Kaleshwaram Case: వ్యూహాత్మకమా.. తప్పిదమా
ABN , Publish Date - Sep 02 , 2025 | 04:19 AM
కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ సర్కారు తీసుకున్న నిర్ణయం.. రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఇది భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా తీసుకున్నదా..
కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగింతపై రాజకీయ వర్గాల్లో చర్చ
ఇది పక్కా వ్యూహామే అంటున్న కాంగ్రెస్ పార్టీ వర్గాలు
లోక్‌సభ ఎన్నికల కోసమే తీసుకున్న నిర్ణయమని ప్రచారం
విచారణ జాప్యమైతే బీజేపీ-బీఆర్‌ఎస్ ఒక్కటేనని స్పష్టం
బీజేపీ తెగేదాకా లాగితే.. కొందరు నేతల్లో ఆందోళన
హైదరాబాద్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ సర్కారు తీసుకున్న నిర్ణయం.. రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఇది భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా తీసుకున్నదా.. లేక రాజకీయంగా చేసిన తప్పిదమా అన్న దానిపై చర్చ నడుస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నందునే లోతైన విచారణ కోసం సీబీఐకి అప్పగించామని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నా.. భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమేనని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయమని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీకి సీట్లు తగ్గినా.. తెలంగాణలో మాత్రం రెట్టింపు సీట్లు రావడానికి బీఆర్‌ఎస్ ఓటు బ్యాంకు పెద్ద ఎత్తున ఆ పార్టీకి బదిలీ కావడమే కారణమని కాంగ్రెస్ నేతలు విశ్లేషించిన సంగతి తెలిసిందే. అయితే బీఆర్‌ఎస్ ఓటు బ్యాంకులో.. బీజేపీ వ్యతిరేకులూ పెద్ద ఎత్తున ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని నమ్మించగలిగితే బీఆర్‌ఎ్‌సలోని బీజేపీ వ్యతిరేకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పట్ల ఆకర్షితులవుతారని ఆ పార్టీ అంచనా వేస్తోంది. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడం ద్వారా.. కేసీఆర్‌పై విచారణఅంశాన్ని బీజేపీ కోర్టులోకి నెట్టారన్న ప్రచారం జరుగుతోంది.
వారంతా కాంగ్రె్‌సలోకే..
కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఎప్పట్నుంచో బీజేపీ నేతలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే అనూహ్యంగా రేవంత్ ప్రభుత్వం.. ఆ కేసును సీబీఐకి అప్పగించడంతో త్వరితగతిన విచారణ జరిపించాల్సిన బాధ్యత ఆ పార్టీ నాయకత్వంపై పడినట్లయింది. ఈ కేసు విచారణ ఆలస్యమైతే బీజేపీ, బీఆర్‌ఎ్‌సలు ఒక్కటేనన్న ప్రచారాన్ని ప్రజలు క్రమంగా నమ్ముతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ వైపునకు వచ్చి చేరతాయని అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ముస్లింలు, సోషలిస్టు భావాలు కలవారు కాంగ్రెస్ వైపునకు పూర్తిగా వచ్చి చేరతారని చెబుతున్నారు. ఈ పరిణామం వచ్చే లోక్‌సభ ఎన్నికలతో పాటుగా అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రె్‌సకు అనుకూలంగా మారుతుందంటున్నారు. సీబీఐ తన విచారణను వేగవంతం చేసి.. అక్రమాలు జరిగాయని తేలిస్తే.. కాళేశ్వరంపై విచారణను ప్రారంభించినందుకు ఆ క్రెడిటూ కాంగ్రెస్ ఖాతాలోకే చేరుతుందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడం.. తమ ప్రభుత్వం చేతికి చిక్కిన కేసీఆర్ జుట్టును తీసుకెళ్లి బీజేపీకి అప్పగించినట్లే ఉందన్న అభిప్రాయమూ కొందరు కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. ఘోష్ కమిషన్ విచారణ నివేదిక ఆధారంగా సిట్ ద్వారా విచారణను ప్రభుత్వం చేపట్టాల్సిందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించడంతో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనన్న ప్రచారాన్ని ఇక మీదట బీఆర్‌ఎస్ ఉధృతం చేస్తుందంటున్నారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసే పనిలో ఉన్న బీజేపీ.. విచారణను వేగవంతం చేసి బీఆర్‌ఎస్ ముఖ్య నేతల అరెస్టుల దాకా వెళితే అది ఎటు దారి తీస్తుందోనన్న సందేహాన్నీ వారు వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్, హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై కొన్ని ఘడియల్లో విచారణ
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు
For More TG News And Telugu News