Teachers Reject Promotions: పదోన్నతులు వద్దు.. ఉన్నచోటే ముద్దు
ABN , Publish Date - Aug 26 , 2025 | 03:11 AM
పదోన్నతులు కల్పించాలంటూ ఉద్యమించే ఉపాధ్యాయులు.. ఇస్తే మాత్రం తీసుకునేందుకు సిద్ధంగా లేరు. దీనికి కారణం..
గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులుగా వెళ్లేందుకు 20ు మంది విముఖత
హైదరాబాద్‌లో హెచ్‌ఆర్‌ఏ 24 శాతం.. వేరే జిల్లాలకు వెళ్తే 11 శాతమే
వచ్చే ఇంక్రిమెంట్ కంటే కోల్పోయేదే ఎక్కువని పేర్కొంటున్న టీచర్లు
హైదరాబాద్, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): పదోన్నతులు కల్పించాలంటూ ఉద్యమించే ఉపాధ్యాయులు.. ఇస్తే మాత్రం తీసుకునేందుకు సిద్ధంగా లేరు. దీనికి కారణం..హెచ్‌ఆర్‌ఏ తగ్గటం, దూరప్రాంతాలకు వెళ్లాల్సిరావడం! ఏడాది తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో పదోన్నతుల ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 880 మంది స్కూల్ అసిస్టెంట్, తత్సమాన పోస్టుల్లో ఉన్నవారికి గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించారు. ఇందులో మల్టీజోన్-1లో 490, మల్టీజోన్-2లో 390 మంది ఉన్నారు. అయితే జోనల్ స్థాయి నుంచి హెచ్‌ఎంగా మల్టీజోన్‌కు వెళ్లేందుకు అనేకమంది స్కూల్ అసిస్టెంట్లు సిద్ధంగా లేరు. ముఖ్యంగా మల్టీజోన్-2లోని హైదరాబాద్ జిల్లాలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు ఇదే జిల్లా పరిధిలో వస్తేనే వెళుతున్నారు. ఇతర జిల్లాలకు వెళ్లాలంటే విముఖత చూపిస్తున్నారు. హైదరాబాద్‌లో హెచ్‌ఆర్‌ఏ 24శాతం ఉండగా, ఇతర జిల్లాల్లో కేవలం 11శాతంగా ఉంది. పదోన్నతులు వస్తే ఒక ఇంక్రిమెంట్ పెరుగుతుంది. దీంతో వారికి గరిష్ఠంగా కలిగే ఆర్థిక ప్రయోజనం రూ.4 వేలకు మించి ఉండదు. అదే హెచ్‌ఆర్‌ఏ తగ్గితే అంతకుమించి నష్టం ఉంటుందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. అయితే ఇప్పటికే సీనియారిటీ జాబితాను ప్రకటించిన పాఠశాల విద్యా శాఖ.. ఒక్కో పోస్టుకు తొలుత ముగ్గురిని ఎంపిక చేసి.. ఒకర్ని ఖరారు చేసింది. కొత్త పోస్టులో చేరేందుకు 15 రోజుల గడువు ఉంటుంది. ఆలోపు చేరకపోతే పదోన్నతిని రద్దు చేస్తారు. దాంతో ఆ ఖాళీ అలాగే ఉండిపోనుంది. రాష్ట్రం మొత్తంలో 880 మందికి గ్రేడ్-2 హెచ్‌ఎంలుగా పదోన్నతులు ఇవ్వగా.. వారిలో 20శాతం మంది అనాసక్తితో ఉన్నారు. వీరిలో అత్యధికులు హైదరాబాద్ జిల్లా ఉపాధ్యాయులే. స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 2,324 స్కూల్ అసిస్టెంట్, 640 ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంల పోస్టులను సీనియారిటీ ఆధారంగా ఎస్జీటీలతో భర్తీ చేస్తున్నారు. ఈ జాబితాను ఇప్పటికే ప్రకటించారు. మంగళవారం ఉత్తర్వులు ఇస్తారు. అయితే పదోన్నతుల్లో దూరప్రాంతాలకు బదిలీ అయినవారిలో అత్యధికులు విముఖత చూపించే అవకాశాలు ఉన్నాయి. ఎస్జీటీగా ప్రాథమిక పాఠశాలలో బోధించి.. స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందితే ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు నిపుణుడిగా బోధించాల్సి ఉంటుంది. దీనికి అనేకమంది సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. దీంతో స్కూల్ అసిస్టెంట్, ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంల పోస్టులు ఖాళీగా ఉండిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే పదోన్నతుల ఉద్దేశం నెరవేరకపోగా, విద్యా వ్యవస్థ గాడి తప్పనుంది. కొత్త పోస్టులో చేరకపోతే ప్రస్తుత నిబంధనల ప్రకారం మళ్లీ పదోన్నతులు చేపట్టేవరకు ఆ పోస్టు ఖాళీగా ఉండిపోతుంది. ఒక్క పోస్టు కూడా ఖాళీగా మిగలకుండా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, 20శాతం అదనపు ఆప్షన్లు కల్పించాలని పాఠశాల ఉపాధ్యాయుల సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి చావ రవి విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ
ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం
For More National News