Private Ambulances: ప్రైవేటు అంబులెన్స్‌ల దందాకు కళ్లెం?
ABN , Publish Date - Aug 18 , 2025 | 04:26 AM
ప్రైవేటు అంబులెన్స్‌ల దోపిడీకి చెక్ పెట్టాలని సర్కారు భావిస్తోందా..? వాటి విషయంలో కఠిన నిబంధనలు అమలు చేసి.. నియంత్రణలోకి తేవాలని చూస్తోందా..
ప్రైవేటు ఆస్పత్రులతో కలిసి రాష్ట్రంలో అంబులెన్స్‌ల దోపిడీ
రోగుల తరలింపులో భారీగా కమీషన్లు దండుకుంటున్న వైనం
పేషెంట్ల సంబంధీకుల్ని భయపెట్టి.. కమీషన్ ఇచ్చే ఆస్పత్రులకు తీసుకెళ్తున్న అంబులెన్స్ డ్రైవర్లు.. భారీగా వాట్సాప్ గ్రూపులు
చెక్ పెట్టేలా సర్కారు యోచన.. వైద్య కమిషనర్ విచారణ
హైదరాబాద్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు అంబులెన్స్‌ల దోపిడీకి చెక్ పెట్టాలని సర్కారు భావిస్తోందా..? వాటి విషయంలో కఠిన నిబంధనలు అమలు చేసి.. నియంత్రణలోకి తేవాలని చూస్తోందా..? ఇష్టారీతిన జరిగే వసూళ్ల విషయంలో కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని యోచిస్తోందా..? అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఇటీవల ప్రైవేటు అంబులెన్స్‌ల దందాపై మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు వైద్య శాఖ కమిషనర్ డాక్టర్ సంగీతా సత్యనారాయణ ప్రైవేటు అంబులెన్స్‌ల వివరాలను సేకరిస్తున్నారు. ఒక్క పాలమూరు జిల్లాలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్ల దోపిడీపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రోగుల పరిస్థితిని బట్టి వాళ్లను తప్పుదోవ పట్టించడం లేదా అధిక చార్జీలు వసూలు చేయడం వంటివి చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ఖమ్మం పట్టణానికి చెందిన శ్రీనివాస్ తండ్రి ఓ రోజు గుండెపోటుకు గురయ్యారు. తక్షణమే ఆయన్ను సమీపంలోని ప్రైౖవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిశీలించి తక్షణమే హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. అంబులెన్స్ కోసం ఆరా తీయగా.. వెంటనే ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్ రంగంలోకి దిగాడు. రోగికి ఆక్సిజన్ అవసరం ఉంటుందని, అలాగే వైద్యుడు తోడుగా ఉండాలని హడావుడి చేశాడు. తండ్రి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అంబులెన్స్ డ్రైవర్ చెప్పిన దానికల్లా శ్రీనివాస్ అంగీకరించాడు. అయితే, ఆర్థిక స్తోమత లేకపోవడంతో ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించాడు. ఖమ్మంలో ప్రయాణం ప్రారంభం కాగానే సర్కారీ దవాఖానాకే వెళదామని చెప్పిన డ్రైవర్.. సూర్యాపేట దాటాక మాట మార్చాడు. సర్కారీలో వైద్యులుండరని, సరిగా సేవలందవని శ్రీనివా్‌సను బెదరగొట్టాడు. ప్రైవేటుకు వెళితేనే బతికిబట్టకడతారని చెప్పాడు. చివరికి అంబులెన్స్ డ్రైవర్ అనుకున్నట్లుగానే తనకు తెలిసిన, కమీషన్ ఇచ్చే ప్రైవేటు ఆస్పత్రికే తీసుకెళ్లాడు. అంతేకాదు ఆక్సిజన్‌తో పాటు వైద్యుడిని కూడా తెచ్చినందుకు ఏకంగా రూ.30 వేలు వసూల్ చేశాడు. ఈ మధ్య కాలంలో జరిగిన ఈ ఘటనను శ్రీనివాస్ ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు. మరోవైపు, ఇటీవల ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రైవేటు అంబులెన్స్‌ల దందాపై ఏకంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. పాలమూరు జిల్లాలోని రోడ్డు ప్రమాద బాధితులకు హైదరాబాద్‌లోని సర్కారీ దవాఖానాల్లో బెడ్లు లేవని చెబుతూ అమీర్‌పేట, ఎల్బీ నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ వ్యవహారంలో అంబులెన్స్ డ్రైవర్లు ఆస్పత్రి బిల్లులో 25-30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారు. దీనిపై అక్కడి ప్రజాప్రతినిధులు విచారణ చేయగా.. అంబులెన్స్‌ల దోపిడీ బయటపడింది.
ఆ జిల్లాల్లో హవా..
తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు అంబులెన్స్ యజమానులంతా ఒక నెట్‌వర్క్‌లా ఏర్పడి వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని జిల్లాల్లో ప్రైవేటు అంబులెన్స్‌ల వ్యవస్థ మరీ అరాచకంగా ఉంటోంది. ఆస్పత్రుల బిజినెస్ బాగా జరిగే చోటనే ప్రైవేటు అంబులెన్స్‌ల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. రోగిని ఒక ఆస్పత్రి నుంచి మరో చోటుకు తరలించాలనగానే.. అంబులెన్స్ యజమానులకు సమాచారం అందుతోంది. వాట్సాప్ నెట్‌వర్క్‌ల ద్వారా రోగిని మరో ప్రైవేటు ఆస్పత్రికి ఎలా తరలించాలనేది ముందే నిర్ణయిస్తారు. ప్రైవేటు ఆస్పత్రులు ఇచ్చే కమీషన్ ఆధారంగా అంబులెన్స్‌ల ద్వారా రోగులను చేరవేయడం పరిపాటిగా మారింది. కొన్నిసార్లు ఆస్పత్రుల బిల్లు కంటే అంబులెన్స్‌ల వాయింపే ఎక్కువగా ఉంటోందని బాధితులు వాపోతున్నారు. రాష్ట్రంలో ప్రైవేటు అంబులెన్స్‌ల దందా ఎక్కువగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డిలో ఉంటోంది. కోల్‌బెల్ట్ ఏరియాలోనూ ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. మంచిర్యాల, పెద్దపల్లిలో ప్రైవేటుకు వచ్చే కేసులు ఎక్కువగా కరీంనగర్ ప్రైవేటు ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. కరీంనగర్ కేసులు హైదరాబాద్‌కు రిఫర్ అవుతున్నాయి. ఈ రిఫరల్ దందాలో ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లదే కీలక పాత్ర. ఇక ఖమ్మం, మహబూబ్‌నగర్, సూర్యాపేట, నల్లగొండ, వరంగల్, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో ప్రైవేటు అంబులెన్స్‌ల దందా ఎక్కువ నడుస్తున్నట్లు వైద్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్రైవేటు అంబులెన్స్‌లు ఎక్కువగా ప్రభుత్వ ఆస్పత్రులు, ఇతర ప్రైవేటు ఆస్పత్రుల బయటే ఉంటున్నాయి. ఒక వేళ రోగిని ప్రభుత్వ ఆస్పత్రి నుంచి వేరే చోటుకు తరలించాలంటే బయటి వాహనాలను ఏ మాత్రం రానివ్వడం లేదు.. ప్రభుత్వ అంబులెన్స్ 108 వాహనాలను కూడా ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లు అడ్డుకుంటున్నారు. కొన్నిసార్లు 108 సిబ్బందిని బెదిరిస్తున్నారు. తమ అంబులెన్స్‌లోనే తీసుకెళ్లాలని బెదిరింపులకు దిగడం సాధారణంగా మారిందని కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ బాధితుడు తెలిపారు. అంబులెన్స్‌లో బేసిక్ లైఫ్ సపోర్ట్(బీఎల్‌ఎస్), అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్(ఏఎల్‌ఎస్), ఐసీయూ అంబులెన్స్‌లు ఉంటాయి. కి.మీ.కు ఇంత చార్జ్ అనే నిబంధన వీటికి లేదు అంబులెన్స్ రకాన్ని బట్టి గుంజేస్తారు. బీఎల్‌ఎస్ అంబులెన్స్ అయితే 10 కి.మీ. రూ.5 వేల వరకు, ఏఎల్‌ఎస్ అయితే రూ. 6-8 వేలు, ఐసీయూ అయితే రూ.10 వేల వరకు వసూల్ చేస్తున్నారు. ఇక మృతదేహాలను తీసుకెళ్లాలంటే రెట్టింపు చార్జీలు తీసుకుంటున్నారు.
పర్యవేక్షణ ఏదీ?
ప్రైవేటు అంబులెన్స్‌లపై ఏ శాఖ పర్యవేక్షణ ఉండటం లేదన్న ఆరోపణలున్నాయి. ప్రైవేటు అంబులెన్స్‌ల రిజిస్ట్రేషన్ వరకే రవాణా శాఖ పరిమితమవుతోంది. ఆ తర్వాత అవి ఏ శాఖ పరిధిలోకి రావడం లేదు. ఇంకా చెప్పాలంటే అసలు ఏ శాఖ పరిఽధిలోకి వస్తాయో కూడా వైద్య శాఖ ఉన్నతాధికారులకు అవగాహన లేదు. ఈ నేపథ్యంలో ప్రైవేటు అంబులెన్స్‌ల దందాపై ఎవరికి ఫిర్యాదు చేయాలో బాధితులకు తెలియడం లేదు. తమపై ఫిర్యాదులు చేసేవారు లేకపోవడం, ఏ శాఖ పరిధిలోకి కూడా రాకపోవడంతో ప్రైవేటు అంబులెన్స్‌ల దందా దర్జాగా నడుస్తోంది. దేశంలో ప్రైవేటు అంబులెన్స్ సేవలు జాతీయ, రాష్ట్ర స్థాయి నిబంధనల మేరకు నిర్వహించబడతాయి. మోటారు వాహనాల చట్టం 1988 జాతీయ అంబులెన్స్ కోడ్, క్లినికల్ ఎస్టాబ్లి్‌షమెంట్ చట్ట పరిధిలో వీటిపై పర్యవేక్షణ ఉండాలి. తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని జిల్లాల్లో కలిపి ఆరు సీట్ల సామర్థ్యం కలిగిన ప్రైవేటు అంబులెన్స్‌లు 1,625 ఉన్నాయి. అత్యధికంగా హైదరాబాద్‌లో 478 ఉన్నాయి. వీటితో పాటు మారుతీ మినీ ఇకో అంబులెన్స్‌లు మరో 1,000-1,500 ఉన్నాయి. మరోవైపు సర్కారు ఆధ్వర్యంలో నడిచే 108అంబులెన్స్‌లు 626వరకు ఉన్నాయి. అవి సరిపోనందువల్లే ప్రైవేటు అంబులెన్స్‌ల డ్రైవర్లు రెచ్చిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వనస్థలిపురం నుంచి నిమ్స్‌కు రూ.2,500
మా నాన్నకు కిడ్నీలు చెడిపోవడంతో వనస్థలిపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించాం. వారం తర్వాత వైద్యులు నిమ్స్‌కు తీసుకెళ్లాలని రిఫర్ చేశారు. అందుకోసం ఓ ప్రైవేటు అంబులెన్స్‌ను మాట్లాడాం. వనస్థలిపురం నుంచి నిమ్స్‌కు రూ.2,500 వసూల్ చేశారు. ప్రైవేటు అంబులెన్స్‌లపై సర్కారు పర్యవేక్షణ ఉండాలి. ప్రతి కి.మీ.కు ఒక రేటు పెట్టాలి. అప్పుడే అంబులెన్స్ దౌర్జన్యాల నుంచి సాధారణ ప్రజానీకానికి ఉపశమనం కలుగుతుంది.
- రాజేందర్‌రెడ్డి, హయత్‌నగర్.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏయూ మాజీ రిజిస్ట్రార్ల అరెస్ట్‌కు వారెంట్ జారీ
బిహార్ ఎన్నికలు.. కొత్త కుట్ర: ఎంపీ రాహుల్ గాంధీ