Cabinet Meeting: 10న క్యాబినెట్ భేటీ
ABN , Publish Date - Jul 08 , 2025 | 03:26 AM
రాష్ట్ర మంత్రిమండలి ఈ నెల 10న సమావేశం కానుంది. సచివాలయంలోని ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్ హాల్‌లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది.
బనకచర్ల, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ
యువ వికాసం, మెడికల్ కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పనపైనా చర్చించే అవకాశం
హైదరాబాద్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రిమండలి ఈ నెల 10న సమావేశం కానుంది. సచివాలయంలోని ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్ హాల్‌లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా.. ఇటీవల వివాదాస్పదంగా మారిన బనకచర్ల ప్రాజెక్టుపై, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, సన్నద్ధత, రిజర్వేషన్లు వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలిసింది.
వీటితోపాటు రాజీవ్ యువ వికాసం పథకం పైనా చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఈ పథకం ఇప్పటికీ గాడిన పడలేదు. యువత నుంచి దరఖాస్తులు స్వీకరించారే తప్ప.. ఇంకా అవి కొలిక్కి రాలేదు. ఇక వైద్య కళాశాలలకు మౌలిక సదుపాయాల కల్పన అంశంపై క్యాబినెట్ భేటీలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించిన జాతీయ వైద్య కమిషన్ కొన్ని లోపాలను గుర్తించింది. ఇలాంటి లోపాలను సరిదిద్ది, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు. దీనిపై మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశం ఉంది.