Teachers Protest for CPS Cancellation: సీపీఎస్ రద్దు హామీని నిలబెట్టుకోవాలి
ABN , Publish Date - Sep 02 , 2025 | 04:10 AM
కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి చగన్‌లాల్ రోజ్..
పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద
ఉపాధ్యాయుల భారీ ధర్నా
వేలాదిగా వచ్చిన టీచర్లు
నల్ల దుస్తులతో నిరసన
ఏడాదిలోగా పాత పింఛను పథకాన్ని పునరుద్ధరించాలి
ఉద్యోగుల జేఏసీ తీర్మానం
హైదరాబాద్, రాంనగర్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని (సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి చగన్‌లాల్ రోజ్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్త పెన్షన్ విధానం అమల్లోకి వచ్చిన సెప్టెంబరు 1ని ఉపాధ్యాయులు పెన్షన్ విద్రోహ దినంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన భారీ ధర్నాకు పలు జిల్లాల నుంచి వేలాదిగా ఉపాధ్యాయులు తరలివ చ్చి నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సీపీఎ్‌సను రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో పేర్కొందని, దీన్ని వెంటనే అమలు చేసి హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. పాత పింఛన్‌ను పునరుద్ధరిస్తే ఉపాధ్యాయుల హృదయంలో సీఎం రేవంత్ రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోతారని, లేనిపక్షంలో సీపీఎ్‌సను రద్దుచేసే ప్రభుత్వాన్ని తెచ్చుకుంటామని హెచ్చరించారు. పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరిస్తేనే ప్రభుత్వానికి ఉపాధ్యాయుల మద్దతు కొనసాగుతుందని, సీపీఎ్‌సను రద్దు చేసే దాకా ఉపాధ్యాయుల ఆందోళనలు కొనసాగుతాయని చెప్పారు. చగన్‌లాల్ రోజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దయిందని, ఈ ఆందోళనతో తెలంగాణలోనూ రద్దవుతుందన్న నమ్మకం కలుగుతోందన్నారు. పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆందోళనలో ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ ఏలూరి శ్రీనివాస రావు పాల్గొని మద్దతు తెలిపారు. సీపీఎస్ రద్దు విషయమై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమం తీవ్రతరమవుతుందని ఉద్యోగుల జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

పాత పెన్షన్ పథకం పునరుద్ధరించాలి : కోదండరాం
పాత పెన్షన్ పథకం పునరుద్ధరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సీపీఎస్ ఉద్యోగుల సభ జరిగింది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని సీఎం, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్తానన్నారు. మార్క కొమురయ్య మాట్లాడుతూ పాత పెన్షన్ విధానం అమలు చేయాలనే ఉద్యోగుల డిమాండ్ న్యాయమైనదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తానన్నారు. యూనియన్ చైర్మన్ లచ్చిరెడ్డి మాట్లాడుతూ సెప్టెంబరు 1 ఉద్యోగులకు విద్రోహ దినమని, సీపీఎస్ ఉద్యోగులకు శాపంగా మారిందన్నారు. సీపీఎ్‌సను రద్దు చేసి ఓపీఎస్ విధానం అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల గౌరవ అధ్యక్షుడు కె.రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్, హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై కొన్ని ఘడియల్లో విచారణ
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు
For More TG News And Telugu News