TG Government Schools: మరో 20 గురుకులాల మంజూరు
ABN , Publish Date - May 28 , 2025 | 04:36 AM
రాష్ట్రంలో మరో 20 సమీకృత గురుకులాల నిర్మాణానికి రూ.4 వేల కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు అయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 78 గురుకులాలు మంజూరు కాగా, ఈ ప్రాజెక్టు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పేరుతో జరుగుతుంది.
నిర్మాణానికి 4 వేల కోట్ల మంజూరు
పరిపాలనాపరమైన అనుమతులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, మే 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో 20 సమీకృత గురుకులాలు రానున్నాయి. ఒక్కో గురుకులానికి రూ.200కోట్ల చొప్పున.. వీటి నిర్మాణానికి రూ.4వేల కోట్లకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరయ్యాయి. ప్రభుత్వం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు(జీవో 96) జారీ చేసింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి ఒకటి చొప్పున.. మొత్తం 119 గురుకులాలను నిర్మించాలని సంకల్పించిన విషయం తెలిసిందే..! అయితే.. హైదరాబాద్‌లోని 14 నియోజకవర్గాల్లో స్థలాభావం కారణంగా.. ఆ సంఖ్యను 105కు కుదించారు. మొదటి రెండు దశల్లో 58 నియోజకవర్గాలకు గురుకులాలు మంజూరవ్వగా.. తాజాగా ఆలేరు, అశ్వారావుపేట, బాన్సువాడ, భద్రాచలం, భువనగిరి, దేవరకొండ, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మిర్యాలగూడ, పాలకుర్తి, పరిగి, పటాన్‌చెరు, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లిలో సమీకృత గురుకులాలు మంజూరయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మంజూరైన గురుకులాల సంఖ్య 78కి చేరుకుంది. కొడంగల్, మధిర, హుజూర్‌నగర్‌లో సమీకృత గురుకులాల నిర్మాణానికి ఇప్పటికే టెండర్లను ఆహ్వానించారు.