Congress MLCs: బీఆర్ఎస్‌పై ఎన్నికల ఆర్వోకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు
ABN , Publish Date - Oct 27 , 2025 | 05:20 PM
బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఎన్నికల ఆర్వోకు సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే శ్రీగణేష్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, మీడియా సెల్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి కంప్లైంట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 27: బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్(RO)కు ఇవాళ (సోమవారం) కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే శ్రీగణేష్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, కాంగ్రెస్ మీడియా సెల్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి కంప్లైంట్ చేశారు. బీఆర్ఎస్ నేతలు చర్చిలకు వెళ్లి ప్రచారం చేస్తూ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారంటూ ఆధారాలను ఆర్వోకి అందజేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థి పేరు, ఫొటోలతో కూడిన ఓటర్ స్లిప్స్ సైతం పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీపై రిటర్నింగ్ ఆఫీసర్‌కి ఫిర్యాదు చేశామని మీడియా సెల్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. చర్చిలలో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు ఓటర్ పోల్ చిట్టీలను పంచుతూ అడ్డంగా దొరికారని మండిపడ్డారు. ఆధారాలతో సహా రిటర్నింగ్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్న బీఆర్ఎస్ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేసినట్టే.. ఇప్పుడూ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ నేతలు బరితెగిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడే కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ అక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ ఫోజులు కొడుతున్నారని ఫైర్ అయ్యారు. కేటీఆర్, హరీష్ దొంగతనం చేసి మాగంటి సునీతకు అంటగడుతున్నారని విమర్శించారు. సునీత గెలవడం బీఆర్ఎస్ నేతలకు ఇష్టం లేనట్టుందని.. ఓడిపోతారని తెలిసే పిచ్చి నాటకాలు వేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజాయితీగా ఎన్నికల్లో గెలిస్తే హర్షిస్తామని.. బీఆర్ఎస్ నేతలు సునీత మంచి కోసం పని చేయాలన్నారు.
కేసీఆర్ గురించి మాట్లాడితే దుబాయ్ శేఖర్ అనే పిలవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము ఏం చేసినా చెల్లుతుందని బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తన సొంత మీడియాలో ప్రకటనలు ఇస్తోందని.. వాటిని అభ్యర్థి లెక్కలో జమకట్టాలన్నారు. కాంగ్రెస్ క్యాండిడేట్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల రూల్స్ ఉల్లంఘిస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ.. 'ఎన్నికలను ఆదర్శంగా నిర్వహించాలని మేం ప్రయత్నిస్తున్నాం. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడం సరికాదు. చర్చిలలో ప్రచారం చేయడం తప్పు. పోల్ స్లిప్స్ పంచితే చర్యలు తీసుకోవాల్సిందే. జూబ్లీహిల్స్ ప్రజలు నవీన్ యాదవ్‌ను గెలిపించాలని నిర్ణయించుకున్నారు. దొంగ దారిలో గెలిస్తే చర్యలు తప్పకుండా ఉంటాయి' అని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి:
Bandi Sanjay: ఆ మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలి.. బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు
Telangana: విషాదం.. టూత్‌పేస్ట్ అనుకొని ఎలుకల మందు తిని చిన్నారి మృతి