CM Revanth Reddy: పెట్టుబడులతో తరలిరండి
ABN , Publish Date - Jul 16 , 2025 | 04:16 AM
పారిశ్రామిక విధానాలను మరింత మెరుగుపర్చుకుంటూ తెలంగాణను పెట్టుబడులకు నిలయంగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
పారిశ్రామిక విధానాలను మరింత మెరుగుపరుస్తాం
రాయితీలు, అనుమతుల్లో సానుకూల వాతావరణం
ప్రభుత్వాలు మారినా కొనసాగేలా విధానాలు
బల్క్ డ్రగ్, డేటా సెంటర్ల కేంద్రంగా హైదరాబాద్
పొరుగు రాష్ట్రాలతో కాదు.. ప్రపంచంతోనే పోటీ
జీనోమ్ వ్యాలీలో ఐకార్ బయోలాజిక్స్ పరిశ్రమ ఏర్పాటుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన
మేడ్చల్, జూలై 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పారిశ్రామిక విధానాలను మరింత మెరుగుపర్చుకుంటూ తెలంగాణను పెట్టుబడులకు నిలయంగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి అవసరమైన ప్రోత్సాహకాలను అందిస్తామని, పెట్టుబడులతో ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరారు. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా తుర్కపల్లి జీనోమ్ వ్యాలీలో ఐకార్ బయోలాజిక్స్ పరిశ్రమ నూతన యూనిట్‌కు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్‌బాబు, వివేక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్న పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ప్రభుత ్వం తరఫున అభినందిస్తున్నామన్నారు. ‘‘ప్రపంచ బల్క్ డ్రగ్ రాజధానిగా హైదరాబాద్ రూపుదిద్దుకుంది. దేశంలో 33 శాతం టీకాలను కేవలం జీనోమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి చేస్తున్నారు. బల్క్ డ్రగ్స్‌లో 40 శాతం ఇక్కడే ఉత్పత్తి చేస్తున్నారు. కొవిడ్ సమయంలో దాదాపు వంద దేశాలకు వ్యాక్సిన్ అందించిన ఘనత జీనోమ్ వ్యాలీకి దక్కింది. జీవ శాస్త్రాల అభివృద్ధికి అవసరమైన ఎకో సిస్టమ్ హైదరాబాద్‌లో ఉంది. పారిశ్రామిక రంగం అభివృద్ధికి అవసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాలు, అనుమతుల జారీ తదితర విషయాల్లో సానుకూల వాతావరణం కల్పిస్తాం. తెలంగాణను మరింత అభివృద్ధి చేసేందుకు పారిశ్రామికవేత్తలు సహకరించాలి’’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక విధానాలను ముందుకు తీసుకువెళ్లే విధంగానే నిర్ణయాలు ఉంటాయని, పారిశ్రామిక పాలసీలు, ఇన్సెంటివ్‌లు, అనుమతులు ఇచ్చే విషయంలో విధానపరమైన నిర్ణయాలను మెరుగుపర్చుకుంటూ ముందుకువెళ్తున్నామని తెలిపారు. ఇంకా మెరుగైన నిర్ణయాలు తీసుకుని దేశంలో పెట్టుబడిదారులను రాష్ట్రానికి ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

డేటా సెంటర్స్‌కు అడ్డాగా హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిన్నరలోనే దాదాపు రూ.3.28 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు ఆహ్వానించామని, ప్రస్తుతం డేటా సెంటర్లకు హైదరాబాద్ నిలయంగా మారిందని, బయో ఫార్మసీ, ఇతర పరిశ్రమలను ఆకర్షించడంలో ముందుందని తెలిపారు. తెలంగాణకు మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ పోటీ కాదని, ప్రపంచ దేశాలతోనే పోటీ పడాలని చెప్పారు. ప్రపంచంలో ఉన్న అధునాతనమైన విధానాలను, పరిశ్రమలను రాష్ట్రానికి ఆహ్వానించాలన్నారు. దేశ ఎకానమీలో రాష్ట్ర వాటా 10 శాతం ఉండేలా కార్యాచరణ చేపడుతున్నామన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, ఐకార్ మేనేజింగ్ డైరెక్టర్ సూదిన ఆనంద్ రెడ్డ్డి సీఎం రేవంత్‌రెడ్డికి స్వాగతం పలికారు.