SLBC Tunnel: కట్టుదిట్టంగా ‘సొరంగం’ పనుల పునరుద్ధరణ
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:32 AM
శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం తవ్వకం పనులను పునరుద్ధరించేందుకు కట్టుదిట్టమైన ప్రణాళిక రూపొందించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు
2028 జనవరిలోగా ‘ఎస్‌ఎల్‌బీసీ’ పూర్తి కావాలి
అత్యంత సురక్షిత పద్ధతులు అనుసరించండి
అధికారులతో సమీక్షలో మంత్రి ఉత్తమ్
సొరంగాల నిపుణుడు హర్పాల్ సింగ్ బాధ్యతల స్వీకరణ
నేడు ప్రాజెక్టుపై సమీక్షించనున్న సీఎం రేవంత్
హైదరాబాద్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం తవ్వకం పనులను పునరుద్ధరించేందుకు కట్టుదిట్టమైన ప్రణాళిక రూపొందించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అత్యంత సురక్షితమైన పద్ధతిలో సొరంగం తవ్వకం పనులను పునఃప్రారంభించాలని చెప్పారు. మరో ప్రమాదాన్ని ఊహించలేమని, రెట్టింపు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 2028 జనవరిలోగా పనులు పూర్తి చేయాలన్నారు. నీటి పారుదల శాఖ గౌరవ సలహాదారుడిగా సొరంగాల నిపుణుడు, లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ బుధవారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంత్రి ఉత్తమ్ ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పనుల పునరుద్ధరణపై సమీక్ష నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. రెండు వైపుల నుంచి సొరంగం తవ్వకం జరపాలని, రోజూ కనీసం 7 మీటర్ల మేర తవ్వకం పనులు జరగాలని మంత్రి ఆదేశించారు.
మూడు షిఫ్టుల్లో పనులు జరగాలని, ప్రతి షిఫ్టుకు ఇన్‌చార్జిగా జూనియర్ ఇంజనీర్లను నియమించాలన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు పూర్తి కాకపోవడంతో నీళ్లను పంపింగ్ చేసుకోవడానికి ఏటా రూ.500 కోట్ల విద్యుత్ బిల్లులను చెల్లిస్తున్నామన్నారు. 43.931 కి.మీ. సొరంగం తవ్వాల్సి ఉండగా, ఇప్పటికే 35 కి.మీ. మేర పనులు పూర్తయ్యాయని, మిగిలిన 9.57 కి.మీ. మేర తవ్వాల్సి ఉందని అధికారులు తెలిపారు. కొన్నాళ్ల కిందట సొరంగం కూలిన ప్రదేశం నుంచి 15-20 మీటర్లు మినహా మిగిలిన ప్రాంతంలో తవ్వకాలకు అనువైన పరిస్థితులు ఉన్నాయని వివరించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, కల్నల్ పరిక్షిత్ మెహ్రా, ఈఎన్‌సీ (జనరల్) మహ్మద్ అంజాద్ హుస్సేన్ తదితరులు హాజరయ్యారు.