పెద్దగట్టుకు చేరిన దేవరపెట్టె
ABN , Publish Date - Feb 17 , 2025 | 03:55 AM
తెలంగాణలో సమ్మక్క సారలమ్మ జాతర తరువాత రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన సూర్యాపేట శ్రీ లింగమంతులస్వామి(పెద్దగట్టు) జాతర ఆదివారం రాత్రి ప్రారంభమైంది.

ప్రారంభమైన పెద్దగట్టు జాతర
20వ తేదీ దాకా విజయవాడ హైవేపై ట్రాఫిక్ మళ్లింపు
సూర్యాపేట, కోదాడ, నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో సమ్మక్క సారలమ్మ జాతర తరువాత రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన సూర్యాపేట శ్రీ లింగమంతులస్వామి(పెద్దగట్టు) జాతర ఆదివారం రాత్రి ప్రారంభమైంది. జాతరలో కీలకమైన దేవరపెట్టె (అందెనపు చౌడమ్మ, లింగమంతుల స్వామి ఉత్సవ మూర్తులు)కు ఆనవాయితీ ప్రకారం కేసారం గ్రామంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవరపెట్టెను ఊరేగింపుగా ఆదివారం అర్ధరాత్రికి దురాజ్‌పల్లిలోని పెద్దగట్టుకు చేర్చారు. దీంతో జాతర ప్రారంభమైనట్లు నిర్వాహకులు ప్రకటించారు. కేసారంలోని మెంతబోయిన వంశస్తులకు చెందిన దేవరగుడిలో దేవరపెట్టెకు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మున్నా, గొర్ల, కులస్తులతోపాటు సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి, తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమే్‌షరెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇక, పెద్దగట్టు జాతర నేపథ్యంలో హైదరాబాద్- విజయవాడ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపు చేస్తున్నామని కోదాడ డీఎస్పీ ఎం. శ్రీధర్‌రెడ్డి తెలిపారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు కోదాడ సమీపంలోని బాలాజీనగర్ ఫ్లైఓవర్ వద్ద ట్రాఫిక్‌ను మళ్లించి, హుజుర్‌నగర్, మిర్యాలగూడ, నల్లగొండ, నార్కెట్‌పల్లి మీదుగా హైదరాబాద్‌కు పంపుతారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను కూడా అదే మార్గంలో కోదాడ వద్ద జాతీయ రహదారితో కలవనున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు ఈ ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది.