ఆవిర్భావ దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు
ABN , Publish Date - Jun 02 , 2025 | 05:30 AM
తెలంగాణ రాష్ట్రం 12వ పడిలోకి అడుగుపెడుతున్న వేళ.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
నేడు పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు
ఉదయం 9.40గంటలకు ప్రారంభం
జాతీయ జెండా ఎగురవేయనున్న సీఎం
ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన
9 మందికి రూ.కోటి చొప్పున చెక్కులు
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం 12వ పడిలోకి అడుగుపెడుతున్న వేళ.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో సోమవారం ఉదయం 9.40 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్నాయి. కార్యక్రమంలో సీఎం రేవంత్ జాతీయ జెండాను ఎగురవేస్తారు. తర్వాత జాతీయ గీతాన్ని, తెలంగాణ రాష్ట్ర గీతాలాపన, పోలీసుల గౌరవ వందనం, పరేడ్ ఉంటాయి. అనంతరం సీఎం ప్రసంగిస్తారు. పలు రంగాల్లో విశేష సేవలు అందించినవారికి పతకాలను అందిస్తారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవులు, కళాకారులు, ఇతర ప్రముఖులను సత్కరిస్తారు. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా సీఎం చేసిన ప్రకటన మేరకు గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరి, అందెశ్రీ, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్‌తేజ, గొడిశాల జయరాజ్, పాశం యాదగిరి, ఎక్కా యాదగిరిలకు రూ.కోటి చెక్కు, ఫ్యూచర్‌సిటీలో 300 గజాల చొప్పున ఇంటి స్థలం పత్రాలను అందించనున్నారు. మరణించినవారికి సంబంధించి వారి కుటుంబ సభ్యులకు అందజేస్తారు.
వేడుకలకు జపాన్ అతిథి..
రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో జపాన్‌లోని కితాక్యూషు నగర మేయర్ కజుహి సా టకేచీ అతిథిగా పాల్గొననున్నారు. ఆయన తన ప్రతినిధి బృందంతో కలసి ఆదివారమే హైదరాబాద్ చేరుకున్నారు. వేడుకల అనంతరం ఐటీసీ కాకతీయ హోటల్‌లో తెలంగాణ ప్రభుత్వం- కితాక్యుషు నగర ప్రతినిధులు పలు అంశాలపై ఒప్పందాలు చేసుకోనున్నారు. ఇటీవల జపాన్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా కితాక్యుషు నగరాన్ని సీఎం రేవంత్ సందర్శించారు. హైదరాబాద్‌కు రావాలని మేయర్ టకేచీని ఆహ్వానించారు.
ముస్తాబైన మహానగరం
ఆవిర్భావ వేడుకల కోసం మహానగరం సుందరంగా ముస్తాబైంది. ప్రధాన కూడళ్లను, ప్రభుత్వ కార్యాలయాలు, చారిత్రక కట్టడాలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. గన్‌పార్కు వద్ద అమరులకు నివాళులు అర్పించనున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ప్రజలకు ప్రపంచ సుందరి శుభాకాంక్షలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రపంచ సుందరి ఓపల్ సుచాత శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో పోటీల్లో పాల్గొన్న మరికొందరు అందాల భామలు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి
తెలంగాణ లా, ప్రొస్ట్‌గ్రాడ్యుయేషన్ లా సెట్ అడ్మిట్ కార్డుల విడుదల..
మల విసర్జన చేయడానికి మంచి టైం ఏది.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..