యూపీఎస్‌ను రద్దు చేయకుంటే ఉద్యమమే
ABN , Publish Date - Mar 03 , 2025 | 04:35 AM
రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు యూనిఫైడ్ పెన్షన్ స్కీం (యూపీఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలని, లేకుంటే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఏప్రిల్ 1న బ్లాక్ డే, మే 1న చలో ఢిల్లీ
సెప్టెంబరు 1న సామూహిక సెలవులు
సీపీఎస్ ఈయూ అధ్యక్షుడు స్థితప్రజ్ఞ
హైదరాబాద్, కవాడిగూడ, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు యూనిఫైడ్ పెన్షన్ స్కీం (యూపీఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలని, లేకుంటే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. యూ పీఎ్‌సను వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 1న రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్ డేగా పాటిస్తామని, ప్రతి జిల్లా నుంచి ప్రధానికి లేఖలు రాస్తామని, మే1న చలో ఢిల్లీ నిర్వహిస్తామని, సెప్టెంబరు 1న సామూహిక సెలవులు పెట్టి లక్ష కలాలతో కవాతు నిర్వహిస్తామని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌లో యూపీఎస్ వద్దంటూ ‘యుద్ధభేరి’ పేరుతో ధర్నా నిర్వహించారు.
కార్యక్రమంలో స్థితప్రజ్ఞ మాట్లాడుతూ.. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం దశల వారీగా ఉద్యమాన్ని చేపట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. యూపీఎ్‌సను 2025 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం జనవరి 24న విడుదల చేసిన గెజిట్‌లో పేర్కొన్నదని, దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్లుగానే, తెలంగాణలోనూ రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ డిమాండ్ చేశారు.