క్షయ రహిత తెలంగాణే లక్ష్యం:దామోదర
ABN , Publish Date - Feb 14 , 2025 | 04:06 AM
క్షయ రహిత తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. రోగులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందన్నారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): క్షయ రహిత తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. రోగులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందన్నారు. వారికి అవసరమైన పోషకాహార కిట్లను కార్పొరేట్ కంపెనీలు అందిస్తుండటం అభినందనీయమన్నారు. ప్రభుత్వం ఎంపిక చేసిన 9 జిల్లాల్లో క్షయ వ్యాధిగ్రస్థులకు పోషకాహార కిట్లను అందిస్తున్న 8 ఫార్మా కంపెనీలకు గురువారం మంత్రి తన నివాసంలో ప్రశంసా పత్రాలను అందజేశారు. ‘నిక్షయ్ మిత్ర’ కార్యక్రమంలో భాగంగా ఫార్మా కంపెనీలు కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎ్‌సఆర్) కింద చికిత్స కాలం పూర్తయ్యేవరకు రోగులకు రూ.2.80 కోట్ల విలువైన కిట్లను ప్రతి నెలా అందిస్తున్నాయి.
ఇందులో పాలు పంచుకుంటున్న ఆరాజన్ ఫౌండేషన్, ఆప్టిమస్ డ్రగ్స్, బయోలాజికల్-ఈ, గ్లాండ్ ఫార్మా, మెట్రో కెమ్, నాట్కో ఫార్మా, గ్రాన్యూల్స్, సన్ ఫార్మాసూటికల్ ప్రతినిధులను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా దామోదర్ రాజనర్సింహ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో పని చేస్తోందన్నారు. రోగులకు ప్రతి నెలా చికిత్స, మందుల కోసం రూ.1,000 చొప్పున ప్రభుత్వం అందిస్తోందని మంత్రి చెప్పారు.