Share News

Prabhakar Rao in Phone Tapping Case: ప్రభాకర్‌రావు విచారణకు సహకరించడం లేదు

ABN , Publish Date - Aug 26 , 2025 | 04:10 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక నిందితుడు, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు విచారణకు సహకరించడం లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఫోన్‌ ట్యాపింగ్‌లో కీలకమైన ప్రభుత్వ ల్యాప్‌టా్‌పలో డాటాను డిలీట్‌ చేశారని...

Prabhakar Rao in Phone Tapping Case: ప్రభాకర్‌రావు విచారణకు సహకరించడం లేదు

ఎలకా్ట్రనిక్‌ పరికరాలను ఫార్మాట్‌ చేశారు.. ప్రభుత్వ ల్యాప్‌టా్‌పలో డాటాను తుడిచేశారు

  • సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాదనలు

  • తదుపరి విచారణ వచ్చేనెల 22కు వాయిదా

  • ప్రభాకర్‌రావు విచారణకు సహకరించాల్సిందే

  • ఆదేశించిన సుప్రీంకోర్టు ధర్మాసనం

న్యూఢిల్లీ, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక నిందితుడు, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఎ్‌సఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు విచారణకు సహకరించడం లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఫోన్‌ ట్యాపింగ్‌లో కీలకమైన ప్రభుత్వ ల్యాప్‌టా్‌పలో డాటాను డిలీట్‌ చేశారని, ఎలకా్ట్రనిక్‌ పరికరాలను ఫార్మాట్‌ చేశారని సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించింది. బీఆర్‌ఎస్‌ హయాంలో ఎస్‌ఐబీ కేంద్రంగా ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు 2023 మార్చి 10న పంజాగుట్ట పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే..! ఈ కేసులో ప్రభాకర్‌రావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. కేసు నమోదవ్వగానే క్యాన్సర్‌ చికిత్స పేరుతో అమెరికా వెళ్లిన ప్రభాకర్‌రావు.. ముందస్తు బెయిల్‌ ఇస్తేనే భారత్‌కు తిరిగి వస్తానని హైకోర్టులో పిటిషన్‌ వేశారు. హైకోర్టు తిరస్కరించడంతో.. ఆ తీర్పును మే 9న సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించడంతో.. ప్రభాకర్‌రావు భారత్‌కు తిరిగి వచ్చారు. సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్‌ సోమవారం మరోమారు విచారణకు వచ్చింది. జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మ ధర్మాసనం ఎదుట తొలుత.. పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రినాయుడు వాదనలను వినిపించారు. ‘‘సిట్‌ విచారణకు ప్రభాకర్‌రావు అన్నివిధాలా సహకరిస్తున్నారు. ఇప్పటి వరకు పదిసార్లు విచారణకు హాజరయ్యారు. దర్యాప్తు అధికారులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు’’ అని ధర్మాసనానికి వివరించారు. ఈ వాదనలపై తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ్‌ లూథ్రా అభ్యంతరం తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, స్టేటస్‌ రిపోర్టులో వివరాలన్నీ స్పష్టంగా పొందుపరిచారమని చెప్పారు. ఆన్‌లైన్‌లో వాదనలను వినిపించిన లూథ్రా.. ఉద్దేశపూర్వకంగానే ప్రభాకర్‌రావు ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించిన పరికరాలను ధ్వంసం చేశారని వివరించారు. ఈ క్రమంలో కల్పించుకున్న జస్టిస్‌ బీవీ నాగరత్న.. ‘‘ప్రస్తుతం ప్రభాకర్‌రావు విచారణకు సహకరిస్తున్నారు కదా? తదుపరి విచారణను సెప్టెంబరు 22కు వాయిదా వేస్తున్నాం’’ అని స్పష్టం చేశారు. దాంతో.. సిద్దార్థ్‌లూథ్రా మాట్లాడుతూ.. ఒక్కసారి స్టేటస్‌ రిపోర్టును చూడాలని ధర్మాసనాన్ని కోరారు. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కలుగజేసుకుంటూ.. సాక్ష్యాలను ధ్వంసం చేయడాన్ని తీవ్రమైన అంశంగా పరిగణించాలని కోరారు. దీనిపై జస్టిస్‌ నాగరత్న స్పందిస్తూ.. డిలీటర్‌ చేసిన డాటాను రిట్రీవ్‌ చేసే సాంకేతికత మన వద్ద ఉంది కదా? అని ప్రశ్నించారు. అదే ప్రయత్నంలో దర్యాప్తు అధికారులు ఉన్నారని తుషార్‌ మెహతా సమాధానం ఇచ్చారు. దీంతో.. విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ధర్మాసనం.. విచారణకు పూర్తిగా సహకరించాలని ప్రభాకర్‌రావును ఆదేశించింది. దర్యాప్తు అధికారులు ఎప్పుడు పిలిచినా.. విచారణకు హాజరవ్వాలని సూచించింది.


ఇవి కూడా చదవండి..

ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ

ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం

For More National News

Updated Date - Aug 26 , 2025 | 04:10 AM