Funds Release: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. బకాయిలు విడుదల..
ABN , Publish Date - Oct 31 , 2025 | 06:13 PM
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖలో పెండింగ్ బిల్లులను విడుదల చేసింది. అక్టోబర్ నెలకు సంబంధించి రూ.1,031 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది.
హైదరాబాద్, అక్టోబర్ 31: తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల బకాయిలతోపాటు పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బీ శాఖకు సంబంధించిన అక్టోబర్ నెల పెండింగ్ బిల్లులు సుమారు రూ.1,031 కోట్లను విడుదల చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు ఏకకాలంలో నిధులను విడుదల చేశారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో శుక్రవారం ఆర్థిక శాఖ అధికారులతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందుకు సంబంధించి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. గత ప్రభుత్వ కాలం నుంచి పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల బకాయిలను కాంగ్రెస్ సర్కార్ దశలవారీగా క్లియర్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా అక్టోబర్ నెలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు రూ.712 కోట్లను రిలీజ్ చేశారు.
రూ.10లక్షల లోపు పెండింగ్ బిల్లులను సైతం క్లియర్ చేయాలన్న సర్కార్ నిర్ణయంలో భాగంగా పంచాయతీరాజ్, ఆర్అండ్‌బీ శాఖకు సంబంధించి 46,956 బిల్లుల తాలూకు రూ.320 కోట్లను డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు అధికారులు రిలీజ్ చేశారు. రోడ్లు, భవనాల శాఖకు చెందిన రూ.10లక్షల లోపు విలువగల 3,610 బిల్లుల మొత్తం సుమారు రూ.95కోట్లను ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు. అదేవిధంగా పంచాయతీరాజ్, గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించిన 43,364 బిల్లుల మొత్తం రూ.225 కోట్లనూ అధికారులు రిలీజ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
CM Revanth Reddy: మొంథా తుఫాన్ ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం: సీఎం రేవంత్ రెడ్డి
Inter Exams 2026: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 2026 విడుదల