Supreme Court Orders Telangana: పెంచిన తల్లిదండ్రులకే ఆ పిల్లల్ని ఇవ్వండి
ABN , Publish Date - Aug 26 , 2025 | 04:02 AM
ఆ పిల్లలకు ఊరట వారిని పెంచిన తల్లిదండ్రులకూ ఊరట ఇంకా కన్ను తెరవని పిల్లలను దత్తత తీసుకుని, పెంచిన తల్లిదండ్రులకే ఆ పిల్లలను తిరిగి ఇచ్చెయ్యాలని తెలంగాణ ప్రభుత్వాన్నిసుప్రీంకోర్టు...
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ
గతంలో ఇచ్చిన ఆదేశాలు పాటించకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం
కోర్టు ధిక్కరణకు పాల్పడ్డ అధికార్లు 2న వర్చువల్‌గా హాజరు కావాలని ఆదేశం
న్యూఢిల్లీ, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ఆ పిల్లలకు ఊరట! వారిని పెంచిన తల్లిదండ్రులకూ ఊరట!! ఇంకా కన్ను తెరవని పిల్లలను దత్తత తీసుకుని, పెంచిన తల్లిదండ్రులకే ఆ పిల్లలను తిరిగి ఇచ్చెయ్యాలని తెలంగాణ ప్రభుత్వాన్నిసుప్రీంకోర్టు మరోసారి ఆదేశించింది. మంగళవారం (ఆగస్టు 26) ఉదయం 11 గంటలలోపే ఆ చిన్నారులను వారికి అప్పగించాలని స్పష్టం చేసింది. ఈమేరకు ఆగస్టు 12న తాము ఇచ్చిన తీర్పును పాటించకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన అధికారులు తదుపరి విచారణ జరిగే సెప్టెంబర్ 2న వర్చువల్‌గా తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. గత ఏడాది మే నెలలో మేడిపల్లి పోలీస్ ేస్టషన్ పరిధిలో ఒక రిపోర్టర్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌తో పిల్లల అక్రమ రవాణా, విక్రయం వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. మహిళా ఆర్‌ఎంపీ వైద్యురాలి నేతృత్వంలో జరుగుతున్న తతంగంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో ఆ ఆర్‌ఎంపీ మొత్తం 16 మంది చిన్నారులు (నలుగురు మగ, 12 మంది ఆడపిల్లల్ని) అమ్మినట్లు గుర్తించారు. ఈ కేసులో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఆ 16 మంది చిన్నారుల్లో ఏడుగురిని అమ్మకం దశలోనే పట్టుకోగా, మరో తొమ్మిది మంది పసిపాపలను అప్పటికే అక్రమ రవాణా ముఠాకు విక్రయించేశారు. ఆ తొమ్మిది మంది చిన్నారులను కొనుగోలు చేసినవారి ఆచూకీ గుర్తించి వారి నుంచి చిన్నారులను తీసుకొని రాష్ట్ర మాతా, శిశు సంక్షేమ శాఖకు అప్పగీంచారు. వీరిని సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ(కారా) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దత్తత ప్రక్రియలో పెట్టింది. వీరిలో అమ్మకం దశలో దొరికిన ఆరుగురు చిన్నారులను కొందరు తల్లిదండ్రులు దత్తత తీసుకున్నారు.
అలాగే.. మిగిలిన తొమ్మిది మంది చిన్నారులను కూడా పిల్లలు లేని కొందరు తల్లిదండ్రులు ఎంపిక చేసుకున్నారు. తమ పిల్లల్ని తమకే ఇవ్వాలంటూ వారిని అప్పటిదాకా పెంచిన (దత్తత తీసుకున్న) తొమ్మిది మంది తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించగా... సింగిల్ బెంచ్ వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో.. ఆ పిల్లలను ఎంపిక చేసుకున్న తల్లిదండ్రులు వారిని తీసుకెళ్లడానికి ఒక్క పూట ముందు.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దీనిని సవాల్ చేస్తూ.. రాష్ట్ర శిశు సంక్షేమ విభాగండివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఆ అప్పీల్‌పై వాదనలు విన్న ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వానికి సానుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో.. ఆ పిల్లలను పెంచిన తల్లిదండ్రుల్లో దాసరి అనిల్ కుమార్ కుటుంబంతోపాటు మరో ముగ్గురు దంపతులు ఆ తీర్పును సవాల్ చేస్తూ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తమ వాదన విన్నాకే ఉత్తర్వులు ఇవ్వాలని కేవియట్ వేసింది. ఈ పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం.. కొనుగోలు చేసిన తల్లిదండ్రులకే పిల్లల్ని ఇవ్వాలని ఈ నెల 12న తుది తీర్పు ఇచ్చింది. 14వ తేదీకల్లా వారిని తల్లిదండ్రులకు అప్పగించాలని ఆదేశించింది. ఈ తీర్పును సమీక్షించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేసింది. దీంతో.. 14వ తేదీకల్లా పిల్లలను తమకు అప్పగించాలన్న కోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని ఆ పిల్లలను పెంచిన తల్లిదండ్రులు 18న సుప్రీకోర్టులో ధిక్కరణ పిటిషన్ వేశారు. సోమవారం జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆ పిటిషన్‌ను విచారించింది. గతంలో ఇచ్చిన తీర్పును రాష్ట్రప్రభుత్వం అమలు చేయకపోవడంపై జస్టిస్ నాగరత్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సుప్రీంకోర్టు ఆదేశాలనే పాటించకోపోతే ఎలా?’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. తమ వద్దకు వచ్చిన నలుగురు దంపతులకూ.. వారి పెంచుకకున్న పిల్లలను మంగళవారం ఉదయం 11 గంటలలోపు ఇవ్వాలని ఆదేశించారు. మిగిలిన ఐదుగురికి సంబంధించిన కేసు ఈ నెల 28న రాష్ట్ర హైకోర్టు ముందుకు రానుంది.
ఇవి కూడా చదవండి..
ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ
ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం
For More National News