Urea Shortage: రామగుండం నడిస్తేనే..
ABN , Publish Date - Aug 23 , 2025 | 04:33 AM
యూరియా కొరత సమస్యను అధిగమించటానికి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక వనరులపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి వీలైనంత త్వరగా యూరియా తీసుకునే అంశంపై దృష్టి పెట్టింది.
సాంకేతిక సమస్యలు పరిష్కరించి యూరియా ఉత్పత్తికి చర్యలు
నేడు సచివాలయానికి రావాలని ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్‌కు పిలుపు
కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డితో తుమ్మల చర్చలు
10 రోజులుగా పనిచేయని కర్మాగారం
యూరియా సరఫరాపై తీవ్ర ప్రభావం
ఉత్పత్తి ప్రారంభానికి మరో 10 రోజులు
ఆగస్టు వరకు ఇచ్చిన ప్రణాళికలో 62,473 టన్నుల యూరియా కోత
ఖరీ్‌ఫకు ముందే రాష్ట్రం వద్ద 2.70 లక్షల మెట్రిక్ టన్నుల స్టాకు
అయినా కొరత అంటూ రైతులను రాష్ట్ర మంత్రులు భయపెట్టారు: కిషన్‌రెడ్డి
హైదరాబాద్, కోల్‌సిటీ, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): యూరియా కొరత సమస్యను అధిగమించటానికి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక వనరులపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి వీలైనంత త్వరగా యూరియా తీసుకునే అంశంపై దృష్టి పెట్టింది. సాంకేతిక సమస్యలతో యూరియా ఉత్పత్తి నిలిచిపోయిన ఆర్‌ఎ్‌ఫసీఎల్‌లో మరమ్మతులు పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభిస్తే... రైతులకు యూరియా అందించవచ్చుననే అంశంపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం కసరత్తు చేశారు. ఆర్‌ఎ్‌ఫసీఎల్ ఎండీని శనివారం సెక్రటేరియట్‌కు రావాలని సూచించారు. రామగుండం ఎరువుల కర్మాగారం ద్వారా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 1,69,325 టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 1,06,852 మెట్రిక్ టన్నులు మాత్రవే సరఫరా చేసింది. ఇంకా 62,473 టన్నుల యూరియా ఇవ్వలేదు. 14న అమ్మోనియా పైప్‌లైన్ లీకేజీతో ఆర్‌ఎ్‌ఫసీఎల్‌లో ఉత్పత్తి నిలిచిపోయింది. మరమ్మతులు పూర్తయి.. ఉత్పత్తి ప్రారంభం కావడానికి 10రోజులు పట్టే అవకాశం ఉంది. మరమ్మతుల కోసం డెన్మార్క్ నుంచి ఇంజనీర్ల బృందం వచ్చి ఆ పనుల్లో మునిగింది. మరోవైపు.. యూరియా కొరతపై రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో తుమ్మల శుక్రవారం ఫోన్‌లో మాట్లాడారు. రామగుండం కర్మాగారంలో సాంకేతిక సమస్యలు పరిష్కరించి, యూరియా ఉత్పత్తి ప్రారంభించి... ఈనెల రాష్ట్రానికి రావాల్సిన 63 వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చేలా చర్యలు తీసుకోవాలని బండి సంజయ్‌కు విజ్ఞప్తిచేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన యూరియా సరఫరా తక్షణమే చేసేలా చర్యలు తీసుకోవాలని కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి రావాల్సిన కోటాను వెంటనే పంపేలా ఏర్పాట్లుచేస్తామని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు.
డిమాండ్ ఎక్కువున్న జిల్లాలకు యూరియా తరలించాలి: తుమ్మల
డిమాండ్ తక్కువగా ఉన్న జిల్లాల నుంచి ఎక్కువగా ఉన్న జిల్లాలకు యూరియా తరలించి, రైతులకు అందుబాటులోకి తీసుకరావాలని అధికారును తుమ్మల ఆదేశించారు. ఈ విషయంలో కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ, రవాణాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. సచివాలయంలో మంత్రి తుమ్మల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాలకు యూరియా కేటాయింపులు, సరఫరా పూర్తిగా కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వశాఖ పరిధిలో ఉంటాయని, కాని ప్రతిక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని విమర్శించారు. ప్రైవేటు డీలర్ల వద్ద ఉన్న యూరియా నిల్వలను మన దేశానికి దిగుమతి ద్వారా రావాల్సిన యూరియా సకాలంలో రాకపోవడం, దేశీయంగా యూరియా ఉత్పత్తి అనుకున్న స్థాయిలో లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తాయని, వీటిన్నింటిని పరిష్కరించడానికి కేంద్రాన్ని సంప్రదిస్తున్నట్లు తుమ్మల తెలిపారు.
ఆ బాధ్యత రాష్ట్ర సర్కారుదే: కిషన్‌రెడ్డి
యూరియా బ్లాక్‌మార్కెట్‌కు తరలకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ దందా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఖరీఫ్ సీజన్ ఆరంభం నాటికే రాష్ట్ర ప్రభుత్వం వద్ద 2.70లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నా, యూరియా కొరత అంటూ మంత్రులు రైతులను భయాందోళనలకు గురిచేశారని కిషన్‌రెడ్డి ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి
లైసెన్సు తీసుకున్న కేబుల్ తప్ప ఏవీ ఉంచొద్దు... హైకోర్టు కీలక ఆదేశాలు
Read Latest Telangana News and National News