Share News

Telangana: వేలానికి 400 ఎకరాలు

ABN , Publish Date - Mar 05 , 2025 | 03:04 AM

అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాత దీనిని చేపట్టనుంది. తద్వారా, సుమారు రూ.30 వేల కోట్ల నిధులు సేకరించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. ఈ మేరకు కన్సల్టెంట్ల నుంచి ప్రతిపాదనలు కోరుతూ (రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌) టీజీఐఐసీ ప్రకటన ఇచ్చింది.

 Telangana: వేలానికి 400 ఎకరాలు

అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు.. కంచ గచ్చిబౌలిలో లే అవుట్‌.. 5 విడతల్లో వేలం

రూ.30 వేల కోట్ల ఆదాయమే లక్ష్యం.. కన్సల్టెంట్ల నుంచి ప్రతిపాదనలు కోరుతూ టీజీఐఐసీ ప్రకటన

7న ప్రీ బిడ్‌ సమావేశం.. ఈనెల 15 వరకు బిడ్‌ దాఖలుకు గడువు

హైదరాబాద్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక వనరుల సమీకరణ కోసం భూముల వేలానికి సర్కార్‌ సిద్ధమైంది. అత్యంత విలువైన కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను లే అవుట్‌ వేసి వేలం ప్రక్రియ ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాత దీనిని చేపట్టనుంది. తద్వారా, సుమారు రూ.30 వేల కోట్ల నిధులు సేకరించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. ఈ మేరకు కన్సల్టెంట్ల నుంచి ప్రతిపాదనలు కోరుతూ (రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌) టీజీఐఐసీ ప్రకటన ఇచ్చింది. సదరు కన్సల్టెంట్‌ రెండు ప్రిలిమినరీ, తుది మాస్టర్‌ ప్లాన్‌ లే అవుట్‌ను రూపొందించి సర్కారుకు అందజేయాల్సి ఉంటుంది. రంగారెడ్డి జిల్లా శేర్‌లింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి పరిధిలోని సర్వే నంబరు 25 (పి) పరిధిలో 400 ఎకరాల భూములున్నాయి. సైబరాబాద్‌, హైటెక్‌ సిటీ, ఫైనాన్షియల్‌ జిల్లా, రాయదుర్గం తదితర ప్రాంతాలకు సమీపంలోనే ఈ భూములున్నాయి. వేలానికి ప్రతిపాదించిన భూమి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 33 కి.మీ. దూరంలో; సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి 22 కి.మీ.; హైటెక్‌ సిటీ నుంచి 7-8 కి.మీ. దూరంలో ఉంది. ఈ భూముల్లో అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి భారీ లే అవుట్‌ను రూపొందించిన తర్వాత వేలం వేయాలనేది టీజీఐఐసీ ప్రతిపాదన. అందుకే, కన్సల్టెంట్లను కోరుతూ ఆర్‌ఎ్‌ఫసీ ప్రకటన ఇచ్చింది. బిడ్‌ దక్కించుకున్న సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో లే అవుట్‌ అభివృద్ధి ప్రణాళికలను ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. విక్రయించనున్న స్థలాల వద్ద రియల్‌ ఎస్టేట్‌ విలువకు సంబంధించి మొదట ఓ నివేదిక సమర్పించాలి.


తర్వాత ఇందులో కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ స్థలాలతోపాటు పార్కులు, వాక్‌ వేలు, సైక్లింగ్‌, ఎకో పార్కులు వంటివి ఉండాలి. రహదారులు, సుందరీకరణ పనుల కోసం ప్రత్యేక ప్రణాళిక ఉండాలి. విడతలవారీగా అక్కడ చేపట్టబోయే మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి ప్రణాళిక, అంచనా వ్యయం వివరాలు ఇవ్వాలి. ఈ వివరాలు సమర్పించాక ఐదు విడతల్లో భూములను వేలం వేయాల్సి ఉంటుంది. వేలం ద్వారా ప్రభుత్వానికి వచ్చిన మొత్తం ఆదాయంలో 0.003 శాతాన్ని సదరు సంస్థకు ప్రభుత్వం చెల్లిస్తుంది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో సుమారు 20 సంవత్సరాల అనుభవమున్న సంస్థలకు కన్సల్టెంట్‌ ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కన్సల్టెంట్‌ ఎంపిక కోసం బిడ్‌ దాఖలు చేయడానికి ప్రభుత్వం మార్చి 15 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఇచ్చింది. దీనికి సంబంధించి ఈనెల 7న ప్రీ బిడ్‌ సమావేశం నిర్వహించనున్నారు. నాణ్యత, ఖర్చు ఆధారిత ఎంపిక విధానం (క్యూసీబీఎ్‌స)లో బిడ్డర్‌ను ఎంపిక చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) కార్యాలయంలో బిడ్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది.


ఇవి కూడా చదవండి

PM Modi: సింహం పిల్లలకు మోదీ ఫీడింగ్.. వీడియో వైరల్

Aurangazeb Row: ఔరంగజేబు వ్యాఖ్యల వివాదంపై అబూ అజ్మి క్షమాపణ

Bihar: అసెంబ్లీ ఎన్నికల వేళ.. మళ్లీ ఆయనకే బీజేపీ అధ్యక్ష పగ్గాలు

Bird flu: బర్డ్‌ఫ్లూపై కలెక్టర్ ఏమన్నారంటే..

Akhilesh Yadav: మనుషులా? మరబొమ్మలా?.. వారానికి 90 గంటల పనిపై అఖిలేష్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 05 , 2025 | 03:04 AM