CM Revanth Reddy unveiled a 2047 vision: తెలంగాణ నంబర్ వన్!
ABN , Publish Date - Dec 09 , 2025 | 04:43 AM
రాబోయే పదేళ్లలో తెలంగాణను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన.. ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. జీడీపీలో ప్రస్తుతం 5 శాతంగా ఉన్న తెలంగాణ వాటాను 2047 నాటికి పది శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు......
రాబోయే పదేళ్లలో మా ప్రభుత్వ లక్ష్యం ఇదే
దేశంలో, ప్రపంచంలో అత్యుత్తమంగా తీర్చిదిద్దుతాం
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్
హైదరాబాద్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): రాబోయే పదేళ్లలో తెలంగాణను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన.. ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. జీడీపీలో ప్రస్తుతం 5 శాతంగా ఉన్న తెలంగాణ వాటాను 2047 నాటికి పది శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అభివృద్ధి విషయంలో చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాలే తమకు ప్రేరణ అని, ఆయా దేశాలతోనే ఇప్పుడు తాము పోటీ పడాలని భావిస్తున్నామని చెప్పారు. ‘తెలంగాణ రైజింగ్ అన్‌స్టాపబుల్’ అని స్పష్టం చేశారు. ఈ ప్రయాణంలో తమకు సంపూర్ణ మద్దతు ఇచ్చి.. రైజింగ్‌లో భాగస్వాములు కావాలని కోరారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ - 2025 ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలకోపన్యాసం చేశారు. ‘‘దేశానికి స్వాతంత్య్రం తర్వాత మన నాయకులు కొత్త రాజ్యాంగాన్ని రూపొందించి భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్ వేశారు. అలాగే, మేం కూడా తెలంగాణ భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్ రూపొందించాలని అనుకున్నాం. ఇందుకు మహాత్మా గాంధీ, అంబేడ్కర్, ఇతర రాజ్యాంగ నిర్మాతల నుంచి ఎంతో స్ఫూర్తిని పొందాం. తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటాలు చేశారు. చివరకు, 2014లో యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైంది. దేశంలో యువ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 2047 నాటికి వందేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో అప్పటికి మనం ఏం సాధించగలమో చెప్పాలని నేను నిపుణులను కోరాను. అప్పుడే ‘తెలంగాణ రైజింగ్- 2047’ దార్శనికతకు బీజం పడింది. మనం ఏదైనా గొప్పగా చేయాలని భావించినప్పుడు తెలంగాణ సంస్కృతిలో భాగంగా ముందుగా దేవుళ్ల ఆశీర్వాదం తీసుకుంటాం. ప్రజల మద్దతూ కోరతాం. భవిష్యత్తు కోసం మన కలలను నెరవేర్చుకోవడానికి ప్రజల ఆలోచనలు, అంచనాలు తెలుసుకున్నాం. అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నీతి ఆయోగ్ నిపుణుల సహాయం తీసుకున్నాం. ఈ విజన్ రూపొందించడంలో సహాయపడిన వారందరికీ ధన్యవాదాలు’’ అని వ్యాఖ్యానించారు. అన్ని రంగాలకు చెందిన ప్రతినిధులు సదస్సుకు రావడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఇక్కడికి వచ్చిన వ్యాపారవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు, విధాన నిర్ణేతలు, దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులు, నిపుణులకు ధన్యవాదాలు తెలిపారు. వారి సూచనలు, సలహాలు, అభిప్రాయాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ‘‘తెలంగాణలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. సానుకూల వాతావరణమూ ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి ఒక ట్రిలియన్.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని సంకల్పించాం. దేశ జనాభాలో రాష్ట్ర జనాభా 2.9 శాతం. కానీ, జీడీపీలో 5 శాతం వాటాను తెలంగాణ అందిస్తోంది. 2047 నాటికి దీనిని 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని ముఖ్యమంత్రి వివరించారు. విజన్‌లో భాగంగా తెలంగాణను సేవలు, తయారీ, వ్యవసాయ రంగాలుగా విభజించామని, ఇలా మూడు భాగాలుగా విభజించి ప్రాంతాలవారీగా అభివృద్ధి లక్ష్యాలను నిర్ధేశించుకున్న మొదటి రాష్ట్రం దేశంలో తెలంగాణేనని అన్నారు. ఇందులో భాగంగానే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్), పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (ప్యూర్), రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (రేర్) మోడళ్లను నిర్దేశించుకున్నామని చెప్పారు.

గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ స్ఫూర్తిగా..
‘‘గ్వాంగ్ డాంగ్ ప్రాంతం చైనాలోని ప్రావిన్స్‌లు అన్నిటికంటే పెద్దది. గడిచిన 20 ఏళ్లలో ఆ ప్రావిన్స్ ప్రపంచంలోనే అత్యధిక పెట్టుబడులను, వృద్ధి రేటును సాధించింది. తెలంగాణలో మేం కూడా అదే నమూనాను అనుసరించాలని భావిస్తున్నాం. ఈ విజన్ కష్టంగా అనిపించవచ్చు. కానీ, సాధించగలం. ఈ విషయంలో మా టీమ్‌కు నేను చెప్పేదొక్కటే..! కష్టంగా ఉంటే.. వెంటనే చేపడదాం! అసాధ్యం అని అనుకుంటే.. కొంత గడువు తీసుకుందాం’’ అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో సహకరించడానికి, పెట్టుబడి పెట్టడానికి తమకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ప్రతినిధులను కోరారు. నిన్నటి కంటే ఇవాళ తాను ఎక్కువ విశ్వాసం.. నమ్మకంతో ఉన్నానని, మీరంతా ఈ ప్రయాణంలో భాగస్వాములుగా ఉండాలని ఆశిస్తున్నానని చెప్పారు. అందరి మద్దతుతో లక్ష్యాలన్నింటినీ సాధించగలమని బలంగా నమ్ముతున్నానని చెప్పారు. తెలంగాణ రైజింగ్ అనేది అన్‌స్టాపబుల్ అని, వచ్చి దానిలో భాగస్వాములు కావాలని కోరారు.

ప్రపంచంతోనే తెలంగాణ పోటీ
‘‘రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నందుకు సీఎం రేవంత్, మంత్రివర్గానికి అభినందనలు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంచుకున్నది గ్లోబల్ విజన్. ఈ విజన్ చాలా గొప్పది. తెలంగాణ, బెంగళూర్ మధ్య పోటీ లేదు. తెలంగాణ ప్రపంచంతో పోటీపడుతోంది. భారీ ఎగుమతులు, గ్లోబల్ కెపాసిటీ సెంటర్‌లకు కేంద్రంగా బెంగళూర్ ఉంది. హైదరాబాద్, బెంగుళూర్ దేశంలో అత్యంత శక్తివంతమైన నగరాలు. దేశ అభివృద్ధి కోసం దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి పనిచేయాలి. దక్షిణ భారత దేశం జనాభాపరంగా చిన్నదే అయినా.. దేశ జీడీపీలో 31 శాతం వాటా ఉంది. 2030 నాటికి ఈ వాటా 40-45 శాతానికి పెరగనుంది. పెట్టుబడిదారుల్లో పూర్తి నమ్మకం ఉంది. అభివృద్ధి అనేది ఇంద్రజాలం కాదు. సంకల్పంతో నిజాయతీగా, కష్టపడి పనిచేస్తేనే సాధ్యమవుతుంది. సీఎం రేవంత్ మరింత బలపడాలి. సీఎం, మంత్రులు కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలి’’
- కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్

భవిష్యత్తు కోసం ఎదురుచూడం.. నిర్మిస్తాం
‘‘భవిష్యత్తు కోసం ఎదురుచూడకుండా.. దానిని మనమే నిర్మించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ సంకల్పం. మేం వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి ఆలోచన భావితరాల అవసరాల కోసం, రేపటి తెలంగాణ కోసమే. ఫీనిక్స్ పక్షి స్ఫూర్తితో.. సృజనాత్మకత, మానవ మూలధనం, స్థిరత్వం, అంతర్జాతీయ పెట్టుబడులకు నెలవుగా తెలంగాణను మార్చాలనే లక్ష్యంతోనే ‘తెలంగాణ రైజింగ్’కు శ్రీకారం చుట్టాం. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చేందుకు దార్శనికతతో కూడిన అడుగులు వేస్తున్నాం. భౌగోళిక విస్తీర్ణం, జనాభాలో ఇతర రాష్ట్రాలతో పోలిేస్త తెలంగాణ చిన్నదే అయినా.. దేశ జీడీపీలో 5 శాతం వాటాను కలిగి ఉంది. 2024-2025లో రాష్ట్ర జీఎ్‌సడీపీ వృద్ధిరేటు 10.1 శాతం కాగా, జాతీయ సగటు 9.9 శాతంగా నమోదైంది. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.79 లక్షలు, జాతీయ సగటు కంటే 1.8 రేట్లు ఎక్కువ. రాష్ట్ర సేవల రంగం వృద్ధిరేటు 11.9 శాతం కాగా, జాతీయ సగటు 10.7 శాతంగా ఉంది. రాష్ట్ర పారిశ్రామిక జీఎ్‌సవీఏ 12.6 శాతం వృద్ధిరేటుతో రూ.2.46 లక్షల కోట్ల నుంచి రూ.2.77 లక్షల కోట్లకు పెరిగింది. దేశంలోనే తొలి ఏఐ ఆధారిత గ్రామంగా మారిన మంథని నియోజకవర్గంలోని ఒక మారుమూల గ్రామం ‘రేపటి తెలంగాణ’కు మార్గదర్శిగా నిలిచింది.’’
- మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

నినాదం కాదు.. కార్యాచరణ ప్రణాళిక
తెలంగాణ విజన్ డాక్యుమెంట్ కేవలం నాలుగు గోడల మధ్య కూర్చొని తయారు చేసింది కాదు. ప్రముఖుల సలహాలు, నిపుణులతో చర్చించడమే కాకుండా ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని రూపొందించిన పత్రమది. అంటే, ఈ విజన్ డాక్యుమెంట్ ప్రభుత్వ పత్రం మాత్రమే కాదు.. అది ప్రజా పత్రం కూడా. అలాగే, 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ’ అనేది కేవలం నినాదం మాత్రమే కాదు. తెలంగాణలోని ప్రతీ జిల్లా, ప్రతీ రంగాన్ని అభివృద్ధి చేయాలన్న కార్యాచరణ ప్రణాళిక అందులో ఉంది. ఈ విజన్ డాక్యుమెంట్ ఒక సంవత్సరం కోసమో, ఎన్నికల కోసమో కాదు. 2047 నాటికి రాష్ట్రం ఎలా ఉండాలో ఊహించి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి దీర్ఘకాలిక ప్రణాళికలతో దీన్ని రూపొందించాం. అలాగే, తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన సంస్థల పేర్లను.. రోడ్లు, మౌలిక వసతులకు పెడుతున్నాం. ఓ యువకుడు ‘టాటా అవెన్యూ’ లేదా ‘గూగుల్ స్క్వేర్’ దగ్గరికి వెళ్తుంటే... అది ఒక రోడ్డు పేరు అనుకోవద్దు. యువతకు అదో ఉపాధి మార్గమని భావించాలి. అలాంటి ప్రేరణను కలిగించడమే మా ప్రభుత్వ ఉద్దేశం.
- భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం

ప్రపంచం చూపు... తెలంగాణ వైపు
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ అడుగులు వేస్తోంది. ఇక్కడి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రపంచ స్థాయి సంస్థలు ముందుకు వస్తున్నాయి. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా రూపొందించిన ప్రణాళికే తెలంగాణ రైజింగ్-2047. ఈ లక్ష్యాన్ని తెలంగాణ సాధిస్తుందన్న విశ్వాసం నాకు ఉంది. వికసిత్ భారత్-2047లో తెలంగాణ కీలక పాత్ర పోషించనుండడం అభినందనీయం. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో ప్రగతే లక్ష్యంగా పలు పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. సౌర విద్యుత్ ప్రాజెక్టులు, బస్సుల నిర్వహణ, రిటైల్ వ్యాపారాలతో మహిళలే ఆర్థిక వ్యవస్థలో చురుకైన భాగస్వామ్యులుగా మారుతున్నారు. రానున్న రోజుల్లో జరగనున్న అభివృద్ధితో తెలంగాణ ముఖచిత్రమే మారిపోనుంది. యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు ఏర్పాటైన స్కిల్ యూనివర్సిటీ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. మహిళలు, రైతులు, యువత, చిన్నారుల అభ్యున్నతే లక్ష్యంగా సమ్మిళిత అభివృద్ధిని సీఎం రేవంత్ రెడ్డి ఎంచుకున్నారని ప్రశంసించారు. మౌలిక సదుపాయాలు, విమానాశ్రయాలు, పునరుత్పాదక ఇంధనం, రవాణా నెట్‌వర్క్‌లు... 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం వైపు ఆధునిక తెలంగాణను నడిపించడానికి చోదకం కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న స్థిరమైన, స్పష్టమైన విధానాల వల్లే భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. గిగ్ వర్కర్స్ పాలసీ, విశ్రాంతి కేంద్రాల ఏర్పాటు వంటివి భవిష్యత్తు దృక్పథానికి ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.
- గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

రేవంత్ విజన్‌తో ‘సరికొత్త తెలంగాణ’
‘‘సీఎం రేవంత్‌రెడ్డి విజన్ చూస్తుంటే.. భవిష్యత్తులో ‘సరికొత్త తెలంగాణ’ను చూస్తామన్న నమ్మకం కలుగుతోంది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 20లక్షల మంది రైతుల రుణమాఫీ, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు అభినందనీయం. తెలంగాణ విజయబాటలో నడుస్తుందన్న నమ్మకం సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన బృందం ముఖాల్లో ఆత్మవిశ్వాసం రూపంలో వ్యక్తమవుతోంది. గత రెండేళ్లలో వైద్య రంగాన్ని పునర్నిర్మించడం, నాణ్యమైన విద్యకు ప్రాధాన్యమివ్వడం అభినందించాల్సిన అంశాలు. 2034 నాటికి తెలంగాణను ‘వన్ ట్రిలియన్ డాలర్’ ఎకానమీగా మార్చాలన్న విజన్ అసాధ్యమేమీ కాదు. ‘వికసిత్ భారత్’లో తెలంగాణది ప్రధాన పాత్ర అవుతుంది. ‘నీ జీవితంలో నువ్వు చూసిన అత్యంత నిరుపేద, అట్టడుగు మనిషి ముఖాన్ని గుర్తుతెచ్చుకో. నువ్వు చేేస చట్టం, నీ విధానాలు ఆ మనిషి ముఖంలో చిరునవ్వు తేగలిగితేనే దాన్ని అమలు చెయ్యి. లేదంటే చెత్తబుట్టలో పడెయ్యి’ అన్న మహాత్మాగాంధీ సూత్రాన్ని అనుసరించడమే సరైన పాలన అవుతుంది.
- నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి

తెలంగాణ విజన్.. ప్రపంచానికి ఆదర్శం!
రైజింగ్ తెలంగాణ- 2047 విజన్.. ప్రపంచంలోని ఇతర నగరాలు, ప్రాంతాలకు కూడా ఆదర్శం. మానవ వనరుల సామర్థ్యాన్ని వెలికితీసి, సామాజిక-ఆర్థిక పురోగతిని ఎలా సాధించాలనే దానికి తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్‌గా నిలుస్తోంది. తెలంగాణతో కలిసి పనిచేయడానికి మేం అనేక కొత్త రంగాలను గుర్తించాం. ఐటీ, ఫైనాన్స్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం గ్లోబల్ హబ్‌గా నిలిచింది. ఈ రంగాలన్నీ కలిసి ‘‘తెలంగాణ రైజింగ్’’ విజన్‌కు బలమైన పునాదిని వేస్తున్నాయి. భారీస్థాయి పారిశ్రామిక ప్రాజెక్టులు మాత్రమే కాకుండా ఏఐ సిటీ, ఫ్యూచర్ సిటీ, బలమైన ఇన్నోవేషన్ వ్యవస్థ, స్థిరమైన అభివృద్థిపై దృష్టిపెట్టిన అంశాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నాం. విజన్- 2047 సాధన దిశగా తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగాలని.. ఈ సమ్మిట్ విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. 2026 జనవరిలో దావో్‌సలో జరిగే సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తున్నాం.
- జెరిమీ జుర్గెన్స్, మేనేజింగ్ డైరెక్టర్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం

గ్రామీణ ప్రాంతాలకూ అభివృద్ధి విస్తరించాలి
‘‘గ్లోబల్ సమ్మిట్ కేవలం ఒక సదస్సు కాదు.. భవిష్యత్తు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ప్రపంచానికి ఇచ్చిన ఆహ్వానం. పెట్టుబడులే కాకుండా.. సమ్మిళిత వృద్ధి, గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దిశగా ప్రభుత్వంతో కలిసి నడుస్తాం. రాష్ట్ర అభివృద్ధి అంతా హైదరాబాద్‌కే పరిమితం కాకూడదు. గ్రామీణ జిల్లాలకూ విస్తరించాలి. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తరఫున మేం హైదరాబాద్ వెలుపల కూడా దృష్టి సారిస్తాం. ప్రాంతీయ సమానతాభివృద్ధి, లింగ సమానత్వం, ఎంఎ్‌సఎంఈల బలోపేతమే మా ప్రధాన ఎజెండా. సుమారు 50 వేల నుంచి లక్ష మంది రైతులను ఎంఎ్‌సఎంఈల నిర్వాహకులుగా మార్చేందుకు మద్దతు ఇస్తాం. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త అవకాశాలు సృష్టిస్తాం. సులభతర వాణిజ్యంతోపాటు వ్యాపార వ్యయం తగ్గించడంపై సర్కారు దృష్టి సారించడం శుభపరిణామం.’’
టీవీఎస్ దినేశ్, టీవీఎస్ లాజిస్టిక్స్ చైర్మన్, సీఐఐ మాజీ అధ్యక్షుడు

అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమంటే ఆర్థిక గణాంకాలను పెంచడం కాదు. సృష్టించిన సంపదలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయడమే అభివృద్ధి. సమాజంలోని చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందినప్పుడే ‘తెలంగాణ రైజింగ్’ అనే మాటకు నిజమైన సార్థకత చేకూరుతుంది. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వంటి భారీ లక్ష్యాలను నిర్దేశించుకోవడం మంచిదే. అయితే ఆచరణలో చిన్న చిన్న అడుగులే గొప్ప మార్పులకు నాంది పలుకుతాయి. అభివృద్ధికి సూచికగా విద్యారంగాన్ని, ముఖ్యంగా ప్రాథమిక విద్యను తీసుకోవాలి. నా దృష్టిలో ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఎలా ఉండాలంటే.. మూడో తరగతి చదువుతున్న పిల్లల్లో కనీసం 80 శాతం మంది తమ గ్రేడ్ స్థాయికి తగినట్లుగా లెక్కలు చేయగలగాలి, చదవగలగాలి. ఇది సాధించగలిగే లక్ష్యం. అత్యంత కీలకమైన లక్ష్యం కూడా. ఇలాంటి ప్రాథమిక అంశాలే రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తాయి.
- ప్రొఫెసర్ అభిజిత్ బెనర్జీ, నోబెల్ బహుమతి గ్రహీత