Share News

కృష్ణా జల వివాదంపై.. 27న వాదనలు వింటాం

ABN , Publish Date - Feb 14 , 2025 | 03:59 AM

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదంపై ఈ నెల 27న సుదీర్ఘ వాదనలు వింటామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 25లోపే అన్ని అంశాలపై షార్ట్‌ నోట్‌ సమర్పించాలని న్యాయవాదులను ఆదేశించింది.

కృష్ణా జల వివాదంపై.. 27న వాదనలు వింటాం

  • 25లోపే షార్ట్‌ నోట్‌ ఇవ్వండి

  • న్యాయవాదులకు సుప్రీం కోర్టు స్పష్టం

  • తెలంగాణకు అన్యాయం జరగనివ్వం: ఉత్తమ్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి) : తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదంపై ఈ నెల 27న సుదీర్ఘ వాదనలు వింటామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 25లోపే అన్ని అంశాలపై షార్ట్‌ నోట్‌ సమర్పించాలని న్యాయవాదులను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య కృష్ణా జలాలను విభజన చట్టంలోని సెక్షన్‌ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా కేటాయించాలని తొలుత నిర్ణయించారు. దీని ప్రకారం తొలుత బ్రిజే్‌షకుమార్‌ ట్రిబ్యునల్‌కు కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే, దీని వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టం 1956లోని సెక్షన్‌3 ప్రకారం కృష్ణా జలాల పునఃపంపిణీని చేపట్టాలని కేంద్రాన్ని తెలంగాణ కోరింది. సుదీర్ఘకాలం తర్వాత కేంద్రం బ్రిజే్‌షకుమార్‌ ట్రిబ్యునల్‌కు గతేడాది అక్టోబర్‌లో నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. సెక్షన్‌ 3 ప్రకారం కృష్ణాజలాల పంపిణీ చేపట్టాలని ఆదేశించింది.


అయితే, కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి ట్రిబ్యునల్‌కు కేంద్రం జారీ చేసిన సెక్షన్‌ 3 టీవోఆర్‌ను రద్దు చేయాలని 17 అక్టోబరు 2023న ఏపీ సర్కారు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కేంద్ర నిర్ణయం ఆమోదయోగ్యం కాదని, నదీ జలవివాద చట్టం ప్రకారం బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌కు ఇలా అదనపు అంశాలను పరిశీలించే అధికారం లేదని రిట్‌ పిటిషన్‌లో పేర్కొంది. ఏపీ దాఖలు చేసిన పిటిషన్‌ గురువారం జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఎన్‌ కోటీశ్వర్‌ సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. అయితే, ఈ నెల 19నుంచి కృష్ణా ట్రిబ్యునల్‌లో వాదనలు జరగాల్సి ఉందని, ఈ నేపథ్యంలో త్వరగా తమ వాదనలు వినాలని ఏపీ తరఫు న్యాయవాదులు కోరారు. వాదనలు వినిపించడానికి ఎంత సమయం పడుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. సుమారు రెండు గంటలకుపైగా పడుతుందని న్యాయవాదులు స్పష్టం చేశారు. అయితే.. ప్రస్తుతం అంత సమయం లేనందున ఈ నెల 27న వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది.

రాష్ట్ర హక్కులను పరిరక్షిస్తాం: ఉత్తమ్‌

తెలంగాణ హక్కులను రక్షించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని, కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వబోమని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టులో గురువారం జరిగిన విచారణకు రాష్ట్ర అధికారులు, న్యాయవాదులతో కలిసి ఉత్తవ్‌ హాజరయ్యారు. గురువారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు తెలంగాణ ప్రభుత్వ వాదనలకు మద్దతుగా నిలిచాయని, ఇది రాష్ట్ర హక్కులను రక్షించడంలో ముందడుగని అన్నారు.

Updated Date - Feb 14 , 2025 | 03:59 AM