Weather: తెలంగాణ గజగజ..
ABN , Publish Date - Nov 27 , 2025 | 09:15 PM
తెలంగాణలో చలి పంజా విసురుతోంది. నవంబర్ 29, 30 తేదీల్లో చలి తీవ్రత మరింత పెరగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. డిట్‌వా తుఫాను కారణంగా మోస్తరు వర్షాలు కూడా కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది.
హైదరాబాద్, నవంబర్ 27: రాష్ట్రంలో చలి పులి మళ్లీ పంజా విసురుతోంది. పల్లె, పట్నం తేడా లేకుండా రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. పలుచోట్ల రాత్రిళ్లు చలి మంటలు.. ఉదయం పూట పొగ మంచు దృశ్యాలే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. రానున్న రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనున్నట్లు తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది. నవంబర్ 29, 30 తేదీల్లో విపరీతమైన శీతల గాలులు వీస్తాయని అంచనా వేసింది. ‘డిట్‌వా’ అనే తుఫాను కారణంగా డిసెంబర్ తొలి వారంలోనే పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. వర్షాలు కురిసినా.. చలి తీవ్రత మాత్రం తగ్గే పరిస్థితి లేనట్లు తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రజలు చలికి వణుకుతున్నారు.
జాగ్రత్త..
చలి ప్రభావం వల్ల చిన్నారులు, వృద్ధులు, వ్యాధులతో బాధ పడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో ప్రయాణాలు మానుకుని మధ్యాహ్నం సమయంలోనే రాకపోకలు సాగించాలని పేర్కొంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాల వారు వెచ్చని వాతావరణంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. చలితోపాటు ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణులు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పేలిన వాషింగ్ మిషన్.. ఉలిక్కిపడ్డ ప్రజలు
మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం