Share News

దశలవారీగా రాజీవ్‌ స్వగృహ ఆస్తుల వేలం

ABN , Publish Date - Jul 03 , 2025 | 04:01 AM

రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న అపార్ట్‌మెంట్లు, ఓపెన్‌ ప్లాట్లు, ఫ్లాట్లను దశలవారీగా వేలం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

దశలవారీగా రాజీవ్‌ స్వగృహ ఆస్తుల వేలం

నాలుగు దశల్లో పూర్తి చేయాలని ప్రభుత్వ నిర్ణయం.. మొదటి దశలో ఫ్లాట్లు, రెండో దశలో అపార్టుమెంట్లు

  • తర్వాతి దశలో ఓపెన్‌ ప్లాట్లు, నాలుగో దశలో భూములు

  • ఫ్లాట్లలో చ.అడుగుకు రూ.2,250 నుంచి రూ.3వేలు ధర

  • తొలి దశ వేలానికి రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్‌!

హైదరాబాద్‌, జూలై 2 (ఆంధ్ర‌‌‌‌జ్యోతి): రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న అపార్ట్‌మెంట్లు, ఓపెన్‌ ప్లాట్లు, ఫ్లాట్లను దశలవారీగా వేలం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వేలం వేయనున్న ఆస్తుల వివరాలపై రెండు, మూడు రోజుల్లో ప్రకటనను విడుదల చేయనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. వేలం ప్రక్రియను నాలుగు దశల్లో పూర్తి చేయాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. ఏ దశలో ఏ ఆస్తులను వేలం వేయాల న్న వివరాలను కూడా అధికారులు సిద్ధం చేశారు. తొలి దశలో మేడ్చల్‌ జిల్లాలోని అపార్ట్‌మెంట్లలో పూర్తయిన ఫ్లాట్లతో పాటు మరికొన్నిచోట్ల ఉన్న ఆస్తులను వేలం వేయనున్నారు. పోచారం, బండ్లగూడ, గాజులరామారం తదితర ప్రాంతాల్లోని ఆస్తులకు రేట్లను కూడా ఖరారు చేశారు. బండ్లగూడలో పూర్తయిన అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లకు చదరపు అడుగుకు రూ.3వేలుగా, అసంపూర్తిగా ఉన్న వాటికి రూ.2,750గా ధర నిర్ణయించారు. పోచారంలో పూర్తయిన ఫ్లాట్‌లో చదరపు అడుగు రూ.2,500, అసంపూర్తి వాటికి రూ.2,250 చొప్పున ధరలను ఖరారు చేశారు. రాజీవ్‌ స్వగృహ ఆస్తుల వేలంతో ప్రభుత్వానికి దాదాపు రూ.3,538కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి, ఎంత విస్తీర్ణం ఉందనే అన్ని వివరాలను ఇప్పటికే లెక్కతేల్చారు. నిధుల సమీకరణలో భాగంగా ఏర్పాటైన క్యాబినెట్‌ సబ్‌కమిటీ ఇటీవల హౌసింగ్‌ బోర్డు, రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌లో ఉన్న ఆస్తులను వేలం వేసేందుకు పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. హౌసింగ్‌ బోర్డు పరిధిలోని ఆస్తులను ఇప్పటికే దశల వారీగా వేలం వేస్తుండగా.. తాజాగా రాజీవ్‌ స్వగృహ ఆస్తుల వేలానికి కూడా రంగం సిద్ధమైంది.


ఎక్కడెక్కడ ఎన్ని ఫ్లాట్లు

మేడ్చల్‌ జిల్లా పరిధిలోని పోచారం(సద్భావన)లో 601 ఫ్లాట్లున్నాయి. ఇక్కడ 2బీహెచ్‌కే డీలక్స్‌-2, 3బీహెచ్‌కే-4, 2బీహెచ్‌కే-340, సింగిల్‌ బెడ్‌ రూమ్‌, హాల్‌, కిచెన్‌-205 చొప్పున ఉండగా.. వీటిని వేలం వేస్తే రూ.99.50కోట్లు వస్తాయని అంచనా. ఇదే జిల్లా పరిధిలోని బండ్లగూడ (సహభావన టౌన్‌షిప్‌)లో 159 ఫ్లాట్లు ఉన్నాయి. వీటిలో 3బీహెచ్‌కే డీలక్స్‌-3, 3బీహెచ్‌కే-8, 2బీహెచ్‌కే-19, 1బీహెచ్‌కే-129 ఫ్లాట్లున్నాయి. వీటిని వేలం వేస్తే రూ.28.93 కోట్లు వస్తాయని భావిస్తున్నారు. ఇక రెండో దశలో నిర్మాణం పూర్తి కాని అపార్ట్‌మెంట్లను వేలం వేయాలని ప్రాఽథమికంగా నిర్ణయించారు. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలోని గాజులరామారంలో 5, పోచారంలో 6, జవహర్‌నగర్‌లో 17, ఖమ్మంలో పోలేపల్లి దగ్గర 8 అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. వీటి వేలంతో దాదాపు రూ.725.23కోట్ల వరకు ఆదాయం రావొచ్చని అంచనా వేస్తున్నారు. కామారెడ్డి, నల్లగొండ, వికారాబాద్‌ జిల్లాల్లో ఉన్న 367 ఇళ్లను కూడా మొదటి లేదా రెండో దశలో వేలం వేయనుండగా.. రూ.38.81కోట్ల వరకు ఆదాయం వస్తుందనే అంచనాతో అధికారులు ఉన్నారు.


భూముల వేలంతోనే రూ.2,043కోట్లు

ఇక, మూడో దశలో రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న ఓపెన్‌ ప్లాట్లను వేలం వేయాలని నిర్ణయించారు. రంగారెడ్డి జిల్లా తొర్రూరులో 514, కవాడిపల్లిలో40, కుర్మలగూడలో 20, చందానగర్‌లో 3, నిజామాబాద్‌ జిల్లాలోని మల్లారంలో 294, గాజులరామారంలో 12, బహదూర్‌పల్లిలో 69, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పోతులమడుగులో 111, అమిస్తాపూర్‌లో 45, ఆసిఫాబాద్‌ జిల్లాలోని బోరేగావ్‌లో 73, కామారెడ్డిలో 79, నల్లగొండ జిల్లా ఎల్లారెడ్డిగూడలో 52, వికారాబాద్‌ జిల్లా కోకట్‌లో 10, ఆదిలాబాద్‌ జిల్లా బట్టిసావర్‌గావ్‌లో 9, జోగులాంబ గద్వాల జి ల్లాలోని గద్వాలలో 8, కరీంనగర్‌ జిల్లా నుస్తులాపూర్‌లో 3 ఓపెన్‌ ప్లాట్లు ఉన్నాయి. వీటని వేలం వేస్తే రూ.613.34 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. నాలుగో దశలో కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న భూములను వేలం వేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్లను విడుదల చేయనున్నారు. మొత్తం భూముల్లో కొన్నిచోట్ల కోర్టు కేసులుండగా, మరికొన్నిచోట్ల ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. ఈ భూముల వేలంతో దాదాపు రూ.2,043కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా.

Updated Date - Jul 03 , 2025 | 04:01 AM