Temple Security: ఆలయాలపై పోలీస్ నిఘా
ABN , Publish Date - Aug 17 , 2025 | 04:00 AM
దేవాలయాల్లో భద్రతకు సంబంధించి ఉన్నతాధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఆలయాల్లో నిరంతరం పోలీస్ నిఘా కొనసాగించాలని నిర్ణయించారు.
ప్రముఖ ఆలయాల్లోని సీసీ కెమెరాలు పోలీస్.. కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం
హైదరాబాద్ నుంచి ఆలయాల్లో భద్రత పర్యవేక్షణ
హైదరాబాద్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): దేవాలయాల్లో భద్రతకు సంబంధించి ఉన్నతాధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఆలయాల్లో నిరంతరం పోలీస్ నిఘా కొనసాగించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా.. ఇప్పటికే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయాల్లో పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన అధికారులు వాటిని హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. సీసీ కెమెరాల అనుసంధానం ద్వారా ఆలయ అధికారులతోపాటు హైదరాబాద్‌లో ఉండే పోలీస్ ఉన్నతాధికారులు ఆలయాల్లో భద్రత, అనుమానితుల కదలికలు, ప్రత్యేక సందర్భాల్లో రద్దీ, క్రమబద్ధీకరణకు చేపడుతున్న చర్యలను పర్యవేక్షించనున్నారు. యాదగిరిగుట్ట, వేములవాడ, కొమురవెల్లి, కొండగట్టు, భద్రాచలం సీతారామచంద్రస్వామి, జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంతోపాటు ప్రముఖ ఆలయాల్లో నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది. ఇప్పటికే యాదగిరిగుట్టకు తిరుమల తరహాలో ప్రత్యేక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ప్రతి అంగుళం సీసీ కెమెరా నిఘాలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సాయుధ బలగాలతో నిరంతరం బందోబస్తు కొనసాగిస్తున్నారు. ముందుజాగ్రత్త, భద్రతా చర్యల్లో భాగంగా ఇతర ప్రముఖ ఆలయాల్లోనూ సీసీ కెమెరాల నిఘాను పెంచారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ శాఖ పరిధిలోకి వచ్చే అన్ని ఆలయాల్లోనూ ఇప్పటికే విస్తృతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిని ఆలయంలోని ప్రత్యేక మానిటరింగ్ కేంద్రం, ఆలయ ఈవోల అధికారిక ఫోన్లకు అనుసంధానం చేశారు. ఆలయం వైపునకు వెళ్లే ప్రధాన మార్గం, పార్కింగ్, టికెట్ కౌంటర్, దర్శన ప్రదేశం, ప్రసాద వితరణ, అన్నప్రసాదం జరిగే ప్రదేశం, భక్తులు సేదతీరే ప్రాంతాల్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు అమర్చారు. ఇక నుంచి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలీస్ అధికారులు ఆలయాల వద్ద ఉన్న భద్రతా ఏర్పాటును పర్యవేక్షిస్తారు. ‘‘ఆలయాల్లో సీసీ కెమెరాలు ఇప్పటికే ఏర్పాటు చేశాం. ఈవోలు సీసీ కెమెరాల ద్వారా ఆలయాల్లో భక్తుల రద్దీ, క్యూలైన్ల నిర్వహణ పరిశీలిస్తుంటారు. అవసరమైనప్పుడు విధుల్లో ఉండే సిబ్బందిని అప్రమత్తం చేస్తుంటారు. కొత్త విధానంలో ఆలయ ఫుటేజీని పోలీస్ కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేశారు’’ అని దేవాదాయ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తృటిలో తప్పిన ప్రమాదం.. విమాన ప్రయాణికులు సురక్షితం
రాహుల్ గాంధీ ఆరోపణలు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
మరిన్ని తెలంగాణ వార్తలు, తెలుగు వార్తలు చదవండి..