NEET Telangana seats: మెడికల్ సీట్లలో స్థానికతపై కౌంటర్ దాఖలు చేయండి
ABN , Publish Date - Jun 03 , 2025 | 06:06 AM
మెడికల్ సీట్ల కేటాయింపులో స్థానికత నిబంధనపై సమాధానం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. NEET పరీక్షల కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 33లోని నాలుగేళ్ల స్థానిక చదువు నిబంధనపై విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం పరిశీలించింది.
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంనోటీసులు
జీవో 33పై విచారణ
న్యూఢిల్లీ, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): మెడికల్ సీట్ల కేటాయింపులో స్థానికత అంశంపై సమాధానం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. విద్యార్థులు దాఖలు చేసిన ఇంటర్‌లోక్యూటరీ అప్లికేషన్లకు(ఐఏ) కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికతకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జీవో 33ని తీసుకొచ్చింది. నీట్ పరీక్ష రాయడానికి ముందు నాలుగు సంవత్సరాలు స్థానికంగా చదవాలని జీవో 33లోని నిబంధన 3 (ఏ)లో స్పష్టం చేసింది. దీనిని సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కల్లూరి అభిరామ్ సహా 160 మంది తొలుత హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సుధీర్ఘ వాదనల తర్వాత గతేడాది సెప్టెంబర్ 5న హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు చెప్పింది. ఒక విద్యార్థి తెలంగాణలో నివాసం లేదా శాశ్వత నివాసి అని నిర్ధారించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలేవీ రూపొందించలేదని అభిప్రాయ పడింది. తొలుత మార్గదర్శకాలు, నిబంధనలను రూపొందించాలని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును సెప్టెంబర్ 11న రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆ తర్వాత మరికొంతమంది విద్యార్థులు తమకు స్థానికత వర్తింపజేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
అన్ని పిటిషన్లను సోమవారం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అగస్టైన్ జార్జ్ మాసీ్‌హలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పరిశీలించింది. వేసవి సెలవుల తర్వాత దీనిపై విచారణ చేపడతామని ధర్మాసనం తెలపగా, ఈ నెల 14న నీట్ ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని, అందువల్ల వెంటనే విచారణ జరపాలని అభ్యర్థుల తరఫున న్యాయవాదులు విుజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే పుట్టి, అక్కడే చదువుకుని, అన్ని గుర్తింపు కార్డులు ఉన్నప్పటికీ.. కేవలం నాలుగేళ్లు వేరేచోట చదవుకున్నారన్న కారణంతో స్థానికతను వర్తింపజేయకపోవడం సరికాదని వాదనలు వినిపించారు. దీనికి ప్రభుత్వం తరఫున న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణలో పుట్టి వేరే రాష్ట్రాలు, దేశాలకు వెళ్లి చదువుకుని మళ్లీ అడ్మిషన్ల సమయానికి రాష్ట్రానికి తిరిగి వస్తున్నారని ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపించారు. గతంలో కొంతమందికి కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు అవకాశం కల్పించారని, అలాగే తమకూ అవకాశం కల్పించాలని మరికొంతమంది ఇంటర్‌లోక్యూటరీ అప్లికేషన్(ఐఏ)లు దాఖలు చేశారని అభ్యర్థుల తరఫున న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఆ పిటిషన్లపై నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఈలోపు అత్యవసరం అనుకుంటే.. సుప్రీంకోర్టు ఎదుట ప్రత్యేకంగా ప్రసావించవచ్చని తెలిపింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఇవీ చదవండి:
కేంద్రం హెచ్చరిక.. వెనక్కు తగ్గిన రైడ్ హెయిలింగ్ యాప్స్
పాక్‌కు గూఢచర్యం.. భారత యుద్ధ నౌకల వివరాలను చేరవేసిన ఇంజినీర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి