిపి ఈ రుణం రూ.61,586 కోట్లు అయ్యింది. తాజాగా మంగళవారం మరో రూ.2000 కోట్ల అప్పు తీసుకుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన ఈ-వేలం ద్వారా ఈ రుణాన్ని సేకరించింది. 22 ఏళ్ల కాల పరిమితి 7.27 శాతం వార్షిక వడ్డీతో రూ.1000 కోట్లు, 24 ఏళ్ల కాల పరిమితి 7.27 శాతం వార్షిక వడ్డీతో రూ.1000 కోట్ల చొప్పున ఈ అప్పును తీసుకున్నది. దీంతో రాష్ట్రం అప్పు మంగళవారం నాటికి రూ.63,586 కోట్లకు చేరింది. ఈ నెల 11న రూ.2,500 కోట్లు, 18న రూ.2000 కోట్లు, 25న రూ.2,500 కోట్ల రుణాలు తీసుకుంటామని చివరి త్రైమాసికం ఇండెంట్లలో భాగంగా ఆర్‌బీఐకి ప్రతిపాదించింది. అయితే... వీటికి కేంద్రం నుంచి అనుమతి లభిస్తుందా లేదా అన్నది చూడాలి. ఒకవేళ వీటికి కూడా అనుమతి లభిస్తే... రాష్ట్రం అప్పు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.70 వేల కోట్లకు చేరే అవకాశముంది. సాధారణంగా కేంద్రం అనుమతించిన మేరకే రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులను సేకరించాల్సి ఉంటుంది.


జీఎ్‌సడీపీని ముందస్తుగానే అంచనా వేసి రాష్ట్రాలు... వివిధ రంగాల్లో ఉత్పత్తి బాగా ఉందని, జీఎ్‌సడీపీ మరింత పెరిగే అవకాశముందంటూ కేంద్రాన్ని ఒప్పిస్తాయి. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా జీఎ్‌సడీపీ పెరుగుతుందంటూ కేంద్రాన్ని ఒప్పించినట్లు సమాచారం. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం... జీఎ్‌సడీపీలో 3 శాతం మేర రుణాలు తీసుకునే అవకాశముంది. జీఎ్‌సడీపీ మెరుగ్గా ఉంటే... రుణాలు కూడా కాస్త ఎక్కువ మేర తీసుకునే వెసులుబాటు ఉంటుంది. పాత రుణాల కిస్తీలు, వడ్డీల కింద ప్రతి నెలా తాము రూ.6,500 కోట్ల మేర చెల్లిస్తున్నామంటూ ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్ర రాబడులు, అప్పులు కలిపి ప్రతి నెలా రూ.18,500 కోట్ల వరకు ఉంటున్నాయని, కానీ... వ్యయాలు మాత్రం రూ.22,500 కోట్లు ఉంటున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇలాంటి ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కోడానికి అప్పుల విషయంలో రాష్ట్రానికి కాస్త వెసులుబాటు కల్పించాలని కేంద్రాన్ని కోరుతున్నారు.


ఇవి కూడా చదవండి

PM Modi: సింహం పిల్లలకు మోదీ ఫీడింగ్.. వీడియో వైరల్

Aurangazeb Row: ఔరంగజేబు వ్యాఖ్యల వివాదంపై అబూ అజ్మి క్షమాపణ

Bihar: అసెంబ్లీ ఎన్నికల వేళ.. మళ్లీ ఆయనకే బీజేపీ అధ్యక్ష పగ్గాలు

Bird flu: బర్డ్‌ఫ్లూపై కలెక్టర్ ఏమన్నారంటే..

Akhilesh Yadav: మనుషులా? మరబొమ్మలా?.. వారానికి 90 గంటల పనిపై అఖిలేష్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 05 , 2025 | 03:03 AM