Share News

Mega Hyderabad Expansion: మెగా హైదరాబాద్‌

ABN , Publish Date - Nov 26 , 2025 | 05:20 AM

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ జీహెచ్‌ఎంసీ విస్తరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జీహెచ్‌ఎంసీకి ఔటర్‌ రింగు రోడ్డు ఓఆర్‌ఆర్‌ను సరిహద్దుగా నిర్ణయించింది. దీంతో హైదరాబాద్‌ మహానగరం దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించనుంది...

Mega Hyderabad Expansion: మెగా హైదరాబాద్‌

  • జీహెచ్‌ఎంసీలో 20 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనం

  • విస్తరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం

  • ఇకపై ఓఆర్‌ఆర్‌ వరకు జీహెచ్‌ఎంసీ పరిధి

  • 2 కోట్ల జనాభాతో మినీ తెలంగాణగా అవతరణ

  • 2,735 చదరపు కి.మీ.తో దేశంలోనే అతిపెద్ద నగరం

  • ఓఆర్‌ఆర్‌ దాకా ఒకే రకమైన పట్టణ ప్రణాళిక

  • అధ్యయనానికి జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ ఆమోదం

  • గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే.. 1-2 నెలల్లో డివిజన్ల పునర్విభజన, కార్పొరేషన్ల విభజన పూర్తి.. అధికార వర్గాల వెల్లడి

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) విస్తరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జీహెచ్‌ఎంసీకి ఔటర్‌ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్‌)ను సరిహద్దుగా నిర్ణయించింది. దీంతో హైదరాబాద్‌ మహానగరం దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో హైదరాబాద్‌ శివారులో ఉన్న 20 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం జీహెచ్‌ఎంసీ, తెలంగాణ మునిసిపాలిటీ చట్టాలను సవరించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మీడియా సమావేశంలో తెలిపారు. విలీన ప్రక్రియలో అన్ని వర్గాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. విలీనం కానున్నమునిసిపాలిటీల్లో కొన్నింటి పరిధి ఓఆర్‌ఆర్‌ అవతల కూడా విస్తరించి ఉంది. ప్రస్తుతం 150 మునిసిపల్‌ డివిజన్లతో ఉన్న జీహెచ్‌ఎంసీ పరిధి కొత్తవాటి విలీనంతో మూడింతలు పెరగనుంది. నగర పరిధి దాదాపు 2,735 చదరపు కిలోమీటర్లు ఉండనుంది. జనాభా దాదాపు రెండు కోట్లు ఉంటుంది. తాజాగా విలీన కానున్న 27 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లపాలక మండళ్ల గడువు ముగిసి చాలా కాలమైంది. అక్కడ ఎన్నికలు నిర్వహించకపోవటంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగుస్తుంది.


విలీన ప్రతిపాదనపై అధ్యయనానికి బల్దియా ఓకే..!

జీహెచ్‌ఎంసీలో 27 మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల విలీన ప్రతిపాదనపై అధ్యయనం చేసి నివేదికతో కూడిన అభిప్రాయం చెప్పేందుకు బల్దియా కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. మంత్రివర్గం నిర్ణయం నేపథ్యంలో విలీన ప్రతిపాదనను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌మంగళవారం కౌన్సిల్‌ ముందు ఉంచారు. జీహెచ్‌ఎంసీ చట్టం 1955 ప్రకారం విలీన ప్రతిపాదనపై అవసరమైన అధ్యయనం చేసి అభిప్రాయం తెలపాలని ఈ నెల 21న సర్కారు బల్దియాకు మెమో పంపింది. దీంతో టేబుల్‌ ఎజెండాగా ఈ అంశాన్ని కౌన్సిల్‌లో ప్రస్తావించగా మెజార్టీ సభ్యులు ఆమోదించారు. విలీన ప్రతిపాదనపై ఎంఐఎం అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే, సర్కారు నిర్ణయంపై అభ్యంతరం తెలపడం సబబు కాదంటూ.. అభిప్రాయం చెప్పాలన్న ప్రతిపాదనను ఆమోదిస్తున్నట్టు మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ పాలక మండలి గడువు ముగిసిన తర్వాతే విలీనం జరుగుతుందని ఓ అధికారి తెలిపారు. విలీనం అనంతరం మొత్తం ప్రాంతాన్ని విభజించే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే.. డివిజన్ల పునర్విభజన, కార్పొరేషన్ల విభజన ఒకటి రెండు నెలల్లో పూర్తవుతుందని చెప్పారు.

సమగ్రాభివృద్ధి కోసమే..

జీహెచ్‌ఎంసీలో విలీనం కానున్న మునిసిపాలిటీల్లో శంషాబాద్‌, నార్సింగి, మేడ్చల్‌ పరిధి ఓఆర్‌ఆర్‌కు బయట 2-3 కి.మీ దూరం వరకు విస్తరించి ఉంది. ఇవి ఓఆర్‌ఆర్‌ గ్రోత్‌ కారిడార్‌లో ఉండడంతో అక్కడ పట్టణీకరణ శరవేగంగా జరుగుతోంది. మిగతా ప్రాంతాల్లో ఇంత వేగంగా పట్టణీకరణ లేదు. పైగా ఈ మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి, పట్టణ ప్రణాళికలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. పెరుగుతున్న పట్టణీకరణ ఒత్తిడిని, వనరుల పంపిణీలో అసమానతల వల్ల మౌలిక వసతుల కల్పనలో ప్రాంతాల మధ్య సమతుల్యత లోపించటాన్ని ప్రభుత్వం గుర్తించింది. మెట్రోపాలిటన్‌ ప్రాంతంలో ఒకేతరహా అభివృద్ధి ప్రణాళికను అమలు చేసేదిశగా విలీన నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడం, అస్తవ్యవస్త కాలనీల ఏర్పాటును నిలువరించడం, జనాభా ఒత్తిడిని అధిగమించడం, విపత్తుల నిర్వహణను సులభతరం చేయడం, అన్ని ప్రాంతాలకు పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు తయారు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఓఆర్‌ఆర్‌ వరకు మెట్రోపాలిటన్‌ ప్రణాళికలను అమలుచేసే దిశగా విలీన ప్రక్రియను చేపట్టినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈ నెల 21న జారీచేసిన మెమోలో తెలిపారు.


అందరికీ ఒకే రకం వేతనాలు

జీహెచ్‌ఎంసీ విస్తరణతో ఓఆర్‌ఆర్‌ అవతలి ప్రాంతాలకు కూడా హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంలో ఉన్న సౌకర్యాలు లభించనున్నాయి. తాగునీటి నిర్వహణలో వాటర్‌బోర్డు ప్రస్తుతం ఔటర్‌ లోపలి ప్రాంతాల్లో ముఖ్య భూమిక పోషిస్తోంది. ఇకపై ఓఆర్‌ఆర్‌ అవతల ఉన్న కొన్ని ప్రాంతాలకు కూడా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, ఇతర పనులను జీహెచ్‌ఎంసీ చూసుకోనుంది. విలీనం కానున్న 27 మునిసిపాలిటీ ఉద్యోగులు జీహెచ్‌ఎంసీ పరిధిలోకి రానుండటంతో వారి జీతభత్యాలు కూడా జీహెచ్‌ఎంసీనే చెల్లిస్తుంది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలోని పారిశుద్ధ్య సిబ్బందికి ఇస్తున్నట్లుగానే విలీన ప్రాంతాల సిబ్బందికి కూడా వేతనాలు ఇస్తారు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల కార్యాలయాలన్నీ జీహెచ్‌ఎంసీలో సర్కిల్‌, జోనల్‌ కార్యాలయాలుగా మారుతాయి. అక్కడ పన్నుల విధానం కూడా జీహెచ్‌ఎంసీలో ఉన్నట్లుగానే మారుతుంది.

జీహెచ్‌ఎంసీ.. మినీ తెలంగాణ

విస్తరణ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ మినీ తెలంగాణగా మారనుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తుతం కోటికి పైగా జనాభా ఉంది. విస్తర ణ తర్వాత 2 కోట్లకు పెరగనుంది. అంటే రాష్ట్ర మొత్తం జనాభాలో దాదాపు సగం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉంటుంది. జీహెచ్‌ఎంసీ పరిధి ప్రస్తుతం 650 చదరపు కిలోమీటర్లు. విస్తరణ తర్వాత దాదాపు 2,735 చదరపు కిలోమీటర్ల వరకు ఉండనుంది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ వార్షిక బడ్జెట్‌ 8 వేల కోట్లు దాటగా.. విస్తరణ తర్వాత రూ.15 వేల కోట్లు దాటే అవకాశాలున్నాయి.


హెచ్‌ఎండీఏ ఆదాయానికి గండి

జీహెచ్‌ఎంసీ విస్తరణతో హైదరాబాద్‌ మహా నగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఆదాయం పడిపోనుంది. ప్రస్తుతం హెచ్‌ఎండీఏకు వస్తున్న ఆదాయంలో 60 శాతానికి పైగా ఓఆర్‌ఆర్‌ వెంట ఉన్న గ్రోత్‌కారిడార్‌ నుంచే వస్తోంది. భూములు, ప్లాట్ల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంతో పాటు ప్లానింగ్‌ విభాగం ద్వారా హెచ్‌ఎండీఏ భారీగా నిధులు సమకూర్చుకుంటోంది. పెద్దఎత్తున స్థలాలు అందుబాటులో ఉండడంతో నిర్మాణ సంస్థలు ఇక్కడ భారీ ప్రాజెక్టులు చేపడుతున్నాయి. దక్షిణ భారతదేశంలోనే ఎత్తయిన భవ నాలు హెచ్‌ఎండీఏ పరిధిలో నిర్మాణమవుతున్నాయి. కోకాపేట, పుప్పాలగూడ, నార్సింగి, మణికొండ తదితర ప్రాంతాల్లో 50 అంతస్తులకు పైగా భవనాలు వస్తున్నాయి. వివిధ రకాల అనుమతుల ఫీజుల ద్వారానేఏటా 2 వేల కోట్ల వరకు ఆదాయం వ స్తోంది. హెచ్‌ఎండీఏ పరిధి 7 వేల చదరపు కిలోమీటర్ల నుంచి 10 వేల చదరపు కిలోమీటర్ల వరకు పెరగడంతో భారీగా ఆదాయం వస్తుందని భావించారు. ఇప్పుడు అధిక ఆదాయమిచ్చే కీలకమైన ఔటర్‌ అవతలి వరకు గల 2 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతం జీహెచ్‌ఎంసీ పరిధిలోకి రావడం, 750 చదరపు కిలోమీటర్ల వరకు ప్యూచర్‌ సిటీ డెవల్‌పమెంట్‌ ఆథారిటీ (ఎఫ్‌సీడీఏ)కి వెళ్లటంతో హెచ్‌ఎండీఏ ఆదాయం భారీగా పడిపోయే అవకాశాలున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

Telangana State Election Commission: మోగిన నగారా

Hyderabad: తాగునీటితో కారు కడిగిన వ్యక్తి.. రూ.10వేల జరిమానా

Updated Date - Nov 26 , 2025 | 07:22 AM