Share News

Phone Tapping: బెదిరించి బీఆర్‌ఎస్‌ ఎన్నికల బాండ్లు కొనిపించారు

ABN , Publish Date - May 01 , 2025 | 04:31 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు తనను బెదిరించి బీఆర్‌ఎస్‌ పార్టీ పేరిట ఎన్నికల బాండ్లు కొనిపించారని.. ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వరాదని హైకోర్టుకు సంధ్య కన్వెన్షన్‌ ఎండీ శ్రీధర్‌రావు విజ్ఞప్తి చేశారు.

Phone Tapping: బెదిరించి బీఆర్‌ఎస్‌ ఎన్నికల బాండ్లు కొనిపించారు

  • తప్పుడు కేసులు పెట్టి వేధించారు

  • ప్రభాకర్‌రావుకు ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దు

  • సంధ్య కన్వెన్షన్‌ ఎండీ శ్రీధర్‌రావు వాదన

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు తనను బెదిరించి బీఆర్‌ఎస్‌ పార్టీ పేరిట ఎన్నికల బాండ్లు కొనిపించారని.. ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వరాదని హైకోర్టుకు సంధ్య కన్వెన్షన్‌ ఎండీ శ్రీధర్‌రావు విజ్ఞప్తి చేశారు. ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌లో తన వాదన కూడా వినాలంటూ శ్రీధర్‌రావు ఇంప్లీడ్‌ అయ్యారు. దీనిపై జస్టిస్‌ జె.శ్రీనివాసరావు ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ప్రభాకర్‌రావు కీలకంగా వ్యవహరించారని శ్రీధర్‌రావు వివరించారు. తన ఫోన్‌ ట్యాప్‌ చేసి కదలికలపై నిఘా పెట్టారని.. బెంగళూరు వెళ్తే అక్కడికి వచ్చి అరెస్ట్‌ చేశారని తెలిపారు.


తనపై 25 తప్పుడు క్రిమినల్‌ కేసులు పెట్టి బెదిరించారని, భారీగా డబ్బు డిమాండ్‌ చేశారని.. బీఆర్‌ఎస్‌ పార్టీ పేరిట ఎన్నికల బాండ్లు కొనిపించారని ఆరోపించారు. ప్రభాకర్‌రావు వల్ల తాను బాధితుడిగా మారినందున.. ప్రభాకర్‌రావుకు బెయిల్‌ను వ్యతిరేకించే హక్కు తనకు ఉందని వివరించారు. అమెరికాలో కూర్చుని బెయిల్‌ ఇస్తేనే ఇక్కడికి తిరిగి వస్తానని ఆయన చెప్పడం సరికాదని పేర్కొన్నారు. ఇక ప్రభాకర్‌రావు తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈ బెయిల్‌ పిటిషన్‌లో శ్రీధర్‌రావు జోక్యం ఏమిటని ప్రశ్నించారు. శ్రీధర్‌రావుపై 25 క్రిమినల్‌ కేసులు ఉన్నాయని, ఆయన వాదనలు వినాల్సిన అవసరం అసలే లేదని పేర్కొన్నారు. శ్రవణ్‌రావు తరహాలో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని, ప్రభాకర్‌రావు భారత్‌కు తిరిగొచ్చి దర్యాప్తు అధికారి ఎదుట హాజరవుతారని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.


Also Read:

BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్‌ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ

Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..

Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..

Updated Date - May 01 , 2025 | 04:31 AM