Share News

Sangareddy: రూ.కోటి పరిహారం ఇవ్వలేదు!

ABN , Publish Date - Aug 30 , 2025 | 01:08 AM

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో జూన్‌ 30న జరిగిన సిగాచీ ఔషధ ఫ్యాక్టరీలో జరిగిన భారీ పేలుడుకు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది.

Sangareddy: రూ.కోటి పరిహారం ఇవ్వలేదు!

మృతులకు తలా రూ.25 లక్షలే చెల్లించారు.. మిగతాది ఎప్పుడు చెల్లిస్తారో చెప్పలేదు

  • సిగాచీ ఔషధ పరిశ్రమ మృతులు 54

  • జాడ తెలియని 8 మందీ మరణించినట్లే

  • కంపెనీ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది

  • ప్రమాదంపై హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్‌

  • విచారణ వచ్చే నెల 16కి వాయిదా

హైదరాబాద్‌, పటాన్‌చెరు రూరల్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో జూన్‌ 30న జరిగిన సిగాచీ ఔషధ ఫ్యాక్టరీలో జరిగిన భారీ పేలుడుకు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. ఈ సంఘటనలో ఇప్పటివరకు 54 మంది మరణించినట్లు నిర్ధారించింది. సంఘటనకు కారకులైన వ్యక్తులుగా ఇంకా ఎవరికీ అరెస్టు చేయలేదని చెప్పింది. దుర్ఘటనపై హైకోర్టు ఆదేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్రవారం కౌంటర్‌ దాఖలు చేశారు. ఘటనా స్థలంలో, తర్వాత చికిత్స పొందుతూ మొత్తం 46 మంది చనిపోయారని, మరో 8 మంది జాడ తెలియకుండా పోయారని తెలిపారు. జాడ తెలియకుండా పోయిన వారిని కూడా మరణించినట్లుగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. మృతులకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వడానికి అంగీకరించిన కంపెనీ యాజమాన్యం మొత్తం 54 మందికి ఇప్పటిదాకా రూ.25 లక్షల చొప్పున చెల్లించినట్లు తెలిపారు. మిగిలిన పరిహారం ఎప్పట్లోగా ఇస్తారో గడువేమీ చెప్పలేదన్నారు. ప్రభుత్వం తరఫున సంఘటన జరిగిన రోజే మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున, కనిపించకుండా పోయిన వారి కుటుంబాలకు రూ.2.40 లక్షలు, గాయపడిన 28 మందికి రూ.50 వేల చొప్పున పరిహారం అందించినట్లు చెప్పారు. ఈ సంఘటనలో చనిపోయిన కుటుంబాలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నట్లు సీఎస్‌ హైకోర్టుకు తెలిపారు. ఘటన వెనుక కారణాలు తెలుసుకోవడం, సలహాలు, సూచనలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ, హైపవర్‌ కమిటీని నియమించిందని చెప్పారు. నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక అందజేసిందని, హైపవర్‌ కమిటీ నివేదిక ఇంకా అందాల్సి ఉందని తెలిపారు.


చనిపోయిన 46 మందిలో 43 మంది మరణ ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేశామని, మరో ముగ్గురివి పెండింగ్‌లో ఉన్నాయని, కనబడకుండా పోయిన 8 మంది మరణ ధ్రువీకరణ పత్రాలు కూడా సిద్ధం చేస్తున్నామని చెప్పారు. డ్రైయర్‌లో ఔషధ పదార్థ ధూళి మేఘం ఏర్పడి, ప్రమాదకర పేలుడు సంభవించిన విషయంలో కంపెనీ నిర్లక్ష్యం కనబడుతోందని ప్రాథమికంగా తేలిందని, ఇదే విషయాన్ని నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక సైతం ధ్రువీకరించిందని తెలిపారు. కంపెనీ యాజమాన్యానికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని, ఇప్పటివరకు ఎలాంటి అరె్‌స్టలు జరగలేదని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. బాధితులకు వేగంగా పరిహారం అందించాలని, దర్యాప్తును వేగవంతం చేయాలని, కేసు విచారణకు సిట్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ విశ్రాంత శాస్త్రవేత్త కలపల బాబూరావు వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కౌంటర్‌ వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ మొహియుద్ధీన్‌ల ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టినపుడు ప్రభుత్వ కౌంటర్‌కు స్పందించేందుకు సమయం కావాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్‌ కోరారు. దాంతో విచారణ వచ్చే నెల 16కు వాయిదా పడింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..

Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..

Updated Date - Aug 30 , 2025 | 01:09 AM