Share News

Godavari Cauvery Link: ఇచ్చంపల్లికి షరతులతో ఓకే

ABN , Publish Date - Aug 23 , 2025 | 05:40 AM

గోదావరి-కావేరి అనుసంధానం(జీసీ లింక్‌)లో భాగంగా ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్‌ కట్టి, నీటిని తరలించడానికి తెలంగాణ రాష్ట్రం షరతులతో అంగీకారం తెలిపింది.

Godavari Cauvery Link: ఇచ్చంపల్లికి షరతులతో  ఓకే

  • 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి అవకాశమివ్వాలి

  • గోదావరి-కావేరి వాటాను ఎక్కడైనా వాడుకునే స్వేచ్ఛ

  • 2 రిజర్వాయర్లను కేంద్రమే కట్టాలి

  • 968 టీఎంసీలతో చేపట్టే ప్రాజెక్టులకు అనుమతులివ్వాలి

  • కేంద్రానికి తేల్చిచెప్పిన తెలంగాణ

  • జలసౌధలో సమావేశమైన ఎన్‌డబ్ల్యూడీఏ కమిటీ

  • పోలవరం నుంచే గోదావరి-కావేరి అనుసంధానం: ఏపీ

  • రాష్ట్రాలు పెద్దమనసుతో అంగీకరించాలి: ఎన్‌డబ్ల్యూడీఏ

హైదరాబాద్‌/అమరావతి, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): గోదావరి-కావేరి అనుసంధానం(జీసీ లింక్‌)లో భాగంగా ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్‌ కట్టి, నీటిని తరలించడానికి తెలంగాణ రాష్ట్రం షరతులతో అంగీకారం తెలిపింది. ఇచ్చంపల్లిలో రిజర్వాయర్‌ కడితే దాని దిగువన ఉన్న సమ్మక్కసాగర్‌ (తుపాకులగూడెం)పై ఏ ప్రభావం పడదని అధ్యయనాల్లో తేలిన తర్వాత ముందుకెళ్లాలని పేర్కొంది. ఇక గోదావరి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ (దేవాదుల ఎత్తిపోతల పథకం) కింద 38 టీఎంసీలు, సీతారామ ఎత్తిపోతల పథకం కింద 67టీఎంసీలు, సమ్మక్కసాగర్‌ కింద 47టీఎంసీల నీటిని వినియోగించుకున్న తర్వాత వీటిపై సిమ్యులేషన్‌ అధ్యయనాలు జరిపి.. ఆ నివేదికలో పరిశీలన అనంతరమే ముందుకెళ్లాలని తేల్చిచెప్పింది. శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధలో జాతీయ నీటి అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) సంప్రదింపుల కమిటీ టాస్క్‌ఫోర్స్‌ సమావేశం జరిగింది. కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) ఛైర్మన్‌ అతుల్‌ జైన్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌, తెలంగాణ ప్రత్యక్షంగా హాజరుకాగా.. మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ ప్రతినిధులు వర్చువల్‌గా హాజరయ్యారు. జాతీయ ప్రయోజనాలు ముడిపడి లేని ఇంట్రా లింక్‌ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వరాదని, గోదావరి-కావేరిలో తరలించే నీటిలో 50శాతం వాటా తెలంగాణకు ఇవ్వాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా కోరారు. ఈ వాటాను రాష్ట్రంలో ఎక్కడైనా వాడుకునేలా రెండు రిజర్వాయర్లను కేంద్ర నిధులతో కట్టించి ఇవ్వాలన్నారు. గోదావరిలో 968 టీఎంసీలతో చేపట్టిన ప్రాజెక్టులకు క్లియరెన్స్‌లు ఇవ్వాలన్నారు. ఇచ్చంపల్లి నుంచి సాగర్‌ దాకా నీటిని తరలించే కన్వేయర్‌ సిస్టమ్‌పై సంయుక్త అధ్యయనాలు చేసి, సాధ్యమైనంత ముంపును తగ్గించాలన్నారు. ఇచ్చంపల్లి నుంచి తరలించే జలాలను నాగార్జునసాగర్‌లో కాకుండా సాగర్‌ టెయిల్‌పాండ్‌లో వేయాలని రాహుల్‌ బొజ్జా కోరారు. జీసీ లింక్‌లో కర్ణాటకకు కేటాయించిన 16 టీఎంసీలను ఆల్మట్టిలో వాడుకుంటే ఆ ప్రభావం జూరాలపై పడుతుందని, దీనిపై పునరాలోచన చేయాలన్నారు. జీసీ లింక్‌లో భాగంగా ఏపీ ప్రతిపాదించిన నాలుగు ఇంట్రా లింక్‌ల కాన్సెప్ట్‌ నోట్‌లను పరిగణనలోకి తీసుకోవడం, ఆ తర్వాత వీటికి డీపీఆర్‌లు సిద్ధంచేయాలని ఎన్‌డబ్ల్యూడీఏ కోరడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. కృష్ణా, గోదావరి ట్రైబ్యునల్‌ తీర్పునకు విరుద్ధంగా గోదావరి-బనకచర్ల అనుసంధానం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాకే.. ఈ లింక్‌లను ఏపీ ప్రతిపాదించిందని, దీనిని సీడబ్ల్యూసీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), గోదావరి బోర్డు కూడా వ్యతిరేకించాయని గుర్తుచేసింది. ఇచ్చంపల్లి రిజర్వాయర్‌ నిర్మించాక 200టీఎంసీల వరద జలాలను వాడుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరింది. జీసీ లింక్‌పై సమ్మతి తెలిపే మెమోరాండం ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌(ఎంవోఏ)పై సంతకాలకు తొందరేమీ లేదని, అందరి సమ్మతి లభించాకే.. అధ్యయనం అనంతరం సంతకాలు చేస్తామని పేర్కొంది.


పోలవరం-జీసీ లింక్‌ను చేపట్టాలి..

పోలవరం నుంచి గోదావరి-కావేరి అనుసంధానం చేపట్టే ప్రతిపాదనల్ని పరిశీలించాలని ఏపీ కోరింది. గోదావరిలో నీటి లభ్యతపై 2023 జూన్‌లో సీడబ్ల్యూసీ ఇచ్చిన నివేదిక ఆమోద యోగ్యం కాదని, ఆ నివేదిక ఆధారంగానే గోదావరి-కావేరి లింక్‌ను ప్రతిపాదించారని, దానిని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపింది. ‘‘గోదావరి-కావేరిలో తొలివిడతలో తరలించే 147 టీఎంసీలు ఛత్తీ్‌సగఢ్‌ వినియోగించుకోని వాటాగా చెబుతున్నారు. తొలుత ఆ రాష్ట్రం సమ్మతి తీసుకోవాలి. గోదావరి ట్రైబ్యునల్‌ అవార్డు ప్రకారం ఛత్తీ్‌సగఢ్‌ తనకు కేటాయించిన నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతుంది. అదే జరిగితే జీసీ లింక్‌తో ఏపీలో నిర్మాణంలో ఉన్న, ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. నాగార్జునసాగర్‌పై మళ్లీ సిమ్యులేషన్‌ స్టడీస్‌ చేయాలి. తుంగభద్ర సబ్‌ బేసిన్‌ పరిధిలో కరువుపీడిత ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలి. గోదావ రి-కావేరి అనుసంధానంలో భాగంగా కృష్ణాబేసిన్‌కు నీటిని తరలిస్తే.. ఆ బేసిన్‌ నీటిని వాడుకునే ఇతర రాష్ట్రాలు కూడా వాటా కోరే అవకాశం ఉంది. గోదావరిలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ, వ్యాప్కోస్‌ అధ్యయనాల్లో తేడా ఉంది’’ అని ఏపీ పేర్కొంది.


40 టీఎంసీలైనా ఇవ్వండి..

గోదావరి-కావేరి అనుసంధానంలో తమకు కనీసం 40 టీఎంసీలైనా కేటాయించాలని కర్ణాటక కోరింది. తుంగభద్ర జలాశయం పూడిక కారణంగా 30 టీఎంసీల నిల్వను కోల్పోయిందని తెలిపింది. జీసీ లింక్‌లో భాగంగా ప్రతిపాదించిన బెడ్తి-వారాదా అనుసంధానంతో ప్రయోజనం లేదని, తుంగభద్ర ఎగువన మరో లింక్‌ను ప్రతిపాదిస్తామని పేర్కొంది. కాగా, గోదావరిలో 48 శాతం పరివాహక ప్రాంతం మహారాష్ట్రలో ఉందని ఆ రాష్ట్రం గుర్తు చేసింది. అయినా జీసీ లింక్‌లో నీటిని కేటాయించలేదని తప్పుబట్టంది. తాము ఇంద్రావతి సబ్‌బేసిన్‌లో 41 టీఎంసీలతో ఒక ప్రాజెక్టును ప్రతిపాదిస్తున్నామని, దీనిని జీసీ లింక్‌లో భాగం చేయాలని కోరింది. కృష్ణా ట్రైబ్యునల్‌ తీర్పు ప్రకారం ఒక బేసిన్‌ నుంచి మరో బేసిన్‌కు నీటిని తరలిస్తే.. ఆ బేసిన్‌ను పంచుకునే రాష్ట్రాలకు ఆ నీటిపై హక్కు ఉంటుందని, దాని ప్రకారం నీటి కేటాయింపులు చేయాలని మహారాష్ట్ర పేర్కొంది. కాగా, గోదావరి ట్రైబ్యునల్‌ తీర్పు ప్రకారం తమకు వాటాగా వచ్చిన నీరంతా వాడుకుంటామని ఛత్తీ్‌సగఢ్‌ తెలిపింది. గోదావరిలో 301 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయని, 163 టీఎంసీల వినియోగానికి అనుగుణంగా ప్రణాళికలున్నాయని పేర్కొంది. 100 టీఎంసీలతో బోధ్‌ఘాట్‌ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నామని ప్రతిపాదించింది. దీంతో సీడబ్ల్యూసీ జోక్యం చేసుకొని, ‘‘అది జలవిద్యుత్‌ ప్రాజెక్టు కదా! దాని కింద నీటి వినియోగం ఏదీ లేదు కదా!’’ అని గుర్తు చేసింది. దీంతో.. అది బహుళార్థ సాధక ప్రాజెక్టు అని ఛత్తీ్‌సగఢ్‌ తెలిపింది. ఇంద్రావతి పైన జోర్‌నాలాను మళ్లించేందుకు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడానికి సహకరించాలని కోరింది. కాగా, గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టుకు సమ్మతి తెలుపుతూ ఎంవోఏపై ఇప్పటికే సంతకాలు చేశామని పుదుచ్చేరి తెలిపింది. కావేరి తీవ్ర లోటు బేసిన్‌ అని, తక్షణమే జీసీ లింక్‌ను చేపట్టాలని తమిళనాడు కోరగా.. 2.4 టీఎంసీలు కాకుండా 7.4 టీఎంసీల నీటి కేటాయింపు చేయాలని పుదుచ్చేరి విజ్ఞప్తి చేసింది.


గోదావరి నీటిని వాడుకోం: ఎన్‌డబ్ల్యూడీఏ

గోదావరి-కావేరి అనుసంధానంలో గోదావరి జలాలను వాడుకోబోమని ఎన్‌డబ్ల్యూడీఏ తెలిపింది. హిమాలయన్‌ కాంపోనెంట్‌ నుంచి నీటిని తీసుకొచ్చి.. గోదావరిలో పోసి ఆ నీళ్లను గోదావరి-కావేరిలోతరలిస్తామని సీడబ్ల్యూసీ చైర్మన్‌ అతుల్‌ జైన్‌ చెప్పారు. రాష్ట్రాలన్నీ గోదావరి-కావేరికి అంగీకరించాలని కోరారు. ప్రస్తుతం గోదావరిలో ఛత్తీ్‌సగఢ్‌ వినియోగించుకోని 147 టీఎంసీల నీటిని తరలిస్తున్నాం, ఛత్తీస్‌గఢ్‌ ఆ నీటిని వినియోగించుకునేలా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టగానే జీసీ లింక్‌ను నిలిపివేస్తామని అన్నారు. మరో 15 ఏళ్లయినా ఛత్తీ్‌సగఢ్‌ వాటాను వాడుకునే అవకాశాల్లేవన్నారు. జీసీ లింక్‌లో ప్రతిపాదించే లింక్‌లకే నిధులు ఇస్తామని, ప్రాజెక్టుకు నిధులన్నీ కేంద్రమే భరిస్తుందని పేర్కొన్నారు. ఇంత మంచి అవకాశాన్ని కోల్పోవొద్దని, జీసీ లింక్‌ను అంగీకరించాలని సూచించారు. ఈ సమావేశానికి తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ తదితరులు హాజరయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి

లైసెన్సు తీసుకున్న కేబుల్ తప్ప ఏవీ ఉంచొద్దు... హైకోర్టు కీలక ఆదేశాలు

అందుకే యూరియా ఆలస్యమైంది

Read Latest Telangana News and National News

Updated Date - Aug 23 , 2025 | 05:40 AM