Share News

Rice Exports: పౌర సరఫరాల భవన్‌ పూర్తిగా తెలంగాణకే!

ABN , Publish Date - May 24 , 2025 | 03:18 AM

విదేశాలకు బియ్యం ఎగుమతి చేసే విషయమై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు కలిసి పని చేయాలని నిర్ణయించాయి. ముఖ్యంగా కాకినాడ ఓడరేవు నుంచి ఎగుమతిలో సహకరించుకోవాలని అంగీకారానికి వచ్చాయి.

Rice Exports: పౌర సరఫరాల భవన్‌ పూర్తిగా తెలంగాణకే!

  • 1 నుంచి పౌర సరఫరాల కార్పొరేషన్‌కు ఏపీ వాటా

  • బియ్యం ఎగుమతులకు ఏపీ సంపూర్ణ సహకారం

  • ఉత్తమ్‌, నాదెండ్ల భేటీలో నిర్ణయాలు

హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): విదేశాలకు బియ్యం ఎగుమతి చేసే విషయమై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు కలిసి పని చేయాలని నిర్ణయించాయి. ముఖ్యంగా కాకినాడ ఓడరేవు నుంచి ఎగుమతిలో సహకరించుకోవాలని అంగీకారానికి వచ్చాయి. రైతుల నుంచి ధాన్యం సేకరణ, ప్రజలకు ఆహార భద్రత కల్పించడం, బియ్యం ఎగుమతుల్లో పరస్పరం సహకరించుకోవడానికి ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. పౌర సరఫరాల శాఖ ఆస్తుల విభజనపై ఇరు రాష్ట్రాల మంత్రులు కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, నాదెండ్ల మనోహర్‌లు శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల పౌర సరఫరాల శాఖ కమిషనర్లు డీఎస్‌ చౌహాన్‌, సౌరభ్‌ గౌర్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంప్రదింపుల అనంతరం పలు నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్‌లోని పౌర సరఫరాల భవన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన సగం వాటా భవనాన్ని జూన్‌ 1 నుంచి తెలంగాణ వాడుకోనుంది. తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్‌ దీన్ని వినియోగించుకుంటుందని ఉత్తమ్‌ తెలిపారు. ఉమ్మడి పౌర సరఫరాల కార్పొరేషన్‌కు తెలంగాణలో ఉన్న ఆస్తులను పరస్పర అవగాహనతో క్రమక్రమంగా తెలంగాణకు బదలాయిస్తారని చెప్పారు. దశలవారీ ఆస్తుల మార్పిడిపై చర్చలు జరిగాయని వెల్లడించారు. తెలంగాణలో ఉన్న ఆస్తులన్నీ ఇవ్వాలని తాము అడిగినపుడు ఏపీ సానుకూలంగా స్పందించిందని, వారి సహకారానికి కృతజ్ఞతలని అన్నారు. తెలంగాణ వాడుకుంటున్న వాటాకు అద్దె చెల్లించేందుకు ఒప్పందం కుదిరిందని ఏపీ అధికారులు వెల్లడించారు. తెలంగాణ ఇప్పటికే ఫిలిప్పీన్స్‌కు కాకినాడ పోర్టు ద్వారా బియ్యం ఎగుమతి చేస్తోంది. ఇందుకు సంబంధించి ఏపీ కీలక సహాయం అందిస్తోంది. పోర్టు కార్యకలాపాలు, నిల్వ సౌకర్యాలు, ఎగుమతి విధానాల్లో ఏపీ సేవలను తెలంగాణ తీసుకుంటోంది. భవిష్యత్తులో తెలంగాణ మరిన్ని ఎగుమతులు చేయదలచుకుంటే విశాఖపట్నం, కృష్ణపట్నం పోర్టుల వద్ద కూడా ఇలాంటి సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఏపీ సర్కారు తెలిపింది.


రేషన్‌ బియ్యం అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. సంయుక్త నిఘా వ్యవస్థతో సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఒకే రకమైన విధానాలతో బియ్యం దారి మళ్లించకుండా అవినీతికి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇద్దరు మంత్రులు అంగీకారానికి వచ్చారు. దీనివల్ల పారదర్శకత పెరుగుతుందని, ఇరు రాష్ట్రాల్లో సమయానికి ప్రజలకు బియ్యం అందుతుందని, ప్రజా పంపిణీ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని ఇద్దరు మంత్రులు అన్నారు. ఇరు రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను పరస్పరం అధ్యయనం చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో ఇప్పటికే రేషన్‌ కార్డులను పీడీఎఫ్‌ రూపంలో డౌన్‌లోడ్‌ చేసుకునే వీలుంది. వాటిని ఆధార్‌ కార్డులతో అనుసంధానిస్తున్నారు. ధాన్యం రవాణాను గమ్యస్థానం చేరేవరకు నిరంతరం ట్రాక్‌ చేస్తున్నారు. వీటన్నింటినీ అమలుచేసే విషయమై ఆంధ్రప్రదేశ్‌ పరిశీలించనుంది. ‘‘ఇక్కడ ఇగోలకు తావులేదు. రెండువైపులా ఉన్న మంచి అంశాలను తీసుకుని ప్రజలకు పనికచ్చే వ్యవస్థలను నిర్మిస్తాం’’అని ఉత్తమ్‌ పేర్కొన్నారు. ధాన్యం నిల్వల విషయంలోనూ పారదర్శకతను పెంచేందుకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఇద్దరు మంత్రులు నిర్ణయించారు. వినియోగదారులకు ఎక్కువగా నచ్చే రకాల ధాన్యాన్ని పండించేందుకు ఇరు రాష్ట్రాల వ్యవసాయ శాఖలు కలిసి పని చేయాలని నిర్ణయించారు.


ఇవి కూడా చదవండి

Genelia D Souza: డ్రైవర్ తొందరపాటు.. జెనీలియాకు తప్పిన పెను ప్రమాదం

Viral Video: ఇండియన్ ఆక్వామ్యాన్.. ఉప్పొంగుతున్న మ్యాన్‌ హోల్‌లోంచి..

Updated Date - May 24 , 2025 | 03:18 AM