CM Revanth Reddy: 30 వేల కోట్ల రుణానికిసహకరించండి
ABN , Publish Date - Dec 17 , 2025 | 05:18 AM
తెలంగాణలో విద్యారంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలవాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.......
తెలంగాణలో విద్యారంగం అభివృద్ధికి చేయూతనివ్వండి
రుణానికి ఎఫ్‌ఆర్‌బీఎం మినహాయింపు ఇవ్వండి
హైదరాబాద్‌కు ఐఐఎం మంజూరు చేయండి
మరిన్ని నవోదయాలను ఏర్పాటు చేయండి
కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్,
ధర్మేంద్ర ప్రధాన్‌లకు సీఎం రేవంత్‌రెడ్డి వినతి
న్యూఢిల్లీ, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో విద్యారంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలవాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో విద్యారంగం సమగ్రాభివృద్ధికి రూ.30 వేల కోట్లు వెచ్చిస్తున్నామని, ఈ నిధుల సమీకరణకు ప్రత్యేక ప్రయోజన సంస్థ (ఎస్‌పీసీ)ను ఏర్పాటు చేయదలిచామని చెప్పారు. తద్వారా సేకరించే రుణాలకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. విద్యారంగంపై తమ ప్రభుత్వం చేస్తున్న ఖర్చును మానవ వనరుల అభివృద్ధి కోసం పెడుతున్న పెట్టుబడిగా భావించాలన్నారు. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మంగళవారం పార్లమెంట్‌లో కేంద్రమంత్రితో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణవ్యాప్తంగా 105 శాసనసభ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల (వైఐఐఆర్‌ఎస్) ప్రాధాన్యాన్ని ఆమెకు వివరించారు. 5 నుంచి 12 తరగతుల వరకు ఉండే ఒక్కో స్కూల్‌లో 2,560 మంది చొప్పున మొత్తంగా 105 పాఠశాలల్లో 2.70 లక్షల మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా నాణ్యమైన విద్యాబోధన లభిస్తుందని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు సమీప ప్రభుత్వ పాఠశాలలకు విద్యా హబ్‌లుగా ఉండడంతో.. పరోక్షంగా లక్షలాది మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. అత్యాధునిక వసతులు, లేబొరేటరీలు, ేస్టడియాలతో నిర్మించే ఈ 105 స్కూళ్ల నిర్మాణానికి రూ.21 వేల కోట్ల వ్యయం అవుతుందన్నారు. అలాగే, రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ, సాంకేతిక కళాశాలలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో ఆధునిక ల్యాబ్‌లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు మరో రూ.9 వేల కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. కాగా, రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుతో తెలంగాణలో విద్యారంగం అభివృద్ధిపై సీఎం రేవంత్ చూపుతున్న చొరవను కేంద్రమంత్రి ప్రశంసించారు. రెసిడెన్షియల్ స్కూళ్ల మోడల్ బాగుందని, ఎస్‌పీసీకి సంబంధించిన వివరాలు అందజేయాలని అన్నారు.
హైదరాబాద్‌కు ఐఐఎం ఇవ్వండి..
హైదరాబాద్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) మంజూరు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌లో కేంద్రమంత్రిని కలిసి టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఏరో ేస్పస్, డిఫెన్స్, లాజిస్టిక్స్, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో ముందున్న హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కేంద్రమంత్రికి వివరించారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రాంగణంలో గుర్తించామని తెలిపారు. తరగతులు వెంటనే ప్రారంభించేందుకు ట్రాన్సిట్ క్యాంపస్ సిద్ధంగా ఉందని, ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన అనుమతుల మంజూరు, వసతుల కల్పనకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు వీలుగా హైదరాబాద్‌కు ఎయిర్, రైల్, రోడ్ కనెక్టివిటీ ఉందని, అనుకూల వాతావరణం, భిన్న రంగాల ప్రముఖులను అందజేసిన చరిత్ర ఉందని వివరించారు. తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా మరో 9 కేంద్రీయ, 16 జవహర్ నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న పట్టణీకరణ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఈ విద్యాలయాలు అవసరమని చెప్పారు. విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలం, ఇతర వసతులు కల్పించడానికి తాము సిద్థంగా ఉన్నామని తెలిపారు. సీఎం వెంట ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, సురేశ్ షెట్కార్, ఏపీ జితేందర్‌రెడ్డి ఉన్నారు.
ప్రజా ప్రభుత్వం పనితీరు అద్భుతం: సోనియా
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం పనితీరు అద్భుతంగా ఉందని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ప్రశంసించారు. తెలంగాణ రైజింగ్ -2047 విజన్ బాగుందని కితాబిచ్చారు. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. న్యూఢిల్లీలోని 10, జన్‌పథ్‌లో సోనియాగాంధీని ఆమె నివాసంలో సీఎం కలిశారు. తెలంగాణ రైజింగ్ - 2047 విజన్ డాక్యుమెంట్‌ను సోనియాకు అందజేశారు. డిసెంబరు 8, 9 తేదీల్లో రెండు రోజులపాటు హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 విశేషాలను సోనియాగాంధీకి రేవంత్ వివరించారు. ప్రజా పాలనలో రెండేళ్లుగా అమలవుతున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్ ప్రణాళికల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా.. తెలంగాణలో ప్రజా ప్రభుత్వ పనితీరు, రాష్ర్టాభివృద్ధి విషయంలో సీఎం రేవంత్ దూరదృష్టిని సోనియా అభినందించారు. విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా రాష్ర్టాన్ని అభివృద్థి పథంలో ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.