HMDA: మహా హైదరాబాద్ హెచ్‌ఎండీఏ పరిధిని ఆర్‌ఆర్‌ఆర్ వరకూ విస్తరిస్తూ సర్కారు జీవో
ABN , Publish Date - Mar 13 , 2025 | 05:10 AM
హెచ్‌ఎండీఏ పరిధిని ఆర్‌ఆర్‌ఆర్ వరకూ విస్తరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో ఎంఎస్ నంబర్ 68 జారీ చేసింది. దీంతో.. ప్రస్తుతం 7,257 చదరపు కిలోమీటర్ల మేర హెచ్‌ఎండీఏ పరిధి 10,472.72 చదరపు కిలోమీటర్లకు చేరినట్లయింది.

7,257 నుంచి.. 10,472 చదరపు కిలోమీటర్లకు పెరిగిన పరిధి
ఫ్యూచర్ సిటీలో చేర్చనున్న 36 రెవెన్యూ గ్రామాల మినహాయింపు
కొత్తగా చేరిన 4 జిల్లాలు, 32 మండలాలు..
ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’
హైదరాబాద్ సిటీ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): హెచ్‌ఎండీఏ పరిధిని ఆర్‌ఆర్‌ఆర్ వరకూ విస్తరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో ఎంఎస్ నంబర్ 68 జారీ చేసింది. దీంతో.. ప్రస్తుతం 7,257 చదరపు కిలోమీటర్ల మేర హెచ్‌ఎండీఏ పరిధి 10,472.72 చదరపు కిలోమీటర్లకు చేరినట్లయింది. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధిలో ఏడు జిల్లాలు (హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట) ఉండగా.. ఈ విస్తరణతో మరో నాలుగు జిల్లాల్లోని 32 మండలాలు చేరాయి. ఈ 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలతో హెచ్‌ఎండీఏ పరిధి భారీగా పెరిగింది. హెచ్‌ఎండీఏ పరిధిని విస్తరించనున్నట్లు ‘మహా హైదరాబాద్’ అనే శీర్షికతో జనవరి 19న ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణంతో దాని చుట్టూ పట్టణీకరణ వేగవంతమవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా.. ప్రస్తుతమున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ నుండి 36 రెవెన్యూ గ్రామాలను పెంచిన పరిధి నుంచి మినహాయించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది. ఆ 36 రెవెన్యూ గ్రామాలను ప్రతిపాదిత ‘‘ఫ్యూచర్ సిటీ డెవల్‌పమెంట్ అథారిటీ’’లో చేర్చాలని నిర్ణయించారు.
కొత్తగా చేరే మండలాలివీ..
రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న మండలాలతో పాటు.. కొత్తగా మరో ఐదు మండలాలు తలకొండపల్లి, ఆమనగల్లు, మాడుగుల, కడ్తాల్, కేశంపేట చేరాయి. దీంతో రంగారెడ్డి జిల్లాలోని మొత్తం 27 మండలాలు హెచ్‌ఎండీఏ పరిధిలో చేరినట్టయింది. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 8మండలాలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండగా.. కొత్తగా మరో మూడు మండలాలు చౌటకూర్, కొండాపూర్, సదాశివపేట చేరాయి. సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే మూడు మండలాలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండగా.. కొత్తగా మరో మూడు మండలాలు గజ్వేల్, జగదేవ్‌పూర్, రాయపోల్ చేరాయి. మెదక్ జిల్లాలో ఇప్పటికే ఐదు మండలాలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండగా.. కొత్తగా మాసాయిపేట మండలం చేరింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటికే ఐదు మండలాలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండగా.. కొత్తగా మరో ఐదు మండలాలు సంస్థాన్ నారాయణపురం, వలిగొండ, రాజపేట, యాదగిరిగుట్ట, తుర్కపల్లి చేరాయి
కొత్తగా చేరే జిల్లాల్లోని మండలాలు..
వికారాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలు కొత్తగా హెచ్‌ఎండీఏ పరిధిలోకి రానున్నాయి. వాటిలో ఏయే మండలాలు రానున్నాయంటే.. వికారాబాద్ జిల్లాలో ఐదు మండలాల్లోని (మోమిన్‌పేట, నవాబ్‌పేట, పరిగి, పూడూరు, వికారాబాద్) కొన్ని గ్రామాలు. నల్లగొండ జిల్లాలో నాలుగు మండలాల్లోని (గట్టుప్పల్, చింతపల్లి, మర్రిగూడ, నాంపల్లి) కొన్ని గ్రామాలు. మహబూబ్‌నగర్ జిల్లాలో మూడు మండలాల్లోని (నవాబ్‌పేట, బాలానగర్, రాజపూర్) కొన్ని గ్రామాలు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని వెల్దండ మండలంలోని మూడు గ్రామాలు.
33 మందికి అదనపు కలెక్టర్ హోదా
హైదరాబాద్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 33 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు అదనపు కలెక్టర్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరి వేతన స్కేలు కూడా మారింది. టైమ్‌స్కేల్ రూ.76830-151000 ఉండగా తాజా నిర్ణయంతో రూ.96890-158380కు చేరింది. వేతనం రూ.20వేల మేర పెరిగింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీ్‌పకుమార్ సుల్తానియా జీవో జారీ చేశారు.