Share News

BC Reservation: ఢిల్లీలో ‘బీసీ’ ధర్నా వాయిదా!

ABN , Publish Date - Jul 30 , 2025 | 03:20 AM

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో ఆగస్టు 6న నిర్వహించతలపెట్టిన మహా ధర్నా 11కు వాయిదా పడింది.

BC Reservation: ఢిల్లీలో ‘బీసీ’ ధర్నా వాయిదా!

  • 11న నిర్వహించాలని నిర్ణయం?

  • పార్లమెంటులో దేశ భద్రతపై చర్చ నడుస్తుండడమే కారణం!

  • ధర్నా తర్వాత మూడు రోజులు ఢిల్లీలోనే సీఎం, మంత్రులు!

  • బీసీ బిల్లులపై రాష్ట్రపతి ముర్ము,

  • ప్రధాని మోదీని కలిసే యత్నం

  • రాహుల్‌ సహకారంతో విపక్షాలను కూడగట్టాలని యోచన

హైదరాబాద్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో ఆగస్టు 6న నిర్వహించతలపెట్టిన మహా ధర్నా 11కు వాయిదా పడింది. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలన్న డిమాండ్‌తో ఈ ధర్నా నిర్వహించాలని రేవంత్‌ సర్కారు నిర్ణయించింది. అయితే, ప్రస్తుతం పార్లమెంటులో దేశ భద్రతకు సంబంధించిన చర్చలు జరుగుతుండడం, ఇతర కారణాల రీత్యా ధర్నాను వాయిదా వేసినట్లు తెలిసింది. బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్రంపై ఒత్తిడి పెంచే కార్యాచరణలో భాగంగా ఆగస్టు 6న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద మహా ధర్నా నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆ ధర్నాలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, బీసీ ప్రతినిధులూ పెద్ద ఎత్తున పాల్గొనాలన్న నిర్ణయం కూడా జరిగింది. మహా ధర్నాలో పాల్గొనేందుకు 5నే మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక రైల్లో హైదరాబాద్‌ నుంచి బయలుదేరి వెళ్లాలనుకున్నారు. 6న ధర్నా, 7న రాష్ట్రపతిని, కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవాలని నిర్ణయించారు. కానీ, పార్లమెంటులో ఆపరేషన్‌ సింధూర్‌తో పాటు ఇతర అంశాలపై వాడీవేడి చర్చలు నడుస్తున్న తరుణంలో బీసీ బిల్లులపై ఒత్తిడి కార్యాచరణకు జాతీయ స్థాయిలో పెద్దగా ప్రాధాన్యం లభించకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంటులో చర్చలు ముగిసిన తర్వాత ఈ అంశాన్ని చేపడితే బాగుంటుందని భావిస్తున్నారు.


మరోవైపు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తల్లో కదలికే లక్ష్యంగా ఈ నెల 31 నుంచి ఆగస్టు 6 వరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌లు పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాలను ప్రకటించారు. అలాగే ఽసీఎం రేవంత్‌, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొనే ధర్నా కార్యక్రమానికి ఢిల్లీలో రక్షణ కల్పించాల్సి ఉంటుంది. ధర్నాకు అనుమతులు, రాష్ట్రపతి, ప్రధాని, ప్రతిపక్ష నేతల అపాయింట్‌మెంట్లూ ఖరారు చేసుకుని పకడ్బందీగా కార్యక్రమాన్ని నిర్వహించేందుకే 11కు వాయిదా వేసినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 11న ధర్నా అనంతరం సీఎం, మంత్రులు మూడు, నాలుగు రోజులు ఢిల్లీలోనే ఉండి బీసీ బిల్లులపై ఒత్తిడి కార్యాచరణను అమలు చేయనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా పార్లమెంటులో కాంగ్రెస్‌ ఎంపీలతో బీసీ బిల్లులపై వాయిదా తీర్మానాలు ఇప్పించనున్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ సహకారంతో ఇతర విపక్ష నేతలనూ కూడగట్టేందుకు రేవంత్‌ ప్రయత్నించనున్నట్లు చెబుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో మంత్రులు, ముఖ్య నేతలతో రేవంత్‌ సమావేశమై, ఒత్తిడి కార్యాచరణను ఖరారు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.


ఈ వార్తలు కూడా చదవండి

సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట

హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 30 , 2025 | 03:20 AM