Share News

Panchayat Elections: గెలిచే పార్టీ మనదే!

ABN , Publish Date - Dec 16 , 2025 | 05:14 AM

పార్టీలంటే సిద్ధాంతాలకు, భావజాలానికి వేదికలు. పొత్తులంటే అగ్రనాయకులు క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర/జాతీయ స్థాయి వరకు పెట్టిన కట్టుబాట్లు. ఎన్నికలంటే పార్టీలు నమ్ముకున్న సిద్దాంతాలకు, పెట్టుకున్న కట్టుబాట్లకు లోబడి...

Panchayat Elections: గెలిచే పార్టీ మనదే!

  • పంచాయతీల్లో చిత్ర విచిత్రంగా పొత్తులు

  • గ్రామం యూనిట్‌గా పార్టీల నిర్ణయాలు

  • దూకుడుగా పొత్తులు పెట్టుకున్న బీఆర్‌ఎస్‌

  • తొలిదశ పాఠంతో రెండో దశలో జాగ్రత్త

  • ఎక్కువ చోట్ల బీజేపీతో, కొన్నిచోట్ల సీపీఎంతో..

హైదరాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): పార్టీలంటే సిద్ధాంతాలకు, భావజాలానికి వేదికలు. పొత్తులంటే అగ్రనాయకులు క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర/జాతీయ స్థాయి వరకు పెట్టిన కట్టుబాట్లు. ఎన్నికలంటే పార్టీలు నమ్ముకున్న సిద్దాంతాలకు, పెట్టుకున్న కట్టుబాట్లకు లోబడి ఓటర్ల మద్దతు కోరే ప్రక్రియ. అయితే.. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు ఈ సరిహద్దులను చెరిపేశాయి. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా, గ్రామ స్థాయిలో వర్గాల మధ్య పోరే ప్రాతిపదికగా పొత్తులు మొలిచాయి. రాష్ట్ర స్థాయిలో అధికారం కోసం కొట్లాడుకునే కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలు అనేక పంచాయతీల్లో ఎన్నికల పొత్తులు పెట్టుకున్నాయి. ముఖ్యంగా ఏకగ్రీవాల విషయంలో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎ్‌సల మధ్య గ్రామస్థాయిలో జరిగిన ఒప్పందాలే పని చేశాయని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,728 పంచాయతీలు ఉండగా మూడు విడతల్లో కలుపుకుని 1,205 గ్రామాల్లో ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. దాదాపు పది శాతం గ్రామాలు ఎన్నికను ఏకగ్రీవం చేసుకున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అవుతున్న ఖర్చు భారంగా మారడంతో అనేక గ్రామాల్లో ఇరు పార్టీల నేతలు ఒక అవగాహనకు వచ్చి సర్పంచ్‌, వార్డులను పంచుకుని ఏకగ్రీవం చేసుకున్నారు. మూడు విడతల్లో ఏకగ్రీవం అయిన పంచాయతీల్లో పార్టీలు ఇలా అవగాహనకు వచ్చినవే ఎక్కువని చెబుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు సాంకేతికంగా పార్టీ రహిత ఎన్నికలు కావడంతో అనేక గ్రామాల్లో ప్రధాన పార్టీలు తమ సిద్ధాంతాలను, కట్టుబాట్లను పక్కన పెట్టి పొత్తులు పెట్టుకున్నాయి. కనీసం ఒక జిల్లాలో ఒకరకంగా కూడా వ్యవహరించలేదు. గ్రామం యూనిట్‌గా పెట్టుకుని పోటీ చేశాయి. కొన్ని చోట్ల కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు కలిసి పోటీ చేస్తే, మరి కొన్ని చోట్ల బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు కలిసి కాంగ్రెస్‌ అభ్యర్థులతో పోటీ పడ్డాయి. వామపక్షాలు కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతుగా ఉంటే మరికొన్ని చోట్ల బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు జై కొట్టాయి. ఖమ్మం లాంటి చోట్ల సీపీఐ కాంగ్రె్‌సతో కలిసి నడిస్తే సీపీఎం బీఆర్‌ఎస్‌తో జట్టు కట్టింది. బీజేపీ, మాస్‌ లైన్‌ పార్టీలూ గ్రామస్థాయిలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లతో జట్టు కట్టి కొన్ని సీట్లు దక్కించుకున్నాయి. గ్రామ స్థాయిలో ఇలాంటి పొత్తులతో ఎక్కువగా లబ్ధి పొందింది మాత్రం బీజేపీనేనని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గతంతో పోలిస్తే పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీకి సర్పంచ్‌, వార్డులు ఎక్కువగా లభించడానికి ఆ పార్టీ పెట్టుకున్న పొత్తులూ ఒక కారణమని చెబుతున్నాయి.


పొత్తు లాభం.. పొందు పదవి!

పొత్తు పెట్టుకున్న చోట్ల ఆయా పార్టీలు బాగానే లబ్ధి పొందాయి. ఉదాహరణకు.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 35 పంచాయతీల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి పోటీ చేస్తే అన్ని చోట్లా ఆ పార్టీల అభ్యర్థులు గెలిచారు. వీటిలో 32 బీఆర్‌ఎస్‌ పార్టీ, 3 పంచాయతీలను బీజేపీ దక్కించుకున్నాయి. అలాగే ఈ జిల్లాలో అధికార కాంగ్రెస్‌ పార్టీ.. బీఆర్‌ఎస్‌ పార్టీతో కలిసి 9 పంచాయతీల్లో పోటీ చేయగా.. వాటిలో 8 పంచాయతీలు కాంగ్రెస్‌ పార్టీ, ఒక పంచాయతీ బీఆర్‌ఎస్‌ పార్టీకి దక్కాయి. ఒక పంచాయతీలో నైతే కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు కలిసి కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించాయి. కాంగ్రెస్‌, వామపక్షాలు, మాస్‌లైన్‌ పార్టీలు కలిసి మూడు చోట్ల పోటీ చేసి రెండు స్థానాలు దక్కించుకున్నాయి.

జిల్లాల వారీగా పొత్తు సిత్రాలు ఇలా!

  • భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి, గణపురం, రేగొండ మండలాల్లో సిపిఐ, సిపిఎంలు కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతు ఇచ్చాయి.

  • అదిలాబాద్‌లోని పలు గ్రామాల్లో పార్టీలకు అతీతంగా బంధుత్వాలకు ప్రాధాన్యం ఇచ్చారు.

  • ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండలంలో బీఆర్‌ఎస్‌కు సీపీఎం మద్దతు ఇచ్చింది.

  • నిర్మల్‌ జిల్లాలో అనేక చోట్ల పార్టీల మధ్య సిద్ధాంత విరుద్ధపొత్తులు చోటు చేసుకున్నాయి. పలు గ్రామాల్లో కాంగ్రె్‌సకు బలమైన అభ్యర్థులు ఉన్నచోట్ల బీజేపీ సహా మిగిలిన పార్టీలు, బీజేపీకి బలమైన అభ్యర్థులు ఉన్న చోట్ల కాంగ్రెస్‌ సహా మిగిలిన పార్టీలు మద్దతు ఇచ్చేలా ముందే ఒప్పందాలు చేసుకున్నారు. గెలిచిన అభ్యర్థులను రెండు పార్టీలూ తమ వారిగానే క్లెయిమ్‌ చేసుకుంటున్నాయి.

  • ఖమ్మం జిల్లాలోని పాలేరు, మధిర నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌, సీపీఎంలు పొత్తులు పెట్టుకున్నాయి. కాంగ్రెస్‌, సీపీఐలు ఈ జిల్లాలో తమ పొత్తును కొనసాగించాయి. జిల్లాలో తొలిసారిగా పొత్తులు పెట్టుకున్న బీఆర్‌ఎస్‌, సీపీఎంలకు మంచి ఫలితాలే వచ్యాయి.


  • బీఆర్‌ఎ్‌సకు 75, సీపీఎంకు 24 పంచాయతీలు వచ్చాయి. కాంగ్రెస్‌, సీపీఐ పొత్తూ ఆ కూటమికి బాగానే కలిసొచ్చింది. ఈ పొత్తు వల్ల సీపీఐకి 10 పంచాయతీలు దక్కాయి. సీపీఐ కంచుకోట వీవెంకటాయపాలెంలో కాంగ్రెస్‌, సీపీఐ తలపడ్డాయి. సీపీఐ గెలిచింది. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌ మద్దతుతో ఒక సీటు, బీఆర్‌ఎస్‌, వామపక్షాల మద్దతుతో మారో సీటును దక్కించుకోగలిగింది.

  • హన్మకొండ జిల్లాలో అయినవోలు మండలంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి. ఫలితంగా ఈ మండలంలో బీఆర్‌ఎస్‌ 5, బీజేపీ 1సర్పంచ్‌ సీట్లను దక్కించుకున్నాయి.

  • నిజామాబాద్‌ జిల్లాలో మొదటి విడత ఫలితాల గుణపాఠంతో రెండో విడతగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌ పరస్పరం సహకరించుకున్నాయి. బీఆర్‌ఎ్‌సకు బలమైన అభ్యర్థులున్న చోట్ల బీజేపీ, బీజేపీకి బలమైన అభ్యర్థులు ఉన్నచోట్ల బీఆర్‌ఎస్‌ మద్దతు ఇచ్చాయి. దీంతో రెండో విడత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 24, బీజేపీ 22 గెలుచుకున్నాయి. జాగృతి నుంచి గెలిచిన ఇద్దరూ కవిత ప్రభావంతో కాకుండా సొంతంగా ప్రజల్లో ఉన్న సానుభూతితో గెలిచారు. అన్ని పార్టీల వాళ్లు ఓటేసి గెలిపించారు. వాళ్లిద్దరూ జాగృతి టీమ్‌తో తిరుగుతుండటంతో జాగృతి పేరు వచ్చింది.

  • వరంగల్‌ జిల్లాలో వర్థన్నపేట, పర్వతగిరి మండలాల్లోని గ్రామాల్లో బీఆర్‌ఎ్‌సకు బీజేపీ పరోక్ష సహకారం అందించింది. గీసుకొండ మండలంలో మంత్రి కొండా సురేఖ అనుచరులు ప్రత్యేకంగా పోటీ చేయగా వారికి కొన్నిచోట్ల బీఆర్‌ఎస్‌, బీజేపీలు మద్దతు ఇచ్చాయి.

  • ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అనేకచోట్ల బీజేపీ.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతు ఇస్తోంది. ప్రతిగా ఆయా గ్రామాల్లో పలు వార్డుల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులకు బీఆర్‌ఎస్‌ సహకరిస్తోంది. షాద్‌నగర్‌లో 24 చోట్ల బీఆర్‌ఎ్‌సకు బీజేపీ మద్దతు ఇవ్వగా 16 సీట్లను బీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ స్వగ్రామం వీర్లపల్లిలో బీజేపీ మద్దతుతో బీఆర్‌ఎస్‌ గెలిచింది. ఇబ్రహీంపట్నం ఉప్పరిగూడలో కాంగ్రెస్‌ అభ్యర్థికి బీజేపీ నేతలు మద్దతు ఇస్తున్నారు. మేడిపల్లిలో సీపీఎంకు బీజేపీ నాయకులు మద్దతు ఇస్తున్నారు.

  • ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అన్ని పార్టీలూ స్థానిక పరిస్థితులను బట్టి సిద్ధాంతాలతో సంబంధం లేకుండా పొత్తు పెట్టుకున్నాయి. ఎక్కువచోట్ల బీజేపీ-బీఆర్‌ఎస్‌ పొత్తు నడవగా కొన్నిచోట్ల కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కలిసి పని చేశాయి. కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్‌, బీజేపీ కూడా బీఆర్‌ఎ్‌సకు మద్దతు తెలిపి గెలిపించాయి.

Updated Date - Dec 16 , 2025 | 05:14 AM