Job Vacancies: డిస్కంలలో కొలువులు!
ABN , Publish Date - Jan 18 , 2025 | 04:07 AM
విద్యుత్ పంపిణీ సంస్థల్లో కొలువుల మోత మోగనుంది. త్వరలోనే 3260 పోస్టులను భర్తీ చేయాలని డిస్కమ్‌లు నిర్ణయించాయి.

2812 జేఎల్‌ఎం, 330 సబ్ ఇంజనీర్, 118 ఏఈ పోస్టులు
భర్తీకి త్వరలో నోటిఫికేషన్
హైదరాబాద్, జనవరి 17(ఆంధ్రజ్యోతి): విద్యుత్ పంపిణీ సంస్థల్లో కొలువుల మోత మోగనుంది. త్వరలోనే 3260 పోస్టులను భర్తీ చేయాలని డిస్కమ్‌లు నిర్ణయించాయి. ఉత్తర డిస్కమ్(ఎన్పీడీసీఎల్-వరంగల్)లో 2212 జేఎల్‌ఎం(జూనియర్ లైన్‌మెన్), 30 సబ్ ఇంజనీర్, 18 అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) పోస్టులు, దక్షిణ డిస్కమ్(ఎస్పీడీసీఎల్-హైదరాబాద్)లో 600 జూనియర్ లైన్‌మెన్(జేఎల్‌ఎం), 300 సబ్ ఇంజనీర్, 100 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీజీఈఆర్‌సీ)లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను సమర్పించిన పంపిణీ వ్యాపారం, వార్షిక ఆదాయ అవసరాల(ఏఆర్‌ఆర్) పిటిషన్లలో డిస్కమ్‌లు పేర్కొన్నాయి.
మొత్తం 3260 కొలువులకు ఏకకాలంలో డిస్కమ్‌లు నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశం ఉంటుందని దక్షిణ డిస్కమ్ అధికారులు తెలిపారు. కొత్త నియామకాల అనంతరం దక్షిణ డిస్కమ్‌లో ఉద్యోగుల వేతనాల ఖర్చు రూ.3166.15కోట్ల నుంచి రూ.3779కోట్లకు పెరుగుతుందని, ఉత్తర డిస్కమ్‌లో ఉద్యోగుల వేతనాల ఖర్చు రూ.2389.02 కోట్ల నుంచి రూ.2869 కోట్లకు పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ మేరకు నిధులు రాబట్టుకోవడానికి వీలుగా డిస్కమ్‌లు ఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించాయి.